![Supreme Court directs EC not to delete EVM data](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/SUPREME-COYRT--.jpg.webp?itok=9p0POFo2)
ఎన్నికల గుర్తుల లోడింగ్ యూనిట్‌ను తనిఖీ చేయాల్సి ఉంది
ఈ విషయంలో 15 రోజుల్లోపు మీ స్పందన తెలపండి
ఈసీకి సూచించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లలో పోలింగ్‌కు సంబంధించిన సమాచారం(డేటా), ఎన్నికల గుర్తుల లోడింగ్ యూనిట్లలో సమాచారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు(Supreme Court) కీలక ఆదేశాలు జారీచేసింది. ఎన్నికలు పూర్తయ్యాక ఓడిన అభ్యర్థి అభ్యర్థన మేరకు ఈవీఎంల వెరిఫికేషన్‌లో భాగంగా ఆయా ఈవీఎంలలోని డేటాను చెరిపేయడం, రీలోడ్ చేసే సంస్కృతిని మానుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం ఈసీకి సూచించింది. సింబల్ లోడింగ్ యూనిట్(ఎస్‌ఎల్‌యూ)ను తనిఖీ చేయాల్సి ఉందని పేర్కొంది. ఈవీఎంలలో మెమొరీని, ఎస్‌ఎల్‌యూలను తనిఖీచేసేందుకు అవకాశం ఇవ్వాలని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) అనే ఎన్‌జీవో సంస్థ, ఓడిన అభ్యర్థి సర్వ్ మిట్టెర్ వేసిన పిటిషన్‌ను మంగళవారం విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు పై విధంగా ఆదేశాలిచ్చింది.
డేటాను ఎందుకు తొలగిస్తున్నారు?
ఈసీ జారీచేసిన ఈవీఎం వెరిఫికేషన్ ప్రామాణిక నిర్వహణ విధానం(ఎస్‌ఓపీ) అనేది ఈవీఎం–వీవీప్యాట్ కేసులో 2024 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా లేదంటూ ఏడీఆర్ ఈ పిటిషన్‌ను దాఖలుచేసింది. ఈ కేసును విచారిస్తూ ధర్మాసనం ‘‘ ఎన్నికలయ్యాక అభ్యర్థి వచ్చి ఈవీఎంలోని మెమొరీని, మైక్రో కంట్రోలర్లను, ఎస్‌ఎల్‌యూలను ఇంజనీర్‌ను పిలిపించి తనిఖీచేయించాలని కోరితే ఈసీ ఆ ఈవీఎంలలో డేటాను వెరిఫికేషన్‌లో భాగంగా తొలగించకూడదు. అసలు మీరెందుకు డేటాను తొలగిస్తున్నారు?. పాత డేటాను అలాగే ఉంచండి. వెరిఫికేషన్ పేరిట డేటాను చెరిపేసి మళ్లీ అదే డేటాను రీలోడ్ చేయకూడదు. రీలోడింగ్ విధానాన్ని మానేయండి. ఎన్నికలయ్యాక ఇన్నాళ్లూ డేటాను తొలగించేందుకు మీరు అవలంభించిన విధానంపై వివరణ ఇవ్వండి.
ఈ విషయంలో స్పందన తెలిపేందుకు మీకు 15 రోజుల గడువు ఇస్తున్నాం. కేసు విచారణను వచ్చే నెల మూడో తేదీతో మొదలయ్యే వారంలో విచారిస్తాం’’ అని కేంద్ర ఎన్నికల సంఘానికి ధర్మాసనం సూచించింది. ఈవీఎంల వెరిఫికేషన్ కోసం ఒక విధానాన్ని తీసుకు రావాలంటూ గతంలో మాజీ హరియాణా మంత్రి, ఐదుసార్లు ఎమ్మెల్యే కరణ్ సింగ్ దలాల్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థి లఖాన్ కుమార్ సింగ్లాలు వేసిన మరో పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. గతంలో కరణ్ ఇలాంటి పిటిషన్ వేశారని గుర్తుచేసింది. బ్యాలెట్ పేపర్ విధానంలోకి మళ్లుదామంటూ వేసిన పిటిషన్‌నూ గత ఏడాది ఏప్రిల్‌లో కోర్టు కొట్టేసింది.
రూ.40 వేల ఫీజును తగ్గించండి
ఓడిన అభ్యర్థి ఒకవేళ ఈవీఎంలను తనిఖీ కోసం అభ్యర్థిస్తే అందుకోసం ఆయనపై వేసే ఫీజు భారాన్ని తగ్గించాలని కోర్టు సూచించింది. ఎన్నికల ఫలితాలొచ్చాక 45 రోజులపాటు సింబల్ లోడింగ్ యూనిట్లను, ఈవీఎంలతోపాటే స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచాలి. ‘‘అభ్యర్థి వచ్చి అడిగితే ఇంజనీర్‌తో ఈవీఎంలను వెరిఫై చేయించాలి. ఇందుకు ఏకంగా రూ.40,000 ఖర్చు అవుతుందా?. అంత ఫీజును అభ్యర్థిపై వేస్తారా?. ఇది చాలా ఎక్కువ మొత్తం. దీనిని తగ్గించండి’’ అని ఈసీ తరఫున హాజరైన న్యాయవాది మణీందర్ సింగ్‌ను ధర్మాసనం కోరింది. ‘‘ ఈవీఎంల వెరిఫికేషన్ పద్దతి అనేది కోర్టు ఆదేశాలకు అనుగుణంగా లేదు. ఈవీఎం సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లో ఏదైనా మతలబు ఉందో లేదో తెల్సుకునే స్వేచ్ఛ ఉండాలి’’ అని ఏడీఆర్ తరఫు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment