
సాక్షి, విజయవాడ: ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్.. చంద్రబాబు తొత్తులా వ్యవహరిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. వ్యక్తులకు కొమ్ము కాస్తూ రాజ్యాంగబద్ధమైన పదవికి ఆయన కళంకం తెస్తున్నారని మండిపడ్డారు. గురువారం మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. నిమ్మగడ్డ పేరుతో విడుదలైన లేఖలోని సారాంశం ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందన్నారు. ఎన్నికల కమిషనర్ పేరుతో ఆ లేఖను పచ్చ మీడియాలో పదేపదే చూపించారని.. ఆ లేఖను ఖండించకపోవటంలో నిమ్మగడ్డ ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈసీ మౌనం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆ లేఖ చంద్రబాబు కార్యాలయంలో ప్రిపేర్ చేసినట్లు ఉందని అభిప్రాయపడ్డారు. (పవన్ కళ్యాణ్ ఓ అజ్ఞాని)
ఈసీ ఆత్మపరిశీలన చేసుకోవాలి
రాజ్యాంగ పదవిలో కొనసాగుతూ రాజకీయ పార్టీ నేతలా వ్యవహరిస్తున్న రమేష్ కుమార్‌ను వెంటనే ఎస్‌ఈసీ నుంచి తప్పించాలని కోరారు. ఈ విషయంలో కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. సాక్ష్యాధారాలు లేకుండా ప్రభుత్వంపై నిందలు వేయటం భావ్యం కాదని, రమేష్ ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. విచక్షణాధికారానికి వక్రభాష్యం చెపుతున్న చంద్రబాబుకు అదే విచక్షణతో జనం బుద్ధి చెబుతారని వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటుగా వ్యాఖ్యానించారు. (తీర్పు తర్వాత ఆకాశ రామన్న లేఖ!)
Comments
Please login to add a commentAdd a comment