
మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భయానికి కారణమేంటో తెలుగుదేశం పార్టీ నేతలు సమాధానం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లాది విష్ణు అన్నారు. ఆయన శుక్రవారం వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అవినీతి మీద కేంద్ర ప్రభుత్వం కన్నువేయడమే భయానికి కారణమన్నారు. బీజేపీతో పొత్తుకు టీడీపీ ఇంకా వెంపర్లాడుతూ తమపై విమర్శలు చేయడమా అని మండిపడ్డారు. కేంద్రమంత్రి రాందాస్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని విష్ణు స్పష్టం చేశారు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని తమపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తమకు ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయన్నారు. మరో వైపు 104 ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అంతా దుష్ర్పచారం: వెల్లంపల్లి
చంద్రబాబు అభద్రతా భావంతో మాట్లాడుతున్నారని మరో నేత వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. గతంలో ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు ఇలాగే మాట్లాడారని గుర్తుచేశారు. ప్రజలను అడ్డుపెట్టుకుని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చట్టవిరుద్ధంగా చేసిన పనుల వల్లే చంద్రబాబు భయపడుతున్నారని తెలిపారు. చంద్రబాబును ఎన్డీఏలోకి తిరిగి ఆహ్వానిస్తున్నామని కేంద్రమంత్రి అన్న మాటలు ఎల్లో మీడియాకు కనిపించవా అని ఆయన ప్రశ్నించారు. తమపై దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేవినేని ఉమకు ధైర్యం ఉంటే 2019లో మైలవరం నుంచి పోటీ చేయగలరా అని వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment