పాత, కొత్త కలయిక | who wins Delhi Assembly elections 2020 | Sakshi
Sakshi News home page

పాత, కొత్త కలయిక

Published Tue, Jan 28 2020 3:59 AM | Last Updated on Tue, Jan 28 2020 4:45 AM

who wins Delhi Assembly elections 2020 - Sakshi

న్యూఢిల్లీ: 22 ఏళ్లుగా అధికారాన్ని అందుకోవాలన్న ఆరాటంలో బీజేపీ.. హ్యాట్రిక్‌ విజయాల్ని సాధించి కూడా పోరాటం చేయలేని స్థితిలో కాంగ్రెస్‌   గ్యారంటీ కార్డును నమ్ముకుంటూ ముందుకు సాగుతున్న అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ..

ఈ త్రిముఖ పోటీలో అభ్యర్థులే కీలకంగా మారారు. కేజ్రీవాల్‌ సర్కార్‌పై వ్యతిరేకత అంతగా లేదు. అందుకే ఈ సారి బీజేపీ, కాంగ్రెస్‌ బలమైన అభ్యర్థులపైనే ఆశలు పెట్టుకుంది. మూడు పార్టీలు కూడా అనుభవానికి, కొత్త ముఖాలకి సమానమైన ప్రాతినిధ్యం కల్పిస్తూ అభ్యర్థుల్ని ఎంపిక చేశారు. కాంగ్రెస్, ఆప్‌ మధ్య ఆఖరి నిమిషంలో గోడ దూకుడు రాజకీయాలు ఎక్కువగా ఉండడంతో ఎవరు ఏ పార్టీ అభ్యర్థులోనన్న గందరగోళం కూడా నెలకొంది.  

హోరాహోరీ...
చాందినీ చౌక్‌ నియోజకవర్గంలో ఆప్‌ నుంచి కాంగ్రెస్‌ గూటికి తిరిగి చేరుకున్న అల్కా లంబా పోటీపడుతుంటే, కాంగ్రెస్‌ నుంచి ఆప్‌లోకి జంప్‌ చేసిన అయిదు సార్లు ఎమ్మెల్యే అయిన ప్రహ్లాద్‌ సింగ్‌ స్వాహ్నే బరిలో ఉన్నారు. ఇక బీజేపీ తరపున మాజీ కౌన్సిలర్‌ సుమన్‌ కుమార్‌ గుప్తా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో హోరాహోరి పోరాటం నెలకొందని కాంగ్రెస్‌ అభ్యర్థి అల్కా లంబా స్వయంగా అంగీకరించారు.
 
► ద్వారకాలో కూడా ఆప్‌ రెబెల్‌ ఎమ్మెల్యే ఆదర్శ్‌ శాస్త్రి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తూ ఉంటే, ఆప్‌ తరఫున గత వారంలోనే కాంగ్రెస్‌ నుంచి వచ్చిన వినయ్‌ మిశ్రా పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌లో అత్యంత పేరున్న మహాబల్‌ మిశ్రా కుమారుడే వినయ్‌మిశ్రా. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ప్రద్యుమ్న రాజ్‌పుత్‌ అంతగా ప్రముఖుడు కాదు.  

► ఢిల్లీ కాంగ్రెస్‌ చీఫ్‌ సుభాష్‌ చోప్రా కుమార్తె శివానీ చోప్రా ఆప్‌ అభ్యర్థి అతిషిపై కల్కాజీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు.  

► గాంధీనగర్‌లో బీజేపీ తరఫున ఆప్‌ నుంచి పార్టీ ఫిరాయించిన అనిల్‌ బాజ్‌పాయ్‌ రంగంలో ఉంటే, కాంగ్రెస్‌ నుంచి అర్వీందర్‌ సింగ్‌ లవ్లీ పోటీ పడుతున్నారు. ఇక్కడ ఆప్‌ నవీన్‌ చౌదరి అనే కొత్త నేతకు టిక్కెట్‌ ఇచ్చింది.  

► సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలు అత్యధికంగా జరిగిన సీలమ్‌పూర్‌లో కాంగ్రెస్‌ దిగ్గజం మాట్నీ అహ్మద్, ఆప్‌ అభ్యర్థి అబ్దుల్‌ రెహ్మాన్‌ను ఎదుర్కొంటున్నారు. ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో బీజేపీ పూర్వంచలి కార్డును బయటకి తీసి కౌశల్‌ మిశ్రాను బరిలో దింపింది.  


కాంగ్రెస్‌కు కాస్తయినా కలిసొస్తుందా?
అభ్యర్థుల ఎంపిక అందరికంటే ఎక్కువగా కాంగ్రెస్‌కే కలిసి వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అభ్యర్థి బలం, సీఏఏ వ్యతిరేక నినాదాలతో ఆ పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో ఆప్‌ ఓట్లను భారీగా చీలుస్తుందని సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీకి చెందిన రాజకీయ విశ్లేషకుడు ప్రవీణ్‌ రాయ్‌ అంచనా వేస్తున్నారు. కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఉచిత పథకాలు, సుపరిపాలన, పథకాల కొనసాగింపు కోసం ఇచ్చే గ్యారంటీ కార్డులనే నమ్ముకుంది. అయితే ఆ పార్టీ పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఎలాంటి ఆందోళనలు చేపట్టకపోవడంతో ముస్లిం సామాజిక వర్గంలో వ్యతిరేక ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని ప్రవీణ్‌ రాయ్‌ అభిప్రాయపడ్డారు. అయితే ఆ వ్యతిరేకత ఆప్‌ విజయావకాశాల్ని దెబ్బ కొట్టలేకపోవచ్చునని ఆయన అంటున్నారు. సీలమ్‌పూర్, ఓఖ్లా, మాతియా మహల్, బల్లిమారన్, ముస్తాఫాబాద్‌ నియోజకవర్గాల్లో ముస్లింల ప్రాబల్యం అధికం. ఈ త్రిముఖ పోటీలో అభ్యర్థుల బలం ఏ పార్టీకి కలిసి వస్తుందో వేచి చూడాల్సిందే.    

ఈ నియోజకవర్గాల్లో టఫ్‌ ఫైట్‌
చాందినీ చౌక్, ద్వారక,  గాంధీనగర్, సంగమ్‌ విహార్, కల్‌కాజీ, గ్రేటర్‌ కైలాశ్, కృష్ణా నగర్, మంగోల్‌పురి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement