
గాంధీ విగ్రహం వద్ద విజయసాయి రెడ్డి నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ చేయకుండా ప్యాకేజీకి ఒప్పుకొని చంద్రబాబు పెద్ద తప్పు చేశారని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత రాజ్యసభ ప్రారంభం కాగానే ప్లకార్డుతో వెల్‌లోకి వెళ్లి ఆందోళన కొనసాగించారు. సభా కార్యక్రమాలు స్తంభించడంతో చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు సభను గురువారానికి వాయిదా వేశారు. అంతకుముందు ఆయన గాంధీ విగ్రహం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోవడం ఒక పెద్ద తప్పు. ప్రత్యేక హోదాను పణంగా పెట్టాడు. హోదా సంజీవని కాదన్నాడు. ప్యాకేజీయే మెరుగైందన్నాడు.
ఈ రాష్ట్రానికి ఇంత అన్యాయం జరగడానికి కారణం చంద్రబాబే. తన యూ టర్న్ ధోరణుల వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ప్రజలంతా దీన్ని అర్థం చేసుకుంటున్నారు. ఏ నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికిరాడు. స్వప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలు తగవు. కేంద్ర ప్రభుత్వం విదేశీ సంస్థల నుంచి తెచ్చుకోండని మభ్యపెడుతోంది. చంద్రబాబు దేనికీ పోరాటం చేయడం లేదు. ఎక్కడా ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగడం లేదు. దీనికి ప్రధాన కారణం తెలుగు దొంగల పార్టీ. తెలుగు డ్రామాల పార్టీ..’ అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment