పట్నా: లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ఆహార శుద్ధి పరిశ్రమలను బాగా ప్రోత్సహిస్తామన్నారు. బిహార్ రాజధాని పట్నాలో మూడు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. కేంద్రం తెచ్చిన పంట బీమా పథకం పేద రైతులు కష్టపడి సంపాదించుకున్న డబ్బును కొందరు పెద్ద వ్యాపారవేత్తల జేబుల్లోకి చేరుస్తోందని రాహుల్ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే రైతుల దుస్థితిని మారుస్తామనీ, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల్లో కాంగ్రెస్ ఇటీవల అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే రైతుల రుణాలను మాఫీ చేసిన విషయాన్ని రాహుల్ గుర్తు చేశారు. ప్రజలందరికీ కనీస ఆదాయాన్ని కూడా కల్పిస్తామనీ, 2014లో బీజేపీ ఇచ్చిన రూ. 15 లక్షల అబద్ధపు హామీలాంటిది ఇది కాదని రాహుల్ చెప్పారు. రాహుల్‌కు ప్రధాని అయ్యే అన్ని అర్హతలూ ఉన్నాయని బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment