సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండకూడదనే ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతల వారు చేసే రాజకీయాలు ప్రజలకు తెలియకుండా చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం తర్వాత జరిగిన పరిణామాలను ప్రజలంతా చూస్తూనే ఉన్నారని ఆమె అన్నారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని చంద్రబాబు చులకన చేసి మాట్లాడటాన్ని దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. గతంలో చంద్రబాబు వల్లే తనకు ప్రాణ హాని ఉందని పరిటాల రవి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. రవి హత్యకేసుకు వైఎస్ జగన్‌కు ముడిపెడితే.. అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించిన సంగతి గుర్తులేదా అని సూటిగా ప్రశ్నించారు.
సొంతంగా పార్టీ పెట్టే ధైర్యం లేని చంద్రబాబు కూడా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక్క వైఎస్ జగన్‌పైనే ఎందుకు ఇన్ని కుట్రలు పన్నుతున్నారని చంద్రబాబుని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌కు ప్రజాదరణ పెరుగుతుండటమే ఈ కుట్రలకు కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. చంద్రబాబు పరమానందయ్య శిష్యుడి స్థాయికి కూడా సరిపోడని విమర్శించారు. ఆపరేషన్ గరుడ పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతుందని తెలిపారు. హత్యాయత్నం వెనుక సీఎం, డీజీపీలు ఉన్నారు.. కాబట్టే విచారణ ముందుకు సాగడం లేదని ఆమె ఆరోపించారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాల నుంచి హత్యా రాజకీయాలకి దిగజారారని ఆమె వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment