
విజేందర్ సింగ్
న్యూఢిల్లీ : ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి మరో క్రీడాకారుడు దిగారు. ఇప్పటికే భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తన పొలిటికల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించగా.. తాజాగా ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్ సైతం ఎన్నికల సమరానికి సై అన్నారు. బాక్సింగ్ రింగ్‌ను వదిలి పొలిటికల్ బౌట్‌లో పంచ్‌లు విసిరేందుకు సిద్దమయ్యారు. గంభీర్ ఈస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తుండగా.. దక్షిణ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున విజేందర్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన తన డీఎస్పీ పదవికి కూడా రాజీనామా చేశారు. విజేందర్ రాజీనామాను ఆమోదించినట్లు హర్యానా అడిషనల్ సీఎస్ ఎస్‌ఎస్ ప్రసాద్ మీడియాకు తెలిపారు. 2008 బీజింగ్ ఒలింపిక్‌లో కాంస్య పతకం సాధించిన విజేందర్‌కు హర్యాన ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగంతో సత్కరించింది. ఒలింపిక్స్ పతకం సాధించిన తొలి భారత బాక్సర్ విజేందరేనన్న విషయం తెలిసిందే.
ఇక తనకు అవకాశం కల్పించిన కాంగ్రెస్‌కు విజేందర్ సింగ్ ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ‘20 ఏళ్ల నా బాక్సింగ్ కెరీర్‌లో దేశం తలెత్తుకునేలా చేశాను. ఇప్పుడు ఈ దేశానికి ఇంకా ఏదో చేయాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని అంగీకరిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్‌కు, పార్టీ అధినేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ధన్యవాదాలు.’ అని ట్వీట్ చేశారు.
దక్షిణ ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ రమేష్ బిధూరీ పోటీ చేయనుండగా.. ఆమ్‌ఆద్మీ పార్టీ నుంచి రాఘవ్ చాధా బరిలో ఉన్నారు. దక్షిణ ఢిల్లీ స్థానం హర్యానాకు ఆనుకొని ఉండటంతో.. జాట్లు, గుర్జర్ సామాజిక వర్గాల ఓటర్లను విజేందర్ తనవైపు తిప్పుకోగలడని భావించిన కాంగ్రెస్ ఈ సీటును అతనికి కేటాయించింది. దక్షిణ ఢిల్లీ మినహా ఢిల్లీలోని ఆరు లోక్ సభ స్థానాలకు శనివారం సాయంత్రమే అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. దక్షిణ ఢిల్లీ స్థానాన్ని మాత్రం సోమవారం అర్థరాత్రి తర్వాత విజేందర్ సింగ్ కేటాయించినట్లు పేర్కొంది. మూడుసార్లు ఢిల్లీ సీఎంగా పని చేసిన షీలా దీక్షిత్‌కి ఆ పార్టీ ఈశాన్య ఢిల్లీ టికెట్ కేటాయించగా.. గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన అజయ్ మాకెన్‌ను న్యూఢిల్లీ స్థానం నుంచి బరిలో దింపుతోంది. చాందినీ చౌక్ నుంచి జేపీ అగర్వాల్, తూర్పు ఢిల్లీ నుంచి అర్విందర్ సింగ్ లవ్లీలకు అవకాశం కల్పించింది. వాయవ్య ఢిల్లీ నుంచి రాజేశ్ లిలోతియా, పశ్చిమ ఢిల్లీ నుంచి మహాబల్ మిశ్రాలు పోటీ చేస్తారని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment