
లక్నో: బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహిచేందుకు బీజేపీ ఎందుకు భయపడుతోందని బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) నాయకురాలు మాయావతి ప్రశ్నించారు. ఈవీఎంలపై తమకు విశ్వాసం లేదని ఆమె స్పష్టం చేశారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... బీజేపీ నాయకులకు తమ నిజాయితీ పట్ల నమ్మకముంటే భవిష్యత్తులో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించడానికి ఎందుకు భయపడుతున్నారని సూటిగా ప్రశ్నించారు.
సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా అభిమానుల సమక్షంలో కేక్ కోశారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌లపై విమర్శలు చేశారు. రెండు పార్టీలు దొందూ దొందేనని వ్యాఖ్యానించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుల గురించి ప్రశ్నించగా.. దీనికి చాలాసార్లు సమాధానం చెప్పానని అన్నారు. ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను లోక్‌సభ ఎన్నికలతో పాటు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఊహాగానాలపై ఆమె స్పందించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఇది చాలా ప్రమాదకర పరిణామమని వ్యాఖ్యానించారు.