‘ఉత్తరాంధ్ర అభివృద్ధికి పాటుపడతా’ | Will Develop North Andhra Pradesh Says Vijayasai Reddy | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్ర అభివృద్ధికి పాటుపడతా : విజయసాయి

Published Wed, May 2 2018 11:53 AM | Last Updated on Thu, Aug 9 2018 2:42 PM

Will Develop North Andhra Pradesh Says Vijayasai Reddy - Sakshi

సాక్షి, విశాఖపట్టణం : ఉత్తరాంధ్ర అభివృద్ధి పాటు పడతానని వైఎస్సార్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. బుధవారం విశాఖపట్టణంలో సంఘీభావ యాత్ర ప్రారంభానికి ముందు ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్రకు మద్దుతుగా సంఘీభావ యాత్రతో ప్రజల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు. పాదయాత్రలో ప్రతి ఒక్కరి అభిప్రాయాలను తెలుసుకుంటానని చెప్పారు. మూడు దశాబ్దాల పాటు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా సేవలు అందించాలని అభిలషించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేటి వరకూ అమలు నోచుకోలేదని అన్నారు. ‘ఏపీ హామీలను నెరవేర్చాలనే డిమాండ్‌తో గత నాలుగేళ్లుగా వైఎస్సార్‌ సీపీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. అధికారంలో ఉ‍న్న టీడీపీ-బీజేపీ కూటమి రాష్ట్రానికి అన్యాయం చేశాయి. ఎన్నికల ప్రచారంలో తిరుపతి వచ్చిన ప్రధాని మోదీ రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. విశాఖకు రైల్వే జోన్‌ను కూడా ప్రకటిస్తామన్నారు. వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా ఆంధ్ర హక్కుల అనే నినాదంతో వైఎస్‌ జగన్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాటం చేస్తున్నారు.

కేంద్రంపై అవిశ్వాసం పెట్టాం. లోక్‌సభ సభ్యులు రాజీనామాలు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ, బీజేపీలు పాటుపడటం లేదు. గతేడాది జులై 8న వైఎస్సార్‌ సీపీ ప్లీనరీ సమావేశాల్లో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా కావాలని, ప్రజల శ్రేయస్సు కోసం వైఎస్‌ జగన్‌ నవరత్నాలను ప్రకటించారు. నవరత్నాలను అమలు చేస్తే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. నవరత్నాల అమలుకు వనరులు కావాలి. తగిన వనరులు కావాలంటే ప్రత్యేక హోదా కావాలి. చంద్రబాబు ప్రత్యేక హోదాను నమ్మడం లేదు. వైఎస్సార్‌ సీపీని గెలిపించుకుంటే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందుతుంది. ప్రజాశ్రేయస్సు కోసం వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను కార్యకర్తలందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలి.’ అంటూ విజయసాయి రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement