
సాక్షి, హైదరాబాద్: ఉన్నావ్, హైదరాబాద్ లాంటి ఘటనలను నిరోధించేందుకు కావాల్సింది కొత్త బిల్లులు కావని, రాజకీయ చిత్తశుద్ధి, పాలనాపరమైన నైపుణ్యంతోనే అరికట్టడం సాధ్యమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మహిళల అత్యాచార ఘటనలపై నిర్భయ లాంటి చట్టం ఉండగా కొత్తగా బిల్లులు ఎంత మాత్రం పరిష్కారం చూపలేవని, ప్రజల ఆలోచనా వైఖరి, విద్యా వ్యవస్థలో మార్పుతో పాటు దేశ సంస్కృతి పట్ల గౌరవం ఉన్నప్పుడే ఇలాంటి ఘటనలను రూపుమాపడం సాధ్యమవుతుందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో జరిగిన ఆల్ ఇండియా సర్వీస్, సెంట్రల్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ల 94వ ఫౌండేషన్ కోర్సు ముగింపు కార్యక్రమంలో వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలు, గురువులు, పెద్దలను ఎలా గౌరవించాలో పాఠశాల స్థాయి నుంచి బోధిస్తూనే కఠిన చట్టాలను రూపొందించాలన్నారు. బాధితులు ఫిర్యాదులు చేసినప్పుడు సత్వరమే స్పందించడంతో పాటు, వేగవంతమైన విచారణ, సత్వర న్యాయం జరిగేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
సమాజంలో నైతిక విలువలు వేగంగా పతనమవుతున్నాయని, భారతీయ మూలాల్లోకి తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో మనుగడ కోసం ప్రకృతిని, సంస్కృతిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో నేటికీ 18 నుంచి 20 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని, పేదరికానికి దారితీస్తున్న కారణాలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాల్సిన అవసరం ఉందని వెంకయ్య నాయుడు అన్నారు. ప్రభుత్వాలు తాత్కాలికంగా ఇచ్చే తాయిలాలు పేదలకు ఎలాంటి మేలు చేయవని, సామాజిక, లింగ వివక్షతో పాటు ఆర్థిక అంతరాలు తొలగించాలని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజలకు చేరువై సుపరిపాలన ద్వారా ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందన్నారు. వ్యవసాయ, వ్యాపార రంగాలు దేశానికి రెండు కళ్లలాంటివని, వలసవాద ఆలోచనా ధోరణి నుంచి ప్రజలు బయటకు రావాలన్నారు.
శిక్షణలో ప్రతిభ చూపిన వారికి అవార్డులు..
తొలుత అంబేడ్కర్ చిత్రపటానికి వెంకయ్యనాయుడు నివాళి అర్పించారు. ఫౌండేషన్ కోర్సు జర్నల్‌ను విడుదల చేయడంతో పాటు, శిక్షణలో ప్రతిభ చూపిన పది మంది అధికారులకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, కేంద్ర డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ జాయింట్ సెక్రటరీ రష్మి చౌదరి, ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ బీపీ ఆచార్య, అదనపు డీజీ హర్‌ప్రీత్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment