
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల షాక్ నుంచి తేరుకోకముందే చంద్రబాబు మరో యూటర్న్ తీసుకున్నారంటూ ఎంపీ వి.విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘ఎన్నికల షాక్ నుంచి తేరుకోకముందే చంద్రబాబు మరో యూటర్న్. ఇకపై కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏలో కొనసాగరట. కేంద్రంపై పోరాటాలకు విరామం ఇస్తారట. అర్థమవుతోంది గదా.. మోదీ, అమిత్ షాకు మోకరిల్లే ప్రయత్నం అని. ముగ్గురు ఎంపీలతో ఆయన ఎన్ని యూటర్న్‌లు తీసుకున్నా పట్టించుకునే వారుండరు’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష పార్టీ తమ నాయకుడి సౌకర్యాలు, ఇబ్బందుల గురించి ఆందోళనకు దిగడం సిగ్గుచేటని విమర్శించారు. ‘విమానాశ్రయంలో భద్రతా నియమాలు ఎవరైనా పాటించాల్సిందే.
ప్రజలు ఛీకొట్టిన తరువాత కూడా ఇంకా సీఎంగానే కొనసాగుతున్నట్టు ఆయన భ్రమపడటం, మీరు భజన చేయడం ఎబ్బెట్టుగా లేదా’ అంటూ మరో ట్వీట్‌లో ఎద్దేవా చేశారు. వెన్నుపోటు, నయవంచన, అక్రమాలతో సీఎం అయిన చంద్రబాబు 14 ఏళ్లపాటు తన కుటుంబం, తనవాళ్ల కోసమే పనిచేశారని, ఆయనేదో స్వాతంత్రం కోసం పోరాడిన యోధుడైనట్టుగా కొందరు ఉన్మాదులు ఊగిపోవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబే అందరినీ అవమానాలకు గురిచేసి హేళనగా చూశారని గుర్తు చేశారు. ‘సీఎంగా ఉన్నప్పటి ప్రభుత్వ మర్యాదలు, మినహాయింపులు ఇంకా కొనసాగాలని చంద్రబాబు ఆశిస్తున్నారు. ఎన్నికల్లో ఆయనకు వాతలు పెట్టిన ప్రజలకు ఇవన్నీ ప్రాముఖ్యత లేని అంశాలుగా కనిపిస్తున్నాయి. యువ ముఖ్యమంత్రి తమ పట్ల కనబరుస్తున్న శ్రద్ధ, తీసుకుంటున్న నిర్ణయాలు వారిలో కొత్త ఆశలు నింపాయి’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.