
ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న కంభంపాటి, జీవీఎల్, గోకరాజు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సీఎం చంద్రబాబు పర్యటనపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. టీడీపీ పరపతి పూర్తిగా క్షీణించినట్లు తన ఢిల్లీ పర్యటన ద్వారా చంద్రబాబే బహిర్గతం చేసుకున్నారని వ్యాఖ్యానించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మంగళవారం సాయంత్రం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. రాజకీయంగా వైఎస్సార్‌సీపీకి, బీజేపీకీ ఎలాంటి సంబంధమూ లేదని కంభంపాటి హరిబాబు స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు బీజేపీ దగ్గరవుతోంది కాబట్టి తాము ఎన్డీఏ నుంచి విడిపోయామని టీడీపీ పేర్కొనటం అసంబద్ధమైన ఆరోపణ అన్నారు. ఒకవిధంగా చెప్పాలంటే టీడీపీ, వైఎస్సార్‌సీపీ రెండు పార్టీలూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని ఆడిన రాజకీయ క్రీడలో, రాజకీయ ఉచ్చులో టీడీపీ చిక్కుకుందని వ్యాఖ్యానించారు. బీజేపీ, టీడీపీ విడిపోవాలని పెట్టుకున్న లక్ష్య సాధనలో వైఎస్సార్ సీపీ విజయం సాధించిందన్నారు.
వైఎస్సార్ సీపీని టీడీపీ అనుసరించింది..
టీడీపీకి ఎజెండాను నిర్దేశించింది వైఎస్సార్‌సీపీనే అని కంభంపాటి పేర్కొన్నారు. ‘మీ (టీడీపీ) మంత్రులు కేంద్రం నుంచి వైదొలగాలన్న డిమాండ్‌కు అనుగుణంగా మీరు రాజీనామా చేశారు. మంత్రులు రాజీనామా చేయడమే కాదు ఎన్డీఏ నుంచి బయటకు రావాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. మీరు బయటకు వచ్చారు. మోదీపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం మీరు పెడతారా లేదా అని వైఎస్సార్‌సీపీ టీడీపీ మెడపై కత్తిపెట్టింది. టీడీపీ.. వైఎస్సార్‌సీపీని అనుసరించింది. వైఎస్సార్‌సీపీ పన్నిన ఉచ్చులో టీడీపీ పడింది. అంతేకానీ బీజేపీ.. వైఎస్సార్‌సీపీకి దగ్గరవ్వలేదు’ అని కంభంపాటి చెప్పారు. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకున్నది ప్రత్యేక హోదా కోసం కాదని కంభంపాటి చెప్పారు. బీజేపీ వైఎస్సార్‌సీపీకి దగ్గరవుతోందన్న ఒక భ్రమతో తెగదెంపులు చేసుకున్న విషయం ఈరోజు స్పష్టం అవుతోందని తెలిపారు. ప్రతిపక్షాల భయానికి లోనై రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలను కాలదన్న వద్దని సూచించారు.
ఆ ఆరోపణలు అసంబద్ధం
ప్రధాని కార్యాలయాన్ని వైఎస్సార్ సీపీ ఎంపీ వాడుకుంటున్నారని టీడీపీ చేస్తున్న ఆరోపణ అసంబద్ధమైనదని కంభంపాటి తెలిపారు. ప్రధాని తన కార్యాలయాన్ని వేరొకరు వాడుకునేందుకు ఇస్తారని భావిస్తే అంతకంటే అమాయకులు ఎవరూ ఉండరని చెప్పారు. ఏపీ విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలు అమలు చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఈ నాలుగేళ్లలో ఏ రాష్ట్రానికీ చేయనంత సాయాన్ని ఏపీకి అందచేశామన్నారు. ఒక్క ప్రత్యేక హోదా తప్పితే మిగిలినవన్నీ ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉందని చెప్పారు.
నిధులను వాడుకోలేని దుస్థితి
కేంద్రం ఇచ్చిన నిధులను కూడా సరిగా వాడుకోని దుస్థితి టీడీపీ సర్కారుదని నరసింహారావు విమర్శించారు. ‘ప్రజలు చింతిస్తున్నారు. అమరావతి అంటే.. అమ్మో అవినీతి అనే భయం కలుగుతోంది. రూ. 1,000 కోట్లు డ్రైనేజీకి ఇస్తే రూ. 200 కోట్లు మాత్రమే వాడుకున్నారు. కట్టిన భవనాలు ఎక్కడున్నాయో అని చర్చించుకుంటున్నారు. ఇస్తామన్న నిధులు తీసుకోకుండా రాజకీయం చేయటం తగదు..’ అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అన్ని పార్టీలు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయని విమర్శించారు. ఏ రాష్ట్రంపైనా తమకు కక్ష లేదన్నారు.
లెక్కలు చెప్పలేకపోవటం పారదర్శకతా?
నిధులు ఇచ్చి వెనక్కి తీసుకున్నారని టీడీపీ చెప్పడంలో వాస్తవం లేదని జీవీఎల్ తెలిపారు. ‘బురదజల్లే రాజకీయాలు సరికాదు. మొత్తం నాటకంలో ఇదొక భాగం. చేసిన ఖర్చుకు లెక్కలు చెప్పాలని అడిగాం. ఇచ్చిన రూ.990 కోట్లకు సరైన వివరాలు లేవు. డబ్బంతా ఎటు పోయిందన్న వివరాలు ఇవ్వలేనప్పుడు పారదర్శకత పాలన ఎలా అవుతుంది. ముఖ్యమంత్రికి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్న వ్యాఖ్యలు నాటకాన్ని రంజింపజేయడానికి చేసిన వ్యాఖ్యలే’ అని చెప్పారు.
టీడీపీ బలహీనపడినట్లు మీరే తేల్చారు
ఇప్పటివరకు ఏపీ వేదికగా ఉన్న రాజకీయ డ్రామాలను ఢిల్లీ పర్యటనతో చంద్రబాబు హస్తినకు తెచ్చారని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో టీడీపీ పరపతి ఎంత క్షీణించిందో ఈరోజు జరిగిన పరిణామాలను చూసి చెప్పవచ్చన్నారు. చంద్రబాబు చిన్నాచితక స్థాయి నేతలను కలిసి తమ వాదనలను వినిపించినట్లు చెబుతున్నారన్నారు. ఏ ఒక్క పెద్ద పార్టీ నేతా వారిని ఆలకించిన దాఖలాలు లేవన్నారు. చంద్రబాబు కలిసిన నేతల్లో శరద్‌పవార్ మినహా చెప్పుకోదగ్గ వారు ఎవరూ లేరన్నారు. ‘టీడీపీకి పరపతి లేదు. 20 ఏళ్ల క్రితం చక్రం తిప్పినా ఇప్పుడు వినేవాళ్లు లేరు. మీ పార్టీ బలహీనపడిన తీరును మీయాత్ర ద్వారా మీరే తేటతెల్లం చేశారు..’ అని నరసింహారావు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment