
సాక్షి, పాపానాయుడుపేట : ‘‘మహానేత వైఎస్సార్ బతికున్నప్పుడు బీసీలందరికీ ఒక భరోసా ఉండేది. ఇంటికి ఒక్కరైనా డాక్టరో, ఇంజనీరో అయితే కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయని ఆయన నమ్మారు. అందుకే ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని రూపొందించి పేదలకు ఉన్నతవిద్యను దగ్గరచేశారు. ఆయన చూపిన బాటలోనే నేను కూడా బీసీలకు తోడుంటా. బీసీల అభ్యున్నతి కోసం నాన్నగారు ఒక్క అడుగు ముందుకు వేశారు. నేను ఇంకో రెండు అడుగులు ముందుకు వేస్తాను’’ అని వైఎస్ జగన్ బీసీలకు మాటిచ్చారు. 64వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా పాపానాయుడుపేటలో జరిగిన బీసీ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.
వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘‘ గడిచిన నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు బీసీలను దారుణంగా మోసం చేశారు. ఎన్నికలప్పుడు మాత్రమే బీసీ జపం చేసే ఆయన.. నాలుగు ఇస్త్రీ పెట్టేలు, నాలుగు కత్తెర్లు ఇచ్చి బీసీలను బాగుచేశామని చెప్పుకుంటారు. మేనిఫేస్టోలో ప్రతి కులానికి ఒక పేజీ పెట్టారు. గౌడ సోదరులు కనిపిస్తే వారి భుజాన ఉన్న ట్యూబ్ తన భుజంపై వేసుకొని ఫోజులు కొడతారు. చేనేత కార్మికుల ఇంట్లో దూరి పక్కనే కూర్చోని ఫొటోలు దిగుతారు. ఆ ఫొటోలతో ఎన్నికల ప్రణాళిక ప్రకటించారు. రజకులను ఎస్సీలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామని, కురువ, కురుభలను ఎస్టీలుగా గుర్తిస్తామని, బోయలను ఎస్టీల్లో చేరుస్తామని.. ఇలా ఇలా ప్రతి కులానికి హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊసేమర్చిపోయారు. ఇటీవల మత్య్సకారులు కొందరు చంద్రబాబు దగ్గరికెళ్లి ఎన్నికల హామీలపై నిలదిస్తే ఆయన.. ‘ముఖ్యమంత్రినే అడుగుతావా? తాటతీస్తా..ఖబడ్దార్’ అని హెచ్చరించిన సంగతి మనందరం చూశాం. సాధ్యం కాని హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రతి కులాన్ని మోసం చేశాడు. మొన్న అసెంబ్లీలో బోయలను ఎస్టీలుగా చేర్చుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. తద్వారా నా పనైపోయిందని చేతులు కడుక్కున్నారు. ఏమిటికి ఏమీ జరగకముందే కేక్‌లు కట్‌చేస్తారు. మరో వర్గానికి ఫోన్లు చేసి ధర్నాలు చేయమంటారు! చిత్తూరు జిల్లాలోనే పెరిక బలిజ కులస్తులు 40 సంవత్సరాలుగా బీసీలుగా ఉన్నవారు సర్టిఫికెట్ అడిగితే ఇవ్వడం లేదు. అగ్ని కుల క్షత్రియులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా దిక్కులేదు. ఇదీ.. చంద్రబాబు బీసీలను మోసగిస్తున్న తీరు.
ప్రజా ప్రభుత్వంలోనే బీసీల తలరాతలు మారుతాయి : మరికొద్ది నెలల్లోనే ఎన్నికలు రానున్నాయి. ఇన్నేళ్ల దుర్మార్గపాలనకు చరమగీతం పాడాల్సిన సమయం రానుంది. మీ అందరి దీవెనలతో మనదైన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బీసీల తలరాతలు మారుతాయి. మహానేత కలగన్నట్లు ప్రతి పేదింటి నుంచి ఒకరిని డాక్టర్ లేదా ఇంజనీర్ చదివించే బాధ్యత నాది. అందుకోసం ఎన్ని లక్షలు ఖర్చైనా వెనుకాడబోను. బీసీల అభ్యున్నతి కోసం నాన్నగారు ఒక్క అడుగు ముందుకు వేశారు. జగన్ రెండు అడుగులు ముందుకు వేస్తాడు. పెద్ద చదువులు చదివించడమే కాదు.. హాస్టల్ ఖర్చుల కింద ప్రతి ఏటా రూ.20 వేలు చెల్లిస్తాం. చిన్న పిల్లల్ని బడికి పంపే తల్లులకు సంవత్సరానికి రూ.15 వేలు ఖాతాలో జమ చేస్తాం. మనందరి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ రూ.2 వేలకు పెంచుతాం. బీసీ, ఎస్టీ, ఎస్సీల్లో శ్రామికులు ఎక్కువగా ఉంటారు కాబట్టి పింఛన్ వయసు 45 ఏళ్లకే తగ్గిస్తాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం. ప్రతి పేదవారికి పక్కా ఇల్లు కట్టించితీరుతాం. పేదలకు మంచి చేసేందుకు బీసీ అధ్యాయన కమిటీ ఏర్పాటుచేశాం. వారు ప్రతి జిల్లాలో అన్ని కులాలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. పాదయాత్ర ముగిసిన తరువాత బీసీ గర్జన నిర్వహిస్తాం. ఆ సభలో బీసీ డిక్లరేషన్ చేస్తాం. అందులో బీసీలకు ఏం చేస్తామన్నది మరింత స్పష్టంగా చెబుతాం. మీరంతా నాకు తోడుగా ఉంటే చాలా కొద్ది సమయంలోనే మార్పును చూడబోతున్నాం’’ అని వైఎస్ జగన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment