లేఖ విడుదల చేయడానికి పది గంటలకు పైగా సమయం ఎందుకు పట్టింది? అనే ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద జవాబులు లేవు.
సాక్షి, అమరావతి: ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపినా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు ఎదురుదాడే వ్యూహంగా ముందుకు వెళుతోందే కానీ ఘటన వెనుక జరిగిన కుట్ర, కుతంత్రాలపై వెలుగులోకి వస్తున్న సందేహాలు, ప్రశ్నలకు ఏమాత్రం బదులివ్వకపోవడం గమనార్హం.
- గట్టి భద్రత ఉండే ఎయిర్‌పోర్టులోకి కోడిపందేల కత్తులు ఎలా వచ్చాయి?
- రాష్ట్రంలోని విమానాశ్రయాల్లో వీఐపీలు, వీవీఐపీలు ఎక్కువగా దిగే వాటిల్లో విశాఖ ఎయిర్‌పోర్టు ప్రధానమైనది. ఇక్కడ పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అలాంటి చోటుకు నిందితులు కోడిపందేల కత్తులను ఎలా తీసుకెళ్లగలిగారు? వీఐపీ లాంజ్‌లో ఉన్న వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి దిగేవరకు పోలీసు యంత్రాంగం ఎందుకు కళ్లు మూసుకొని ఉంది? నిందితుడి నుంచి అటువంటిదే మరో కత్తి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు శుక్రవారం ప్రకటించారు. ఇవి ఎలా తీసుకువెళ్లారన్న దానిపై మాత్రం మౌనం దాలుస్తున్నారెందుకు?
- పక్కా ప్రణాళికలో భాగంగానే టీడీపీ నేత నిర్వహించే నిందితుడిని రెస్టారెంట్లో పనికి కుదిర్చారా?
- నిందితుడు శ్రీనివాస్ హత్యాయత్నానికి పాల్పడటాన్ని ఏదో ఆకస్మిక ఘటనగా ప్రభుత్వం చిత్రీకరించడంలో ఆంతర్యం ఏమిటి?
- టీడీపీ నేత నిర్వహించే రెస్టారెంట్లో నిందితుడు ఎలా చేరాడు? ఎవరు చేర్చారు?
- రెస్టారెంట్ యజమానిని ఇప్పటిదాకా పోలీసులు విచారించకపోవడానికి కారణమేమిటి?
- ఎయిర్‌పోర్టు కేంద్రం పరిధిలో ఉంటుంది కనుక ఘటనను కేంద్రంపైకి నెట్టేసి రాజకీయంగా లబ్ధి పొందేందుకు పథకం వేశారా?
లేఖల ప్రహసనం వెనుక ఎవరున్నారు?
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగినప్పుడు అక్కడే ఉన్న ప్రతిపక్షనేత వ్యక్తిగత భద్రతా సిబ్బంది, సహాయకులు, ఇతర నేతలు అడ్డుకుని నిందితుడు శ్రీనివాస్‌ను పట్టుకొన్నారు. సీఐఎస్‌ఎఫ్ అధికారులు నిందితుడిని అక్కడే తనిఖీ చేసి కోడిపందేల కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అయితే అతడి వద్ద ఎలాంటి లేఖనూ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పలేదు. కానీ ఆ తరువాత కొద్ది సేపటికే డీజీపీ ఆర్పీ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ నిందితుడి వద్ద కత్తి, జేబులో లేఖ దొరికిందని ప్రకటించారు. దీనిపైనా అనేక అనుమానాలు నెలకొన్నాయి. వీటిని నివృత్తి చేయకుండా పోలీసులు శుక్రవారం మరో డ్రామాకు తెరలేపారు. వేర్వేరు వ్యక్తులతో లేఖలు రాయించినట్లు శ్రీనివాస్ చెబుతున్నాడని కొత్తకథను తెరపైకి తెచ్చారు. లేఖ రాసే వ్యక్తి ఇతరులతో ఎందుకు రాయిస్తాడు?
సీఎంకు అసహనం... అబద్ధాలు ఎందుకు
ప్రధాన ప్రతిపక్షనేతపై హత్యాయత్నం జరిగితే పరామర్శించాల్సింది పోయి సీఎం చంద్రబాబు మీడియా సమావేశంలో తీవ్ర అసహనంతో అభ్యంతరకర భాషతో మాట్లాడారు. ప్రతిపక్షనేతపై ఏకవచనంతో దూషణలకు దిగారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నంతో ప్రభుత్వానికి, టీడీపీకి ఎలాంటి సంబంధం లేదంటున్నప్పుడు పరామర్శించకుండా విమర్శలకు దిగడం, విచారణ తప్పుదోవ పట్టించేలా పన్నాగాలకు దిగడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటి? ప్రభుత్వ పెద్దలకు ఈ హత్యాయత్నంతో ఎలాంటి సంబంధం లేనప్పుడు ఎందుకు అంత ఉలికిపాటు?. వైఎస్ జగన్ హైదరాబాద్‌లో విమానాశ్రయం నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లగా ఇంటికి వెళ్లారని, ఢిల్లీ నుంచి ఫోన్ రావడంతో ఆసుపత్రిలో చేరారని అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారు?
గరుడపురాణంపై విచారణకు ఎందుకు భయం?
రాష్ట్రంలో ఏది జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు సినీనటుడు శివాజీ గతంలో చెప్పిన ఆపరేషన్ గరుడ గురించి పేర్కొంటున్నారు. ఆ ఆపరేషన్ ప్రకారమే అన్నీ జరుగుతున్నాయని, అందులో భాగంగానే వైఎస్ జగన్‌పై రెక్కీ జరిగిందని, హత్యాయత్నం జరుగుతుందని ముందే చెప్పారని సీఎం స్థాయి వ్యక్తి పేర్కొంటున్నారు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేలా ఉన్న ఆపరేషన్ గరుడలోని అంశాలను బయటపెట్టిన శివాజీని అరెస్టు చేసి దాని వెనుక ఎవరున్నారో తేల్చడానికి ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టడం లేదు?
గవర్నర్ వివరాలు అడిగితే ఉలికిపాటెందుకు?
ప్రభుత్వాధినేతగా గవర్నర్ నరసింహన్ హత్యాయత్నం ఘటనపై రాష్ట్ర డీజీపీ నుంచి వివరాలు తెలుసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉలికి పాటెందుకు? గవర్నర్ నేరుగా అధికారులతో ఎలా మాట్లాడతారని ప్రశ్నించడంలోని ఆంతర్యమేమిటి? దీన్ని సాకుగా చూపి జాతీయస్థాయి నేతలతో కలసి పోరాటం అంటూ కొత్త డ్రామాకు తెరలేపుతున్నారెందుకు?
పరామర్శిస్తే తప్పుబడతారా?
తీవ్రంగా గాయపడిన జగన్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్, ఇతర పార్టీల నేతలు పరామర్శిస్తూ ప్రకటనలు చేస్తే చంద్రబాబు అభ్యంతరం చెప్పడం ఎందుకు?
Comments
Please login to add a commentAdd a comment