వైఎస్సార్‌సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్
సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లా టీడీపీ కార్యాలయం కోసం 50 కోట్ల విలువైన స్థలం ధారాదత్తం చేయటం దారుణమని వైఎస్సార్‌సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎవడబ్బ సొమ్మని ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ స్థలం టీడీపీ కార్యాలయానికి ఇస్తారు.
చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారు, భూ బకాసురుల్లా వ్యవహరిస్తున్నారు. జీవోలు అన్ని టీడీపీకి అనుకూలంగా, క్యాబినేట్ సమావేశాలు అన్ని భూ పంపిణీకి ఉపయోగిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ ప్రతి దాంట్లో స్టేలు తెచ్చుకోవడం పని, ఐటీ రైడ్‌లకు ఎందుకు భయపడుతున్నారు. మేము అధికారంలోకి రాగానే అన్నిటిపై విచారణ జరిపిస్తాం’’అని అన్నారు.
ఆ హక్కు మీకెక్కడిది : మల్లాది విష్ణు
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూ కేటాయింపులు విపరీతంగా పెరిగిపోయాయని వైఎస్సార్‌సీపీ నేత మల్లాది విష్ణు ఆరోపించారు. చంద్రబాబు తన సొంత ఆస్తుల్లా ప్రభుత్వ భూములను కేటాయిస్తున్నారన్నారు. విజయవాడ నడిబొడ్డున 100 కోట్ల భూమిని ఏడాదికి 1000 రూపాయలకు కట్టబెడతారా! అంటూ మండిపడ్డారు. ఇరిగేషన్ భూమిని మీ ఇష్టం వచ్చినట్టు తీసుకునే హక్కు మీకు ఎక్కడిదని ప్రశ్నించారు. సిట్టింగ్ జడ్జితో భూ కేటాయింపులపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
టీడీపీ నాయకులు లూటీలు, దోపిడీలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కార్యాలయాలకు ఇచ్చిన భూములపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో పేదలకు ఒక్క ఇల్లైనా కట్టించారా అని ప్రశ్నించారు. చంద్రబాబుపై వస్తున్న ఆరోపణలపై ఆయనే స్వచ్ఛందంగా విచారణ జరిపించుకోవాలని సూచించారు. తాము అధికారంలోకి రాగానే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment