సాక్షి, న్యూఢిల్లీ : చైనా ఇప్పుడు ప్రపంచానికే పెద్ద ఫాక్టరీగా మారింది. దాంతో చైనా, తనకు ఏ దేశం ఎదురు తిరిగినా దానిపై ఆర్థిక ప్రతిష్టంబన దాడిని కొనసాగిస్తోంది. కరోనా వైరస్ ఆవిర్భవించిన చైనాపై ఆస్ట్రేలియా కన్నెర్ర చేయడంతో కోపం వచ్చిన చైనా, వెంటనే ఆస్ట్రేలియాలోని నాలుగు ప్రధాన కబేళాల నుంచి గోమాంసం దిగుమతిని నిలిపివేసింది. బార్లీ గింజల దిగుమతులపై భారీ సుంకాలను విధించింది. ఇదే తరహాలో ఇప్పుడు భారత్‌పై ఆర్థిక దాడి చేసేందుకు చైనా సిద్ధం అవుతోంది. (‘యాప్‌ల బ్యాన్ అభినందనీయం’)
భారత్ సరిహద్దు సైన్యంతో చైనా సైన్యం సంఘర్షణకు దిగడంతో ఆగ్రహించిన భారత్ చైనాకు చెందిన 59 యాప్స్‌ను నిషేధించింది. ‘చైనా, భారత్ సరిహద్దులో ఎటు వైపు నుంచి ఎవరి సైన్యం దురాక్రమణకు పాల్పడలేదు’ అంటూ ప్రధాని మోదీ ప్రకటించినప్పటి నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య విమర్శల దాడి తీవ్రమై సరికొత్త విషయాలు వెలుగులోకి రావడం మొదలయ్యాయి. చైనాతో మోదీ మెతక వైఖరి అవలంబిస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించడంతో సోనియా నాయకత్వంలోని ‘రాజీవ్ గాంధీ ఫౌండేషన్’ చైనా నుంచి భారీ ఎత్తున విరాళాలు స్వీకరించిందని, అందుకు ప్రతిఫలంగా 2005–06 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం చైనాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుందని బీజేపీ విమర్శించింది. (పాక్తో చేతులు కలిపిన చైనా?)
‘పీఎం కేర్స్’నిధి చైనాకు చెందిన ‘హ్వావీ, టిక్‌టాక్’ కంపెనీల నుంచి విరాళాలు తీసుకుందంటూ కాంగ్రెస్ పార్టీ ప్రత్యారోపణలు చేసింది. కోవిడ్–19 అత్యవసర నిధి కోసం గత మార్చి నెలలో ప్రధాని నరేంద్ర మోదీ, తాను చైర్మన్‌గా ‘పీఎం కేర్స్’ను ఏర్పాటు చేశారు. ఆయన నిషేధించిన యాప్స్‌లో టిక్‌టాక్ కూడా ఉన్న విషయం తెల్సిందే. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మొదటి నుంచి చైనా సహా పలు దేశాల నుంచి విరాళాలు తీసుకుంటున్నాయి. ఈ రెండు పార్టీలు విదేశీ విరాళాల నియంత్రణా చట్టాన్ని ఉల్లంఘించి విరాళాలు తీసుకున్నాయంటూ 2014లో ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా మందలించింది. (మరో రెండు చైనా కంపెనీలు బ్యాన్..)
దాంతో 2016లో విదేశీ విరాళాల నియంత్రణా చట్టంలో మోదీ ప్రభుత్వం, రాజకీయ పార్టీల విరాళాలకు అనుకూలంగా సవరణ తీసుకొచ్చింది. ’భారతీయ చట్టాల పరిధిలో పరిమితికి లోబడి విదేశీ పెట్టుబడులున్న కంపెనీలను ఇక నుంచి దేశీయ కంపెనీలుగానే పరిగణించాలి’ అంటూ సవరణ తీసుకొచ్చారు. పార్టీల విరాళాల కోసం బాండుల విధానాన్ని మోదీ ప్రవేశపెట్టిన నాటి నుంచి బీజేపీకీ చైనా పెట్టుబడులుగల భారతీయ కంపెనీల నుంచి ఎక్కువ మొత్తాల్లో విరాళాలు వస్తున్నాయనే విమర్శలు వచ్చాయి. చైనా కంపెనీలు భారత ఆర్థిక వ్యవహారాల్లో తమ ప్రాబల్యం కోసమే విరాళాల రూపంలో లంచాలిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. చైనాపై ఇతర చర్యలకు ఉపక్రమించడానికి ముందు ఏ రూపంలోనైనా చైనా కంపెనీల నుంచి రాజకీయ పార్టీలకు విరాళాలు రాకుండా నిషేధం విధించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment