
ఢిల్లీలో బహిరంగ సభలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ
సాక్షి న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న నిరసనలు దేశ సామరస్యతను దెబ్బతీసేందుకు పన్నిన రాజకీయ కుట్రలో భాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ఆ నిరసనలు యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావని, వాటిని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లు ఎగదోస్తున్నాయని విమర్శించారు. ఆ రెండు పార్టీలు సీఏఏ నిరసనల్లో రాజ్యాంగం, జాతీయ పతాకాలను ముందుపెట్టి అసలు కుట్ర నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సోమవారం ప్రధాని మోదీ తొలిసారి పాల్గొన్నారు.
షహీన్‌బాఘ్ నిరసనల కారణంగా ఢిల్లీ పౌరులు ముఖ్యంగా సాటిలైట్ సిటీ ప్రజలు అనేక ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ఢిల్లీ ప్రజలు కోపంగా, మౌనంగా ఈ ఓటుబ్యాంక్ రాజకీయాలను చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి ఈ అరాచకాన్ని ఆపేందుకు సహకరించాలని కోరారు. 21వ శతాబ్ది భారత్‌లో విద్వేష పూరిత రాజకీయాలు పనిచేయవని, అభివృద్ధి రాజకీయాలు మాత్రమే పనిచేస్తాయని కడ్కడూమా సీబీడీ గ్రౌండ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ వ్యాఖ్యానించారు.
బాట్లా హౌజ్ ఎన్‌కౌంటర్‌ను ప్రశ్నించినవారే ఇప్పుడు ‘తుక్డే తుక్డే’ నినాదాలు చేస్తున్నవారిని రక్షిస్తున్నారని కాంగ్రెస్‌పై పరోక్ష ఆరోపణలు చేశారు. పాక్ ఉగ్రవాదులపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించిన విషయాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. ఢిల్లీ ఒక నగరం కాదని, అది దేశ సాంస్కృతిక వారసత్వమని ప్రధాని పేర్కొన్నారు. ప్రతీ ఢిల్లీవాసి చెమటోడ్చి ఢిల్లీని ప్రస్తుతమున్న స్థాయికి తెచ్చారన్నారు. గత రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న పార్టీలు 21వ శతాబ్ది ప్రయోజనాలు ఢిల్లీకి అందకుండా చేశాయన్నారు.
ఢిల్లీ వాసులు లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి ఓటేసి దేశ భవిçష్యత్తు మారేందుకు బాట వేశారని, ఇప్పడు ఢిల్లీ భవిష్యత్తు మార్చడం కోసం మళ్లీ బీజేపీకే ఓటేయాలని కోరారు. ఢిల్లీ సురక్షితంగా, పరిశుభ్రంగా, ఆధునికంగా ఉండాలంటే తమ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ అనధికార కాలనీలను క్రమబద్దీకరిస్తామన్న తమ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నామని ప్రధాని గుర్తు చేశారు. ఢిల్లీలోని ఆప్ సర్కారు పీఎం ఆవాస్ యోజనను అడ్డుకుని పేదలకు ఇళ్లు ఇవ్వకుండా చేస్తోందని ఆయన ఆరోపించారు.
ఆప్‌కి మరోసారి అధికారమిస్తే కేంద్రం ప్రకటించిన ప్రజా సంక్షేమ పథకాలను అన్నింటినీ అడ్డుకుంటుందని ఆయన హెచ్చరించారు. పౌరసత్వ సవరణ చట్టం, కర్తార్‌పుర్ కారిడార్, 370 అధికరణం రద్దు, అయోధ్యపై కోర్టు తీర్పు, భారత బంగ్లాదేశ్ సరిహద్దు సమస్య పరిష్కారం.. తదితర అంశాలను ప్రసంగంలో ప్రస్తావించిన మోదీ.. ఇవన్నీ 70 ఏళ్ల తరువాత, తమ ప్రభుత్వ హయాంలోనే జరిగాయన్నారు. తాజా బడ్జెట్‌లో తమ ప్రభుత్వం సామాన్యుల కోసం, వ్యాపారుల కోసం చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా మోదీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment