గురువారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వాన్ని స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో కేశవరావు
సాక్షి, హైదరాబాద్ : 2023లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ విజయఢంకా మోగిస్తుందని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. వచ్చే నెలాఖరులోగా మునిసిపల్ ఎన్నికలు కూడా పూర్తిచేసుకుని రానున్న నాలుగున్నరేళ్లలో రాష్ట్రాభివృద్ధి కోసం ముందుకు సాగుదామని పార్టీ కార్యకర్తలకు సీఎం పిలుపునిచ్చారు. రైతుల పంటలకు నీళ్లు అందించడం ద్వారా రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చుకుందామన్నారు. అసెంబ్లీ, ఆ తర్వాత జరిగిన గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అన్నిస్థాయిల్లో ఆధిపత్యాన్ని చాటుకున్న నేపథ్యంలో.. వచ్చే నెల్లో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు జరగనున్న ఎన్నికల్లో అన్నింటిని టీఆర్‌ఎస్ కైవసం చేసుకునే దిశలో పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగాలని పార్టీ నాయకులను ఆదేశించారు. వివిధస్థాయిల్లోని నాయకులంతా పూర్తి సమన్వయంతో పనిచేస్తూ, ఎక్కడా కూడా పొరపొచ్చాలకు అవకాశమివ్వకుండా సుహృద్భావ వాతావరణంలో పనిచేయాలని సూచించారు.
వచ్చే ఆగస్టులో శాసనసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలియజేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో సంస్థాగతంగా పార్టీ పటిష్టత, సభ్యత్వ నమోదుకు సంబంధించి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీనాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రస్థాయి చైర్మన్లు, జెడ్పీ చైర్‌పర్సన్లు, ఇతరనాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ప్రజల మద్దతు, అండదండలు పూర్తిస్థాయిలో అందుతున్నందున మున్సిపాలిటీలన్నీ గెలుచుకునే సత్తా, సామర్థ్యం టీఆర్‌ఎస్ పార్టీకి ఉందన్నారు. రెవెన్యూశాఖతో సమస్యలు ఎదురవుతున్నాయని, ఆ శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నందున ఆ దిశగా కచ్చితంగా చర్యలు చేపట్టాల్సి ఉందని స్పష్టంచేశారు. వివిధ రూపాల్లో ప్రభుత్వపరంగా తీసుకుంటున్న చర్యలతో రెవె న్యూశాఖలో కొంతమేర అవి నీతి తగ్గినా.. అక్కడక్కడ ఇంకా ఆశించిన మేర మార్పు రావడంలేదన్నారు. సమావేశం అనంతరం తొలి సభ్యత్వాన్ని స్వీకరించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు.
దరిదాపుల్లో ఎవరూ లేరు
రాజకీయంగా, సంస్థాగతంగా పరిపుష్టిగా ఉన్న టీఆర్‌ఎస్‌ను ఎదుర్కునే సత్తాగానీ.. కనీసం దరిదాపుల్లోకి వచ్చే పరిస్థితిలో కూడా ఏ పార్టీ లేదని కేసీఆర్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 4 సీట్లు గెలవగానే ఏదో జరిగిపోతుందంటూ బీజేపీ నాయకులు ఎగిరెగిరిపడుతున్నారని, వారిని గురించి పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌కు ఏకపక్షంగా మద్దతుందని.. గ్రేటర్ హైదరాబాద్‌లోనూ పార్టీ బలంగా ఉన్నప్పటికీ మరింత బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. నగరంలోనే అధిక జనాభా ఉన్నందున, బస్తీల్లో పార్టీ సభ్యత్వ నమోదుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రతీ బస్తీలో పార్టీ కమిటీతో పాటుగా సామాజిక వర్గాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం కేటీఆర్‌కు ఉన్నందున, నగరంపై పూర్తి అవగాహన పట్టున్న ఆయనతో సమన్వయం చేసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ నాయకులకు సూచించారు.
ఎమ్మెల్యేకే పూర్తి బాధ్యతలు
శాసనసభ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే బాస్‌లని, వారే అన్ని బాధ్యతలు తీసుకోవాలని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎంపీలు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధులను కూడా ఎమ్మెల్యేలకే ఇవ్వాలని సూచించారు. శాసనసభ్యులకు సంబంధం లేకుండా, వారికి తెలియకుండా ఎంపీలు నిధులు ఇవ్వడం వల్ల కొత్త సమస్యలు వస్తాయన్నారు. ఎమ్మెల్యేలకే నిధులిస్తే వారే ఎంపీలను గౌరవించుకుంటారన్నారు. ఆ విధంగా అందరూ ఎమ్మెల్యే నాయకత్వంలో పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. జిల్లా పార్టీకి అధ్యక్షులు ఉంటే గ్రూపుల సమస్య ఏర్పడుతుందనే అభిప్రాయంతోనే ఇప్పటి వరకు వారి నియామకం చేపట్టలేదని, ఈ నేపథ్యంలో జిల్లా పార్టీ సమన్వయకర్తను నియమించాలని యోచిస్తున్నామన్నారు. యూపీలో బీఎస్పీ ఇదే తరహాలోనే ముందుకు సాగుతోందన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన ఇతర ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ ఇదే విధానాన్ని అవలంబించి విజయం సాధించిందన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ స్థాయిలో కూడా టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. పార్టీని కిందిస్థాయిలో మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఈ నిర్మాణాలు ఉపయోగపడతాయన్నారు.
విదేశాలకు ఎమ్మెల్యేలు
ఇతర దేశాలు, రాష్ట్రాల్లో కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యేలు పర్యటనలు చేపట్టాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. అక్కడి పరిపాలన, సామాజిక పరిస్థితులు, పథకాలు, అక్కడి ప్రజల జీవన విధానం, స్థితిగతులు, ఇక్కడ అనుసరించాల్సిన విషయాలు, చట్టాలు తదితర అంశాలపై అధ్యయనం చేయాలన్నారు. ఇందుకోసం విదేశాలు, ఇతర రాష్ట్రాల పర్యటనలకు ఎమ్మెల్యేలను పంపించనున్నట్టు తెలియజేశారు.
అవినీతికి తావు లేకుండా..
అవినీతికి తావు లేకుండా ప్రభుత్వం పథకాలు అమలు చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమని కేసీఆర్ చెప్పారు. నిజాయితీగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తోందన్నారు. కొత్తగా ఎన్నికైన జెడ్పీ చైర్‌పర్సన్లు తమ తాత్కాలిక కార్యాలయాలుగా ఎంపీపీ కార్యాలయాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నీతి, నిజాయితీతో ప్రజాసేవ చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు గౌరవవేతనం ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్టు కేసీఆర్ చెప్పారు. రైతుల పొలాలకు నీళ్లు రాబోతున్నందున వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుందన్నారు. అందువల్ల రైతులు ఏ పంట పండించాలి, ఉత్పత్తులను ఎప్పుడు అమ్మాలి, వాటికి కనీస మద్దతు ధర ఎంత వంటి అంశాలను స్థానిక ప్రతినిధులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
పుష్కలంగా నిధులు
రాష్ట్రానికి పుష్కలంగా నిధులున్నాయని, అప్పులను కూడా తీర్చగలిగేంత సామర్థ్యం ఉందని కేసీఆర్ చెప్పారు. ప్రజలు ఎంపీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను అత్యధిక స్థానాల్లో గెలిపించారని అందువల్ల దీని విషయంలో ఎవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు. అసెంబ్లీలో 104 ఎమ్మెల్యేలున్నారని సీఎం గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించాల్సిన అవసరం ఉందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి పుష్కలంగా నిధులు ఉన్నాయని, ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారానే నెలకు కోటి రూపాయల వడ్డీ వస్తోందన్నారు. కార్యకర్తల శ్రేయస్సు కోసం పనిచేస్తూ, వారి కోసం బీమా సౌకర్యం కల్పించామన్నారు.
కేటీఆర్ పర్యవేక్షణలో సభ్యత్వ నమోదు
ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 50 వేల చొప్పున సభ్యత్వ నమోదును చేపట్టాలని నాయకులను కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం చేపడుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు పర్యవేక్షణకు త్వరలోనే ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక ఇన్‌చార్జీని నియమిస్తామని, సభ్యత్వ కార్యక్రమం పూర్తయ్యే వరకు వారు అక్కడే ఉంటారని కేసీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమాన్ని జూలై 20కల్లా పూర్తి చేయాలని సూచించారు. అది ముగిసిన వెంటనే గ్రామ, మండల కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రామ స్థాయిలో పార్టీ కమిటీనే కాకుండా సామాజిక వర్గాల వారీగా కమిటీలు వేసుకోవాలన్నారు. గ్రామస్థాయిలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, మహిళా, రైతు, యువత ఇలా అన్ని రకాల కమిటీలు తయారు చేసుకోవాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment