
యర్రా నవీన్ (ఎఫ్‌బీ ఫొటో)
పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో ముసలం మొదలైంది
సాక్షి, తాడేపల్లిగూడెం: పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో ముసలం మొదలైంది. పశ్చిమ గోదావరి జల్లా జనసేన కో-కన్వీనర్ యర్రా నవీన్ గురువారం పార్టీకి రాజీనామా చేశారు. పవన్ కనీసం తనను మాటమాత్రమైనా సంప్రదించకుండా తాడేపల్లిగూడెం అభ్యర్థిని ప్రకటించారన్న మనస్తాపంతో రాజీనామా చేసినట్టు ఆయన వెల్లడించారు. పార్టీలో కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారని, కానీ అలా జరగలేదని వాపోయారు.
పార్టీలో కష్టపడినవారికి కాకుండా ఇతర పార్టీల్లో టికెట్ ఆశించి భంగపడిన వారికి టికెట్ ఇవ్వడం సమంజసం కాదని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ కనీసం జనసేన పార్టీ కార్యాలయంలో అప్లికేషన్ కూడా పెట్టలేదని వెల్లడించారు. దరఖాస్తులు చాలా వచ్చాయని చెప్పుకోవడం కాదు. అప్లికేషన్ పెట్టిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోయినా కష్టపడిన వారికి ఇచ్చి ఉంటే చాలా సంతోషించేవాడినని అన్నారు.
‘పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చే పార్టలోకి వచ్చా. జనసేన పార్టీ అన్ని పార్టీల లాంటిది కాదని అనుకున్నా. కానీ ఇది కూడా స్వార్ధ రాజకీయ పార్టీనేనని తేలిపోయింది. నా రాజీనామాతో అయినా మళ్లీ ఇటువంటి పొరపాటు జరగకుండా చూస్తారనే రాజీనామా చేస్తున్నా. అభిమానుల అభిప్రాయంతో తదుపరి కార్యాచరణ రెండురోజుల్లో ప్రకటిస్తాన’ని యర్రా నవీన్ తెలిపారు. (చదవండి: జనసేన అభ్యర్థులు వీరే)