
వైఎస్ఆర్‌సీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్
సాక్షి, విజయవాడ: ప్రజలు పారిపోతున్నా తలుపులు మూసి ఉపన్యాసాలు దంచే వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అని, కానీ బడ్జెట్‌పై మాత్రం గత రెండు వారాలుగా ఎందుకు మాట్లాడటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఎంపీలు మాట్లాడుతున్నారు, మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు.. అయితే దుబాయ్ నుంచి తిరిగిరాగానే చంద్రబాబు మౌనం వహించడంలో అర్థమే లేదన్నారు. విజయవాడలో వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కేవలం మీడియాకు లీకులు ఇస్తూ ఎందుకు నేరుగా మీడియాతో మాట్లాడటం లేదని నిలదీశారు. వైఎస్ జగన్ పబ్లిక్‌గా ఏపీకి సంబంధించిన ప్రతి అంశంపై మాట్లాడుతున్నారని, సీఎం చంద్రబాబు అజ్ఞాతంలో దాక్కున్నారని ఎద్దేవా చేశారు.
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కనీసం ప్రశ్నించలేకపోవడం నరేంద్ర మోదీపై చంద్రబాబుకున్న భయాన్ని బయటపెట్టింది. గతంలో ప్రత్యేక హోదా 15ఏళ్లు కావాలని గతంలో అడిగిన చంద్రబాబుకు నేడు ఆ విషయం గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు ఏప్రిల్ 6న రాజీనామా చేస్తారని వైఎస్ జగన్ ప్రకటించారని, ఈ నిర్ణయాన్ని స్వాగతించకుండా మీ నాయకులతో ఎందుకు కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. నాడు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడేందుకు మాట్లాడటం లేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి అమ్ముడబోయి.. ప్రత్యేక రైల్వేజోన్, దుగరాజపట్నం ఓడరేవు, పోలవరాన్ని, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని విమర్శించారు. టీడీపీ నేతలు చీము నెత్తురు లేకుండా ఇంకా కేంద్రంతో కలిసి పని చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. వైఎస్ జగన్ పెట్టిన డెడ్‌లైన్‌కు మా ఎంపీలు సిద్ధంగా ఉన్నారని వెల్లంపల్లి శ్రీనివాస్ వివరించారు.
'కేబినెట్ మంత్రులకు భయం పట్టుకుంది'
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనకు ఏపీ మంత్రులు భయపడ్డారని, అందుకే మంత్రులు మీడియాలో లేని హడావుడి చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మల్లాది విష్ణు పేర్కొన్నారు. లేకపోతే ఏకంగా ఒకేరోజు ముగ్గురు, నలుగురు మంత్రులు మీడియాతో మాట్లాడటమే వారి డొల్లతనాన్ని బయటపెట్టిందన్నారు. శిల్పా చక్రపాణిరెడ్డితో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి వైఎస్ఆర్‌సీపీలోకి ఆహ్వానించి తన రాజకీయ విలువలు, విశ్వసనీయత చాటుకున్న గొప్పవ్యక్తి వైఎస్ జగన్ అని చెప్పారు. కాగా, వైఎస్ జగన్ పాదయాత్రకు ప్రజలు రావడం లేదంటూ ఓ వైపు చేస్తున్న అసత్య ప్రచారం చాలదన్నట్లు.. హోదా కోసం నిరసనగా మా ఎంపీలు రాజీనామా నిర్ణయం తీసుకోవడంతో ప్రెస్‌మీట్లు పెట్టి మరీ విమర్శలు చేయడం దారుణం అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు చేసే రాజీనామాల అంశాన్ని నీరుగార్చేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తుందన్నారు.
మీకు దమ్ము, ధైర్యం ఉంటే వైఎస్ జగన్ నిర్ణయాన్ని స్వాగతించాలని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. కేంద్రంతో పోరాడేతత్వం వైయస్ జగన్‌కు కొత్త కాదన్నారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని ఏ రోజైనా చెప్పారా.. మీ అసమర్థత హోదా విషయంలో తేటతెల్లం అవుతోంది. ఇంకా చెప్పాలంటే మీ మిత్రపక్షం బీజేపీ అడిగిన వాటికే చంద్రబాబు వద్ద సమాధానం లేదు. టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రిగా కుర్చీలో ఉంటారు.. కానీ హోదా కోసం చేస్తున్న పోరాటంలో మాత్రం కనిపించరంటూ ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు చేస్తున్నారు. ఏపీ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పాలన గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏమిచ్చారో చెప్పలేని పరిస్థితిలో కేంద్రం, ప్రశ్నించలేని దీనస్థితిలో సీఎం చంద్రబాబు ఉన్నారని మల్లాది విష్ణు దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment