
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో ముఠా రాజకీయాలు గతమని, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ నాయకుల నుంచి సామాన్య కార్యకర్తల వరకు అందరూ కలసి పనిచేశారని సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోసం తిరుగుబాటు చేస్తున్నారని, 15 ఏళ్ల బీజేపీ పాలనకు చరమగీతం పలుకుతామని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ప్రముఖ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావడం, సీఎం పదవికి పోటీ, రాబోయే లోక్‌సభ ఎన్నికలు తదితరాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. కాంగ్రెస్ గెలిస్తే సీఎం రేసులో ముందు వరుసలో ఉంటారా? అని ప్రశ్నించగా ఊహాజనిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేనని దాటేశారు. రాష్ట్రంలో బీజేపీని గద్దె దించడమే కాంగ్రెస్ ఏకైక లక్ష్యమని, ఆ తరువాతే పార్టీ హైకమాండ్ ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తుందని తెలిపారు. సింధియాతో పాటు మరో సీనియర్ నేత కమల్‌నాథ్ సీఎం రేసులో ఉన్నట్లు భావిస్తున్న సంగతి తెలిసిందే.
ఐకమత్యమే మా బలం..
సీఎం అభ్యర్థిని ప్రకటించిన తరువాత సీనియర్ నాయకులు తమకు అన్యాయం జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశాలున్నాయా? అని అడగ్గా..అలాంటిదేం ఉండదని అన్నారు. గతం నుంచి పాఠాలు నేర్చుకున్నామని, అప్పుడు అంతర్గత కుమ్ములాటలతో నష్టపోయామని గుర్తుచేశారు. తాజా ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా పనిచేశారని తెలిపారు. ఐకమత్యమే ఈసారి పార్టీ బలమని, అది అలాగే కొనసాగాలని అన్నారు. మీడియా తరచూ లేవనెత్తుతున్న అంతర్గత విభేదాలు కాంగ్రెస్‌కు ఇప్పుడు సమస్యే కావని నొక్కి చెప్పారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పోటీ ఇవ్వలేకపోవడానికి కారణం ఐకమత్యం లేకపోవడమే నన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో రాష్ట్ర యూనిట్ పని సంస్కృతిలోనూ మార్పు వచ్చిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment