సీఎం గుండెను తాకిన పేదరైతు ఆక్రందన | KCR Response Over Farmer Problem | Sakshi
Sakshi News home page

సీఎం గుండెను తాకిన పేదరైతు ఆక్రందన

Published Thu, Mar 28 2019 1:33 AM | Last Updated on Thu, Mar 28 2019 10:34 AM

KCR Response Over Farmer Problem - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/మంచిర్యాల/నెన్నెల: ఓ సామాన్య రైతు కష్టానికి సీఎం కేసీఆర్‌ చలించిపోయారు. దశాబ్దాలుగా ఓ రైతు కుటుంబం పేరిట పట్టాగా ఉన్న భూమిని.. రెవెన్యూ యంత్రాంగం అక్రమంగా వేరే వారి పేరుతో పట్టా చేయడంపై స్పందించారు. యువ రైతు ఆవేదనను తెలుసుకుని స్వయంగా ఫోన్‌ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో ఏ రైతుకూ మరోసారి ఇలాంటి అన్యా యం జరగకుండా చూస్తానని భరోసా కల్పించారు. ఆ రైతు సమస్యను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో జిల్లా కలెక్టర్‌ వెంటనే యువరైతు ఇంటికి వెళ్లి సమస్యను పరిష్కరించారు. బాధ్యులైన అధికారులను సస్పెండ్‌ చేశారు. ఆ రైతుకు దక్కాల్సిన రైతుబంధు చెక్కును అందజేశారు. సీఎం కేసీఆర్‌ అనూహ్య స్పందనతో ఆ రైతు భావోద్వేగానికి లోనయ్యారు. 

అసలేం జరిగింది? 
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లి గ్రామానికి చెందిన కొండపల్లి శంకరయ్యకు గ్రామ శివారులో 271/1ఏ సర్వే నంబర్‌లో 7.01 ఎకరాల పట్టా భూమి ఉంది. ఆ భూమిని గ్రామ వీఆర్వో కరుణాకర్‌.. శంకరయ్యకు తెలియకుండా కొండపల్లి శంకరమ్మ పేరిట పట్టా మార్పిడి చేయించారు. విషయం తెలిసిన శంకరయ్య కొడుకు శరత్‌ పలుమార్లు రెవెన్యూ కార్యాలయాల చుట్టు తిరిగి దరఖాస్తులు ఇచ్చినా లాభం లేకపోవడంతో సీఎం న్యాయం చేయాలని కోరుతూ మార్చి 18న ఫేస్‌బుక్‌ లో లైవ్‌ వీడియో పోస్టు పెట్టారు. ఆ పోస్టుకు రకరకాల కామెంట్లు రావడం.. వైరల్‌గా మారి సీఎం దృష్టికి చేరింది. వెంటనే సీఎం స్పందించి శరత్‌తో రెండుసార్లు ఫోన్‌లో మాట్లాడారు. 

శరత్‌ ఇంటికి కలెక్టర్‌ భారతి 
సీఎం ఆదేశంతో మంచిర్యాల కలెక్టర్‌ భారతి నందులపల్లికి వెళ్లారు. భూమి పట్టా మార్పిడి ఎలా జరిగిందని వీఆర్వో కరుణాకర్‌ను ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై ఆర్‌ఐ పెద్దిరాజు, వీఆర్వోను సస్పెండ్‌ చేశారు. రెండు, మూడ్రోజుల్లో సమస్య పరిష్కారవుతుందని శరత్‌కు, ఆయన తండ్రి శంకరయ్యకు హామీ ఇచ్చారు. తన పరిధిలోని అత్యవసర నిధుల నుంచి రైతుబంధు పథకం కింద రూ.31,200 చెక్కును, పట్టా, 1–బీ, పహాణిలను రైతు శంకరయ్యకు సాయంత్రం మంచిర్యాలలో అందించారు.  

శరత్‌ ఫేస్‌బుక్‌ వీడియో 
‘హాయ్‌ ఫ్రెండ్స్‌.. నేను మీ రైతు శరత్‌. మాది మంచిర్యాల జిల్లా. నెన్నెల మండలం నందులపల్లి. మా మండల రెవెన్యూ ఆఫీసులో ఉన్న వీఆర్వో కరుణాకర్‌ ఎంతో మంది రైతుల కుటుంబాలకు అన్యాయం చేశాడు. మా గ్రామ శివారులో 271/1ఏ సర్వేనంబరులో 7 ఎకరాల ఒక గుంట భూమిని 55 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నాం. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఈ మధ్య మా అనుమతి లేకుండానే హైదరాబాద్‌లో జాబ్‌ చేస్తున్న కొండపల్లి శంకరమ్మ పేరిట పట్టా చేశారు. ఇదేంటని ఎమ్మార్వోను, సబ్‌ కలెక్టర్‌ను, జిల్లా కలెక్టర్‌ను కలిసి అడిగాం. అయిపోతుంది, కొంచెం టైం పడుతుందని చెబుతున్నారు. 11 నెలలుగా ఇదే పరిస్థితి. ఎన్నిసార్లు ఎంతమందిని కలిసినా మా భూమిని మాకు పట్టా చేయలేదు. మాకు జరిగిన అన్యాయం సీఎం కేసీఆర్‌గారికి చేరేలా ప్రతి ఒక్కరు షేర్‌ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇలాంటి లంచగొండి అధికారులకు శిక్ష వేసేవారు లేరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ప్లీజ్‌.. నా ఒక్కడి సమస్యగా చూడొద్దు. రాష్ట్రంలోని అందరి సమస్యగా చూడండి’అని శరత్‌ ‘మన వ్యవసాయం, మన పంటలు’ఫేస్‌బుక్‌ పేజీలో ఈ నెల 18న లైవ్‌ వీడియో పోస్టు చేశాడు. 

శరత్‌తో సీఎం కేసీఆర్‌ సంభాషణ 
యువరైతు శరత్‌తో సీఎం రెండుసార్లు మాట్లాడారు. మొదట విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం కొద్దిసేపటి తర్వాత మళ్లీ మాట్లాడారు. 
సీఎం: శరత్‌.. మీ కలెక్టర్‌ భారతి హొళికెరి. ఇప్పుడే మీ కలెక్టర్‌తో మాట్లాడాను. స్మితా సబర్వాల్‌తో మాట్లాడాను. మీ దగ్గర ఫ్యాక్స్‌ చేసేందుకు అవకాశం ఉందా?  
శరత్‌: ఆ.. సార్‌. వేరే ఊరికి వెళ్లి చేస్త సార్‌. బెల్లంపల్లికి. 
సీఎం: కేసీఆర్‌ : బెల్లంపల్లికి దాకా పోవాల్నా. ఎంత దూరం? 
శరత్‌: 20 కిలోమీటర్లు సర్‌. 
సీఎం: 20 కిలో మీటర్లు పోవల్నా. అట్లగాదు లేటైతది. నువ్వు పోకు. ఊళ్లనే ఉండు. నేను కలెక్టర్‌కు చెప్పిన. కంప్లయింట్‌ లేకున్నా ఫర్వాలేదు. కంప్లయింట్‌ నా పేరు మీద రాయి. వాట్సాప్‌లో పెట్టు. గంటసేపటిలో కలెక్టర్‌ మీ దగ్గరికి వస్తరు. మీ భూమి మీకు ఇస్తరు. 
శరత్‌: ఆ.. ఆ.. అవును సర్‌. థ్యాంక్యూ సర్‌. 
సీఎం: థ్యాంక్యూ చెప్పి వట్టిగ ఊకోవద్దు. సన్నాసిలాగా. విను.. పెట్టినక్క కూడ మళ్లీ పోస్టు పెట్టాలె. 
శరత్‌: తప్పకుండ సర్‌ 
సీఎం: కేసీఆర్‌ ఇట్ల నాతోని మాట్లాడిండు. రెక్వెస్టు చేసిండు. రేపటికి మళ్ల యుద్ధం లాగ, యజ్ఞం లాగ చేయాలె. అరాచకాలను అరికట్టడానికి పని చేయాలని, ఎక్కడి వాళ్లు అక్కడ మేల్కొవాలని చెప్పిండు అని ఆ పోస్టు కూడా పెట్టు. అర్థమైందా? 
శరత్‌: తప్పకుండ సార్‌ 
సీఎం: నీ సమస్య పరిష్కారం కాగానే నువ్వు ఇంట్ల పంటవ్‌. అందుకే ఇట్ల జరుగుతున్నది. దోపిడీ జరగొద్దు అనుకుంటే అందరు ఒక్కటి కావాలె కదా. ఆ చైతన్యం వస్తేనే వస్తది. 
శరత్‌: అవును సర్‌. 
సీఎం: నేను శ్రీకారం చుడుతున్న. లోక్‌సభ ఎన్నికల వరకు వేచి చూద్దాం. ఇప్పుడు ఉద్యోగులు అంతా ఎన్నికల కమిషన్‌ పరిధిల ఉంటరు. నేను మాట్లాడడానికి ఉండదు. పార్లమెంట్‌ ఎలక్షన్లు అయిపోయినాంక ఇంకో దరిద్రం ఉంది. ఆ జిల్లా పరిషత్‌ ఎన్నికలు ఉన్నయి గద. అవి కూడా అయిపోవాలె. మే 27కు ఫ్రీ అయిత. జూన్‌ నుంచి పెడుతున్నం ఇదంత. ధరణి వెబ్‌సైట్‌ వస్తది. 
శరత్‌: అవునా సర్‌ 
సీఎం: నీ సమస్య, నా సమస్య కాదు. మొత్తం రైతుల బాధ పోవాలె. దాని కోసం ఏం చేయాల్నో ఆలోచన చేద్దాం. అది జరగాలంటే అంతా ఒక్కటి కావాలె. అర్థమైంది కదా? మీ సమస్య పరిష్కాకరం కాగానే సైలెంట్‌ అయితరు.  
శరత్‌: లేదు సర్‌.. లేదు సర్‌. మీరు చూస్తున్నరు కద. పేజీ ద్వారా కొన్ని లక్షల మందికి నా వల్ల సాయం చేస్తున్న.  
సీఎం: అది ఓకే.. అట్ల చాలా మంది చాలా చేస్తున్నరు. సామాజికపరమైన సమస్య నోటి మాటతో పోదుకదమ్మా. పోతదా? 
శరత్‌: పోదు సార్‌ 
సీఎం: పోవాలంటే సమాజం అంతా ఒక్కటి కావలె. కావడానికి నేను జూన్‌ తర్వాత చేస్త. ఇదొక్కటే కాదు మున్సిపాలిటీల డబ్బులు లేంది పర్మిషన్‌ ఇస్తరా? ఇయ్యరు. గ్రామపంచాయతీలు పని చేయమంటే చేస్తరా? అంటే ఇప్పుడు బాధ. 
శరత్‌: అవును సర్‌ 
సీఎం: పంచాయతీరాజ్‌చట్టం తెచ్చిన. చాలాచాల కఠినంగా ఉంది. సరిగా పని చేయకుంటే వేల మంది సర్పంచ్‌లు ఎగిరిపోతరు. పేపర్లళ్ల వచ్చింది. టీఆర్‌ఎస్‌ పార్టీవోడు అయితే వాణ్నే ముందు తీసేయమని చెప్పిన నేను.  
శరత్‌ : చూసిన సర్‌. 
సీఎం: చూసినవ్‌ కరెక్టే. నువ్వు పెట్టిన పోస్టుకు నన్ను పది మంది తిట్టిండ్లు. వెధవలు.  
శరత్‌ : అవి పట్టించుకోవద్దు సర్‌. 
సీఎం: అట్ల నెగిటివ్‌ ఉనోళ్లు కూడా ఉంటరు. వానికేం ఉంటది చెప్పు. నెత్తా, కత్తా? జిమ్మేదార్‌ ఉందా? బాధ్యత ఉందా? నాకు పెట్టరాదా పోస్టు... నేను కూడా పెడత. ఏం చేస్తాండ్లో తెల్వకుండా పెట్టేటోళ్లు కూడ ఉంటరు. ఉండరా... ఇడియట్‌ ఫెలోస్‌. సీఎం... వాడే ఒక బోకుగాడు అని పెట్టిండు ఒక వెధవ. 
శరత్‌: అవును సార్‌. మీ గురించి నాకు తెలుసు సార్‌. మంచిగనే... 
సీఎం: అట్లాండి ఇడియట్స్‌ ఉంటరు కూడా... ఇప్పుడు మళ్ల పెట్టు. కొంతమంది ఇట్ల పెట్టిండ్లు. మంచి పద్ధతి కాదు. పని చేసే వాళ్లను గుర్తించే తెలివి కూడా ఉండాల్నని పోస్టు పెట్టు. 
శరత్‌: పెడత సార్‌... సర్‌ ఒకటి... ఇంత ఘోరంగా మోసం చేసిండు సర్‌. వీఆర్వో. అయినకు ఎలాంటి శిక్ష లేదా సార్‌. 
సీఎం: 100% ఉంటది. ఇప్పుడు సస్పెండ్‌ చేస్తరు. మధ్యాహ్నం వరకు కలెక్టర్‌ మీ ఊరికి వత్తాందాయ బాబూ... మొత్తం యాక్షన్‌ జరుగతది. 
శరత్‌: థ్యాంకూ సర్‌... 
సీఎం: గా.. ఒక్క వీఆర్వో గాడు కాదమ్మా... మొత్తం వీఆర్వో వ్యవస్తనే ఇట్ల తయారై కూర్చున్నది.  
శరత్‌: ఈయన రైతుల నుంచి బాగా డబ్బులు తిన్నడు సర్‌.  
సీఎం: నీకు తెలిసి ఈ ఒక్కడు ఉన్నడు. నాకు రోజూ ఈ బాధ ఉంటది తెల్సా. ఆ బాధలన్నీ పోవాలె కదా. దాని కోసం ఎక్కడోళ్లు అక్కడ చైతన్యం కావాలె. నేను ఇప్పుడు ఏం జేస్తాన్నంటే.. రైతు లోను కోసం కూడా బ్యాంకుకు బోయే అవసరం లేకుండా చేస్తాన్న. మన భూములన్నీ సైట్ల ఉంటయి. ప్రతిరోజు ఏ గంటకా గంటకు అప్‌లోడ్‌ అయితాన్నయ్‌. వాటిని చూసుకుంట అప్రిసియేట్‌ చెయ్యరు (మెచ్చుకోరు). ఇయ్యాల ఇష్యూ వస్తే మాత్రం తిట్టాలె. సీఎం మీద అక్కసు ఉంటది సూడు వేరే పార్టీ వాళ్లకు. 
శరత్‌: ఉంటది సార్‌... ఉంటది సార్‌. 
సీఎం: దీంట్ల వాళ్లు ఎంటరైతరు ఇగ. ఇష్టమొచ్చిన కామెంట్లు. ముఖ్యమంత్రిని మాట అనొచ్చా? అనరాదా అనే సంస్కారం కూడా లేదు. 
శరత్‌: అవును.. అవును సర్‌ 
సీఎం: ఎటుపడితే అటే మాట్లాడుతున్నరు. దాంతోని ఏమోస్తదమ్మా.. పాజిటివ్‌ ఏం రాదుకదా? 
శరత్‌: ఏం రాదు సార్‌ 
సీఎం: నెగిటివిటీ వస్తది, తప్ప పాజిటివిటీ ఏమొస్తది. అందుకోసం నువ్వు నీ కంప్లయింట్‌ను నీ సైట్లనే పెట్టు. దాంట్ల నుంచి పికప్‌ చేసి (తీసుకుని) నేను సెక్రటరీకి పంపుత. ఆమె పంపిస్తది. మధ్యాహ్నం వరకు పని అయిపోతది. మళ్ల కూడ నువ్వు పెట్టు. థ్యాంక్సు చెప్పుకుంట పెట్టు. 
శరత్‌: తప్పకుండ సార్‌ 
సీఎం: ధరణి వెబ్‌సైట్‌ రాబోతాంది. అప్పుడు రైతాంగం, ప్రజలు, యువకులు చైతన్యమై దాన్ని అమలు చేసుకోవాలి. ఆ పద్ధతిలో పెట్టాలె. అర్థమైంది గదా? 
శరత్‌: అర్థమైంది సార్‌. 
సీఎం: ఆ.. రైట్, నేను టచ్‌లో ఉంట. మళ్ల గుడ. మధ్యాహ్నం వరకు అయిపోతది ఇది. అయిపోయిన తర్వాత కూడా థ్యాంక్స్‌ చెబుతూ మళ్ల గూడ పోస్టు పెట్టు.  
శరత్‌: ఓకే సార్‌.. తప్పకుండ. 
సీఎం: రైట్‌.. ఓకె. 
శరత్‌: థ్యాంక్యూ సర్‌.. ఉంట సర్‌. 

ఇలాంటి సీఎం ఉండడం గర్వకారణం 
తెలంగాణకు కేసీఆర్‌ వంటి మంచి నాయకుడు సీఎం కావడం, రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం నిజంగా గర్వించదగ్గ విషయం. రైతు సమస్యలపై స్పందించే గొప్ప ఆలోచనపరుడు కేసీఆర్‌. నాయకుడు అంటే జనం కోసం పని చేసేవాడని నా సమస్యకు పరిష్కారం చూపి కేసీఆర్‌ మరోసారి నిరూపించుకున్నాడు. రైతు బాగోగులు చూసే ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే నాలాంటి వాళ్లకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో నేను ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాను. సీఎం న్యాయం చేశారు. 
– కొండపల్లి శరత్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement