
సాక్షి, హైదరాబాద్ : ప్రజలు కట్టే ప్రతి ఒక్క రూపాయి పన్నును అభివృద్ధి కోసమే వినియోగిస్తామని, నూటికి నూరుపాళ్లు మ్యానిఫెస్టో అమలు చేస్తామని వైఎస్సార్ సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వంలో మ్యానిఫెస్టో అమలు కమిటీ ప్రవేశ పెట్టి.. ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టో తయారీకి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 31 మందితో కమిటీ వేశారని, కమిటీ సమావేశం 26న విజయవాడలో జరుగుతుందని తెలిపారు. మ్యానిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై చర్చిస్తామన్నారు. ప్రజాసంకల్పయాత్రలో 13 జిల్లాల్లోని అనేక వర్గాల ప్రజలని వైఎస్ జగన్ కలిశారని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో ప్రజల సమస్యలు ఆకళింపు చేసుకున్నారని పేర్కొన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టో తయారీకి వైఎస్ జగన్ పలు సూచనలు చేశారన్నారు.
మ్యానిఫెస్టో రూపకల్పనలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలు ప్రతిబింబించాలని వైఎస్ జగన్ సూచించినట్లు తెలిపారు. మ్యానిఫెస్టోలో పొందుపర్చిన అంశాలను అమలు చేసేలా, ప్రజలకు భరోసా కల్పించేలా ఉండాలని సూచించారన్నారు. నవరత్నాలతో ప్రజలకు ఏ విధంగా ప్రయోజనం జరుగుతుందో వివరించాలని వైఎస్ జగన్ చెప్పారన్నారు. రైతు భరోసా, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ లాంటి పథకాలు మ్యానిఫెస్టోలో పెట్టబోతున్నామన్నారు. జలయజ్ఞం కొనసాగింపు ప్రక్రియను మ్యానిఫెస్టోలో చేరుస్తామని, మధ్య నిషేధం మ్యానిఫెస్టోలో ప్రధాన అంశంగా ఉండబోతోందని చెప్పారు. అమ్మ ఒడి పథకం, వైఎస్సార్ ఆసరా పథకం, పేదలందరికీ ఇంటి పథకం మ్యానిఫెస్టోలో పెడతామన్నారు. పింఛన్లు పెంచడం, వయస్సు తగ్గించడం, మ్యానిఫెస్టోలో చేరుస్తామని తెలిపారు. ఈ హామీలన్నీ మ్యానిఫెస్టోలో చేర్చడమే కాకుండా.. ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టికి కృషి చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment