
సాక్షి, విశాఖపట్నం : ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలు, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయని బీజేపీ వైఖరికి నిరసనగా ఈ నెల 30న ‘వంచన దినం’ నిర్వహిస్తున్నామని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విశాఖలో మాట్లాడుతూ..చంద్రబాబు, మోదీలు రాష్ట్రానికి హోదా రాకుండా చేశారని ఆరోపించారు.
2014 ఏప్రిల్ 30న తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని చంద్రబాబు, మోదీలు హామీ ఇచ్చారని, ఇంత వరకూ అది నెరవేర్చలేదని మండిపడ్డారు. నాలుగేళ్లుగా హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఉద్యమిస్తూనే ఉందని గుర్తుచేశారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చకుండా అలసత్వం ప్రదర్శించిన చంద్రబాబు, మోదీలు నయవంచకులని విమర్శించారు. ఈ నెల 30న జరిగే ‘వంచన దినం’ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారని విజసాయి రెడ్డి తెలిపారు.