విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. చిత్రంలో జానారెడ్డి, భట్టి విక్రమార్క,పొంగులేటి
సాక్షి,హైదరాబాద్: మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ టీఆర్‌ఎస్‌కు ఎందుకు మద్దతిస్తున్నారో ముస్లింలకు స్పష్టంచేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బహిరంగంగా బీజేపీకి మద్దతు ఇచ్చినందుకా? నాలుగున్నరేళ్లపాటు ముస్లింలను మభ్యపెట్టి మోసం చేసినందుకా? అని ఒవైసీని ప్రశ్నించారు. అసదుద్దీన్ స్వప్రయోజనాల కోసం ముస్లింలను తప్పుదారి పట్టిస్తున్నారని, తన తమ్ముడుపై ఉన్న కేసుల ఉపసంహరణ, రూ.40 కోట్ల విలువైన భూమిని నాలుగు కోట్లకు అప్పనంగా ఇస్తున్నందుకు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు అర్ధమవుతుందని విమర్శించారు. కేసీఆర్ మోదీకి ఏజెంట్ అని, కేసీఆర్‌కు ఓటు వేస్తే మోదీకి వేసినట్లేనని పేర్కొన్నారు. ఢిల్లీలో పెద్ద మోదీ, తెలంగాణలో కేసీఆర్ చోటా మోదీ అని ఆయన అభివర్ణించారు. మంగళవారం గాంధీభవన్‌లో మాజీ మంత్రి జానారెడ్డి, భట్టి విక్రమార్క, అబీద్ రసూల్‌ఖాన్ తదితరులతో కలిసి ఉత్తమ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముస్లింలను మోసం చేస్తున్న టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తుండటంతో మజ్లిస్ నిజస్వరూపం బహిర్గతమైందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అనేక విషయాల్లో కేంద్రంలో బీజేపీకి మద్దతిస్తూ వస్తోందని, నాలుగేళ్ల పాలనలో ముస్లింలకు జరిగిన న్యాయమేంటని ప్రశ్నించారు. నోట్ల రద్దు, జీఎస్టీ విషయాల్లో కూడా కేసీఆర్ బీజేపీకి బాహాటంగా మద్ధతు ప్రకటించాడని గుర్తు చేశారు.
మోసాల కేసీఆర్..
ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని కేసీఆర్ మోసం చేశాడని ఉత్తమ్ ధ్వజమెత్తారు. రిజర్వేషన్ సాధన కోసం ప్రధానితో మాట్లాడాను.. పార్లమెంట్‌ను కదిలిస్తా.. ఢిల్లీలో ధర్నా చేస్తా.. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ప్రకటించినా కనీసం పురోగతి లేకుండా మోసం చేశాడన్నారు. వక్ఫ్‌బోర్డుకు అధికారాలు, వక్ఫ్ ఆక్రమణ భూములు స్వాధీనం చేసుకుంటామని వాగ్ధానంచేసి కనీసం ఒక గజం భూమిని కూడా స్వాధీనం చేసుకోలేకపోయాడని విమర్శించారు. ముస్లింలకు కేటాయించిన బడ్జెట్‌లో సగంకూడా ఖర్చు చేయలేదని, కేంద్రం మైనారిటీ సంక్షేమ నిధులు తగ్గించినా కనీసం నోరు మెదపలేదని ఆరోపించారు. టీఆర్‌ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో సుమారు 90 శాతం మైనారిటీ కాలేజీలు మూతపడ్డాయని అన్నారు. సుధీర్ కమిషన్ సిఫార్సులు ఒక్కటి కూడా అమలు చేయలేదని, ఒక ఉర్దూ ఉపాధ్యాయుడిని కూడా నియమించలేదని దుయ్యబట్టారు. ఆలేరు ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ముస్లిం యువకులు మృతిచెందారని, అసలు ఏం జరిగిందన్న అంశంపై నేటికి నివేదిక సమర్పించ లేదన్నారు. ముస్లిం వర్గాలను అవహేళన చేసేవిధంగా, అసెంబ్లీ రద్దుచేసే ఒక రోజు ముందు ఉర్డూ అకాడమీ పాలకమండలిని ఏర్పాటు చేశారని విమర్శించారు.
అన్నీ వైఫల్యాలే...
ముస్లింలకు చేసిన వాగ్ధానాల్లో కేసీఆర్ అన్నింటా విఫలమయ్యారని ఉత్తమ్ ఆరోపించారు. ఇస్లామిక్ సెంటర్‌కోసం ఇప్పటివరకు పునాది రాయికూడా వేయలేదని, అజ్మీర్‌లో రుబాత్, హైదరాబాద్‌లో అనీస్–ఉల్–గుర్బాలకు ఒక్క రూపాయికూడా విడుదల చేయలేదన్నారు. నాలుగు సంవత్సరాల బడ్జెట్లో ముస్లింలకు కేవలం 0.4 శాతం మాత్రమే నిధులు కేటాయించారని విమర్శించారు.
బీజేపీతో జతకట్టేందుకే
టీఆర్‌ఎస్ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వ్యూహం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో జతకట్టేందుకే అని ఉత్తమ్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనన్నారు. ముస్లిం సోదరులు గమనించి ఢిల్లీలో మోదీని, ఇక్కడ చోటా మోదీని ఓడించాలని పిలుపునిచ్చారు. పాతబస్తీలో సీరియస్‌గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను రంగంలో దింపుతామన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని, త్వరలో ముస్లింల సంక్షేమం కోసం ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment