
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి భయపడే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్, కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాలన పరంగా కేసీఆర్ పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు. కేసీఆర్ మాట్లాడే మాటలే ఆయన పిచ్చి పాలనకు అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో సరైన కారణం చెప్పడం లేదని విమర్శించారు.
టీఆర్‌ఎస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆరోపించారు. ఆయుష్మాన్ భారత్ కింద 172కోట్లు తెలంగాణకు ఇచ్చినా కేసీఆర్ ప్రభుత్వం వినియోగించుకోలేదన్నారు. కేసీఆర్ స్వలాభం కోసం తెలంగాణ ప్రజలకు మోదీ పథకాలు చేరకుండా చేశారని మండిపడ్డారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చి పారదర్శక పాలన అందించడమే తమ లక్ష్యం అని జగత్ ప్రకాశ్ నడ్డా పేర్కొన్నారు.