
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కేబినెట్‌లోని మంత్రులకు ఎట్టకేలకు శాఖలు లభించాయి. అనుకున్నట్లుగానే ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు తెరమీదకొచ్చారు. తద్వారా యడియూరప్ప దూకుడుకు కళ్లెం పడుతుందని అధిష్టానం వ్యూహం రచించినట్లుగా తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం పతనం అనంతరం రాజకీయ సంక్షోభానికి తెరదించుతూ కమలదళం కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో అమాత్య పదవులపై పార్టీలోని ఎంతో మంది సీనియర్ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 20వ తేదీన 17 మంది మంత్రులు ప్రమాణం చేయగా, శాఖల కేటాయింపు మాత్రం ఇన్నాళ్లుగా పెండింగ్‌లో ఉంది. ఇక మంత్రివర్గంలో చోటు దక్కని వారు కొందరు బహిరంగంగా ఆగ్రహం వెళ్లగక్కగా... మంత్రి పదవి వరించినవారు మంచి శాఖ కావాలని ప్రయత్నాలు సాగిస్తుండగా, అసలు పదవే లేనివారు కినుక వహించిన విషయం తెలిసిందే. అంతేగాకుండా రెండో విడతలో మంత్రి పదవి ఇస్తే సరి, లేని పక్షంలో ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధమని పలువురు ఎమ్మెల్యేలు సంకేతాలిచ్చారు.
ఈ నేపథ్యంలో అసంతృప్తిని చల్లార్చేందుకు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అధిష్టానం సహాయం కోరారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన యడియూరప్ప పార్టీ పెద్దలతో చర్చించి శాఖల కేటాయింపు విషయమై తుది నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో గవర్నర్ వీఆర్ వాలాకు మంత్రుల జాబితా అందజేశారు. 17 మందిలో ముగ్గురికి ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చారు. ఈ క్రమంలో గోవింద కారజోళ (దళిత), డాక్టర్ అశ్వర్థనారాయణ (ఒక్కళిగ), లక్ష్మణసవది (లింగాయత్) కి డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. బసవరాజు బొమ్మైకి హోం శాఖ దక్కింది. మాజీ సీఎం జగదీశ్ శెట్టర్‌కు భారీ, మధ్య తరహా పరిశ్రమలు, చక్కెర పరిశ్రమల శాఖ కేటాయించారు.
మంత్రులు- శాఖలు
1. గోవింద కారజోళ- ప్రజాపనులు, సాంఘిక సంక్షేమం (డిప్యూటీ సీఎం-1)
2. అశ్వర్థనారాయణ- ఉన్నత విద్య, ఐటీబీటీ (డిప్యూటీ సీఎం-2)
3. లక్ష్మణ సవది- రవాణా (డిప్యూటీ సీఎం-3)
4. బసవరాజు బొమ్మై-హోం
5. జగదీశ్ శెట్టర్-భారీ, మధ్య పరిశ్రమలు, చక్కెర పరిశ్రమలు
6. ఆర్.అశోక్-రెవెన్యూ
7. కేఎస్ ఈశ్వరప్ప-గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్
8. జేసీ మాధుస్వామి-న్యాయ, చిన్న నీటిపారుదల
9. వి.సోమణ్ణ-హౌసింగ్
10. సురేశ్‌కుమార్- ప్రాథమిక, మాధ్యమిక విద్య
11. కోటా శ్రీనివాసపూజారి-పోర్టు, మత్య్సశాఖ
12. బి.శ్రీరాములు-ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, వైద్యవిద్య
13. సీటీ రవి-పర్యాటకం
14. సీసీ పాటిల్-గనులు, భూగర్భ గనుల శాఖ
15. శశికళ జొల్లె-మహిళా శిశు సంక్షేమ శాఖ
16. ప్రభు చౌహాన్-పశు సంవర్ధక శాఖ
17. హెచ్.నగేశ్ -అబ్కారీ శాఖ
Comments
Please login to add a commentAdd a comment