సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ కార్యాచరణను ముమ్మరం చేయాలని టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడేలోగా వీలైనన్ని ఎక్కువ ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలని యోచిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ పర్యటనలు పూర్తి చేసుకున్న గులాబీ దళపతి... త్వరలోనే ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వెళ్లాలని భావిస్తున్నారు. ఈ నెల 23లోపే ఆయా రాష్ట్రాల్లో పర్యటన పూర్తి చేసే యోచనలో ఉన్నారు. ఒకవేళ ఎన్నికల ఫలితాల్లోగా ఇతర రాష్ట్రాల పర్యటన వీలుకాకుంటే ఫలితాలు వెలువడిన వెంటనే ఢిల్లీ కేంద్రంగా ప్రాంతీయ పార్టీలను కూడగట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి మాత్రం వీలైనన్ని రాష్ట్రాల్లో పర్యటించి ప్రధాన ప్రాంతీయ పార్టీలను ఫెడరల్ ఫ్రంట్ వైపు ఒప్పించే ప్రయత్నం చేయాలని భావిస్తున్నారు. 80 లోక్‌సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్... దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించనుంది.
ఉత్తరప్రదేశ్‌లో బలమైన రాజకీయ శక్తులుగా ఉన్న సమావాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ఈసారి కలసి పోటీ చేస్తున్నాయి. పెద్ద రాష్ట్రంలో ఈ రెండు పార్టీల కూటమి ఎక్కువ స్థానాలు గెలచుకునే పరిస్థితి ఉందని టీఆర్‌ఎస్ గట్టిగా నమ్ముతోంది. ఎస్పీ, బీఎస్పీ కలసి వస్తే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు సులభతరమవుతుందని టీఆర్‌ఎస్ అధినేత భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతితో త్వరలో భేటీ కావాలని భావిస్తున్నారు. యూపీ లేదా ఢిల్లీలో వారితో సమావేశమయ్యేందుకు ఏర్పాట్లు జరగుతున్నట్లు టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్‌పై ఇప్పటికే చర్చలు జరిపిన బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ, జేడీఎస్ ముఖ్యనేత హెచ్.డి.కుమారస్వామితోనూ కేసీఆర్ మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రాంతీయ పార్టీలే కీలకం...
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలకంగా వ్యవహరించనున్నాయని, వీలైనన్ని ఎక్కువ ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ గట్టిగా భావిస్తున్నారు. ‘ప్రస్తుత అంచనాల ప్రకారం బీజేపీ, కాంగ్రెస్‌లు స్వతహాగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. గత ఎన్నికల ఫలితాలకు భిన్నంగా రెండు ప్రధాన జాతీయ పార్టీల సంఖ్యాబలం 150 సీట్ల దగ్గరే ఆగిపోయే పరిస్థితి ఉంది. ఎక్కువ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే అధిక సంఖ్యలో సీట్లు గెలుచుకోనున్నాయి. ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకొని ప్రాంతీయ పార్టీలు సత్తా చాటాలి. ఫెడరల్ ఫ్రంట్‌గా ఏర్పడి ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ప్రజలు ఆశించిన అభివృద్ధి, సంక్షేమం జరగాలి. ఇప్పడే దీనికి సరైన సమయం. ప్రాంతీయ పార్టీలు దీన్ని చక్కగా వినియోగించుకోవాలి’అని టీఆర్‌ఎస అధినేత ప్రతిసారీ చెబుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
ఫెడరల్ ఫ్రంట్ కోసం ఏడాదిగా...
ప్రాంతీయ పార్టీలతోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఏడాది క్రితం ఫెడరల్ ఫ్రంట్ నినాదాన్ని ముందుకు తెచ్చారు. అప్పటి నుంచి ఇతర ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు మొదలుపెట్టారు. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రాజకీయంగా బలమైన ప్రాంతీయ శక్తులుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్, డీఎంకే, జేడీఎస్, సమాజ్‌వాదీ పార్టీలతో ఇప్పటికే ఒకదశ చర్చలు జరిపారు. లోక్‌సభ ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో కేంద్రంలోని రాజకీయ పరిస్థితులు ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా ఉంటాయని కేసీఆర్ భావిస్తున్నారు.
దీనికి అనుగుణంగా ప్రాంతీయ పార్టీలతో కలిసి బలమైన కూటమిగా ఏర్పడాలని చెబుతున్నారు. ఈ దిశగా ప్రధాన ప్రాంతీయ పార్టీలను ఒప్పించేందుకు స్వయంగా పర్యటనలు చేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా కేసీఆర్ గతవారం రెండోదశ ఏర్పాట్లు ప్రారంభించారు. కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు ప్రారంభించి రాజకీయంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో భేటీ అయ్యారు. ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే ఫెడరల్ ఫ్రంట్‌తో కలిసి సాగాలని కోరారు. అనంతరం డీఎంకే అధినేత స్టాలిన్‌తో చర్చలు జరిపారు. త్వరలోనే జేడీఎస్ అధిష్టాన ముఖ్యలతోనూ చర్చలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment