
సాక్షి, నర్సీపట్నం : ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేస్తే మాజీ మత్రి అయ్యన్నపాత్రుడుకు తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హెచ్చరించారు. పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనాపై అయ్యన్నపాత్రుడు రాజకీయం చేయడం సిగ్గు చేటు అన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు పక్కనపెట్టి ప్రజలకు అండగా నిలవాల్సిన అయ్యన్నపాత్రుడు తీరు పట్ల ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. ఇప్పుడు రాష్ట్ర రాజధాన్ని విశాఖపట్నానికి తరలించేందుకు కరోనా కేసులు దాచిపెడుతున్నారని, పరిపాలన రాజధాన్ని విశాఖకు తరలిస్తున్నారంటూ అయ్యన్నపాత్రుడు రాజకీయం చేస్తున్నారన్నారు.
కరోనా కేసులు దాయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్న ఆయన గుర్తించుకోవాలన్నారు.కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని జాతీయ మీడియా ప్రశంసించిన విషయాన్ని గుర్తించుకోవాలని హితువు పలికారు. ప్రజలకు సహాయపడకుండా టీడీపీ నాయకుడు చంద్రబాబు హైదరాబాద్, అయ్యన్నపాత్రుడు విశాఖలో ఉంటూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు తీర్పు తెలుగు వారి విజయంగా పేర్కొన్న అయ్యన్నపాత్రుడు తన పిల్లలను ఏ మీడియంలో చదివించారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే టీడీపీ నాయకులు అడ్డుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు మనవుడిని ఎక్కడ చదివిస్తున్నాడో అయ్యన్నపాత్రుడు సమాధానం చెప్పాలన్నారు. తమ పార్టీ నాయకులు, పెద్దలను అగౌరవ పరిచే విధంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఎమ్మెల్యే హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment