
సాక్షి,అమరావతి: చంద్రబాబు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుతోపాటు టీడీపీ నేతలంతా బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎద్దేవా చేశారు. సోమవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కరోనా వల్ల ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా.. ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రతి సంక్షేమ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారని చెప్పారు.
మంత్రి వెలంపల్లి ఏమన్నారంటే..
► చంద్రబాబు, పవన్, కన్నా, ఇతర తోక పార్టీలు రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందంటూ అభూత కల్పనలతో విమర్శలు చేయడం దుర్మార్గం. చంద్రబాబు, ప్యాకేజీలకు అమ్ముడుపోయే పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో కూర్చున్నారు.
► అవినీతికి అడ్రస్‌గా మిగిలిన కన్నా గుంటూరులో కూర్చుని విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్‌కు లేఖ రాయడం కాదు.. రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి కన్నా లేఖ రాయాలి.
► ప్రధాన ఆలయాల ద్వారా 50 వేల ఆహార పొట్లాలను పేదలకు పంపిణీ చేయిస్తున్నాం. సీఎం ఆదేశాల మేరకు 2,500 ఆలయాల్లో పని చేస్తున్న అర్చకులకు రూ.5 వేల చొప్పున సాయం అందించాం.
► పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజన్లకు కూడా రూ.5 వేల చొప్పున అందిస్తున్నాం. అన్ని మతాలను సమానంగా చూస్తుంటే.. కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం బాధ కలిగిస్తోంది.
ఎమ్మెల్యే విష్ణు మాట్లాడుతూ..
► ప్రజలంతా కరోనా బారిన పడాలని చంద్రబాబు, యనమల, దేవినేని, లోకేష్ కోరుకుంటున్నారు.
► రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిన చంద్రబాబు అప్పుల అప్పారావుగా చరిత్రలో నిలిచిపోయారు. దేవినేని ఉమకు హెల్త్ ఎమర్జెన్సీ స్పెల్లింగ్ తెలుసా.
► కరోనా కేసులు దాస్తున్నామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై బెజవాడ సెంటర్‌లో టీడీపీ నేతలతో చర్చకు సిద్ధం. ధైర్యముంటే చంద్రబాబు, యనమల, దేవినేని ఉమ చర్చకు రావాలి.