భారత జనాభాలో అయిదోవంతు ఉన్న దళితులు వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారనున్నారు. కొత్త తరం దళితుల సంఖ్య ఈసారి గణనీయంగా పెరగడంతో ఎన్నికల్లో వారే కీలక ఓటు బ్యాంకు కానున్నారు. 2.3 కోట్ల మంది యువ దళిత ఓటర్లు తొలిసారిగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. దేశం మొత్తమ్మీద ఉన్న దళిత జనాభాలో వీరే 19 శాతం ఉన్నారు. బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే వారి సంఖ్య అత్యధికంగా ఉంది. 1991–2011 మధ్య కాలంలో భారత జనాభా పెరుగుదల రేటు కంటే దళిత జనాభా పెరుగుదల రేటు చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఈ సారి యువ దళిత ఓటర్ల సంఖ్య పెరిగింది.
అలాగే ఈ కొత్త తరం ఓటర్లలో 90 శాతం మంది చదువుకున్నవారే. తత్ఫలితంగా దళితులు సామాజికంగా ఎంత అణచివేతకు గురవుతున్నారు? ఏయే రంగాల్లో తమ వర్గం పరిస్థితి ఎలా ఉందన్న అవగాహన వారిలో బాగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ప్రస్తుతం 27,518 ఉద్యోగాలు ఖాళీగా ఉండగా వాటిలో మూడో వంతు దళితులకు రిజర్వ్ చేసినవే. కానీ ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి 2012 సంవత్సరం నుంచి ఒక్క ప్రయత్నం కూడా జరగలేదు. అలాగే దళిత వర్గానికి చెందిన వారు వివిధ ప్రభుత్వ శాఖల్లో అధికారుల కంటే బాగా కింది స్థాయి ఉద్యోగాల్లోనే ఎక్కువగా పనిచేస్తుండటంతో యువ దళితులు అసహనంతో ఉన్నారు. అన్యాయాలపై గళమెత్తి ప్రశ్నించే వారి సంఖ్య కూడా పెరిగింది.
బుజ్జగించే వ్యూహంలో బీజేపీ
దళితుల్ని ఆకట్టుకోవడం కోసం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 127వ జయంతి సందర్భంగా బీజేపీ పలు వ్యూహాలను రచిస్తోంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై పెరిగిపోతున్న దాడులు, అంబేడ్కర్ విగ్రహాల కూల్చివేతలు, వాటికి కాషాయ రంగులు పూయడం, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు తాజా తీర్పు వంటి పరిణామాలతో దేశంలో దళితులు అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు మోదీ దళిత వ్యతిరేకి అంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి బీజేపీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే అంబేడ్కర్ స్మారకం ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ యువ దళిత ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment