సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా మరోసారి భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు రాహుల్ వీరితో చర్చించారు. ఈ భేటీలో ఉత్తమ్‌తో పాటు భక్తచరణ్‌దాస్, శర్మిష్ఠ ముఖర్జీ, జ్యోతిమణి పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటు, టికెట్ల పంపిణీపై రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైనా అభ్యర్థులను ఇంకా ఖరారు చేయకపోవడంపై రాహుల్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
సీట్ల సర్దుబాటు వివాదం, సీపీఐ డిమాండ్ చేస్తున్న మునుగోడు, కొత్తగూడెం స్థానాల అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుపై ఫిర్యాదులు, బీసీలకు సీట్ల కేటాయింపు, కూటమి పార్టీలకు సీట్ల పంపకం తదితర అంశాలను రాహుల్‌కు ఉత్తమ్ వివరించారని సమాచారం. గంట వ్యవధిలో రాహుల్‌లో ఉత్తమ్ సమావేశమయ్యారు. అభ్యర్థుల ఎంపికపై ఎడతెగని కసరత్తు జరుగుతుండటంతో ఆశావహుల్లో ఆందోళన తారాస్థాయికి చేరింది.
మహాకూటమిలో సీట్లపంపకం కొలిక్కి వచ్చి ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కూటమిలోని పార్టీలు సోమవారం ప్రకటిస్తాయని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆశావహులకు నిరాశే మిగలనుంది. అభ్యర్థుల ప్రకటన ఈ రోజు వెలువడే అవకాశాలు కనిపించడం లేదు. ఇతర పార్టీలతో ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కాంగ్రెస్ జాబితా కూడా మంగళవారం వెలువడే అవకాశం ఉంది. మరో పక్క టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడీయా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ అభ్యర్థుల జాబితా ప్రకటన మంగళవారం ఉంటుందని తెలిపారు.
గత అనుభవాల వల్లే అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నామని, గత సంప్రదాయాలకు భిన్నంగా ఈసారి అభ్యర్థుల ప్రకటన ఉంటుందని రమణ తెలిపారు. సీట్ల సర్దుబాటుపై ఈ రోజు సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కూటమి నేతలంతా కలిసి ఒకే వేదికపై అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment