దత్తన్నను అవమానించారు | VH and KK comments on dattatreya central ministry issue | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 2 2017 12:48 AM | Last Updated on Mon, Oct 2 2017 12:48 AM

VH and KK comments on dattatreya central ministry issue

అలయ్‌–బలయ్‌ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంపీ బండారు దత్తాత్రేయ. చిత్రంలో వివిధ పార్టీల నేతలు

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర మంత్రి వర్గం నుంచి బండారు దత్తాత్రేయను తొలగించడం సరికాద ని ఎంపీ కె.కేశవరావు, మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ దత్తాత్రేయ నిర్వహించిన ‘అలయ్‌ బలయ్‌’ సందర్భంగా వారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఏటా దసరా సందర్భంగా దత్తాత్రేయ నిర్వహిస్తున్న ‘అలయ్‌ బలయ్‌’ ఆదివారం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం అహిర్, శాసన మండలి చైర్మన్‌ కె.స్వామిగౌడ్, డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని, ఈటల రాజేందర్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, టీ జేఏసీ చైర్మన్‌ కోదండరాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎంపీలు కె.కేశవరావు, జితేందర్‌రెడ్డి, బీబీ పాటిల్, పలు రాజకీయ పార్టీల నేతలు, అధికారులు, సామాజిక ఉద్యమకారులు పాల్గొన్నారు.  ‘అలయ్‌ బలయ్‌’ తో పరస్పర భిన్నమైన నేపథ్యమున్న, సైద్ధాంతిక విభేదాలున్న వారిని  దత్తాత్రేయ ఏకం చేస్తున్నారని నేతలంతా కొనియాడారు. 

ప్రమోషన్‌ వస్తుందనుకుంటే.. 
దత్తాత్రేయ కేంద్రమంత్రిగా అలయ్‌ బలయ్‌ నిర్వహిస్తే కార్యక్రమం ఇంకా భారీగా ఉండేదని వీహెచ్‌ పేర్కొన్నారు. బీసీ వర్గానికి చెందిన దత్తాత్రేయకు ప్రమోషన్‌ వస్తుందనుకుంటే ఉన్న పదవినే తీసేశారన్నారు. ప్రధాని మోదీ అగ్రకులాల వారిని తీసుకొచ్చి బీసీలను మంత్రి పదవి నుండి తీసేశారని.. బీసీలను అవమానించారని విమర్శించారు. ఈ అంశంపై బీసీలంతా ఆవేదనతో ఉన్నారని ఎంపీ కేకే పేర్కొన్నారు. అయితే దీనిపై ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి హన్స్‌రాజ్‌ గంగారం అహిర్‌ వివరణ ఇచ్చారు. దత్తాత్రేయను ఎవరూ అవమానించలేదని, భవిష్యత్తులో సమున్నత స్థానం దక్కుతుందని చెప్పారు.

ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధిని దేశ ప్రజలంతా హర్షిస్తున్నారన్నారు. కాగా దత్తాత్రేయకు గవర్నర్‌ వంటి పెద్ద పదవులు రావాలని జేఏసీ చైర్మన్‌ కోదండరాం, మంత్రి నాయిని, కేకే, వీహెచ్‌లు ఆకాంక్షించారు. ఏకత్వంలో భిన్నత్వాన్ని సహనంతో కొనసాగించాలని.. ‘అలయ్‌ బలయ్‌’వంటి కార్యక్రమాలు ఆహ్వానించదగినవని సురవరం సుధాకరరెడ్డి పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement