మంగళసూత్రాల తయారీ హక్కు మీదే | YS Jagan Assurance to the Vishwabrahmins | Sakshi
Sakshi News home page

మంగళసూత్రాల తయారీ హక్కు మీదే

Published Mon, Oct 1 2018 4:14 AM | Last Updated on Mon, Oct 1 2018 7:18 PM

YS Jagan Assurance to the Vishwabrahmins - Sakshi

ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఆదివారం విజయనగరం జిల్లా కోరుకొండ వద్ద స్వర్ణకారుల సమస్యలను వింటున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కార్పొరేట్‌ జ్యుయలరీ షాపులతో కుదేలవుతున్న విశ్వబ్రాహ్మణులకు (స్వర్ణకారులు) చేయూతనిస్తూ.. వీరు మాత్రమే మంగళసూత్రాలను తయారు చేసేలా హక్కు కల్పిస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ మేరకు తొలి చట్టసభలోనే తీర్మానం చేస్తామని ప్రకటించారు. పోలీసుల వేధింపులు లేకుండా ఇప్పుడున్న చట్టానికి సవరణలు చేస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ సీటిచ్చి విశ్వ బ్రాహ్మణులకు చట్ట సభల్లో స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 274వ రోజు ఆదివారం ఆయన విజయనగరం జిల్లాలో పాదయాత్ర సాగిస్తుండగా కోరుకొండ వద్ద స్వర్ణకారులు కలిశారు. సామాజిక, వృత్తిపరమైన సమస్యలను వారు జగన్‌కు చెప్పుకున్నారు. అధికారంలోకొచ్చాక న్యాయం చేయాలని వేడుకున్నారు. స్వర్ణకారులతో జగన్‌ దాదాపు అరగంట సేపు గడిపారు. వారి ఆవేదనను ఓపికగా విన్నారు. ఈ సందర్భగా జగన్‌ ఏమన్నారంటే..  

మీ డిమాండ్లు న్యాయమైనవే.. 
‘‘విశ్వ బ్రాహ్మణులు అడిగే ప్రతి డిమాండ్‌ న్యాయ సమ్మతమైనదే. అన్నీ చేయదగ్గవే. కార్పొరేట్‌ బంగారు దుకాణాలతో స్వర్ణకారులు పోటీపడలేకపోతున్నారనేది నూటికి నూరుపాళ్లు నిజం. వాళ్లు ఐదారు కోట్ల రూపాయలు ఖర్చు చేసి బంగారాన్ని వస్తువులుగా మార్చే యంత్రాలను తెస్తున్నారనేది వాస్తవం. అంత పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టలేని స్థితిలో స్వర్ణకారులున్నారనే విషయం నాకు తెలుసు. అందుకే వాళ్ల ఆధిపత్యాన్ని తట్టుకోలేపోతున్నామనే మీ బాధ నాకర్థమైంది. కార్పొరేట్‌ జ్యుయలరీ షాపుల వల్ల లక్షల మంది ఉపాధి కోల్పోతున్నామని, దీనికి పరిష్కారం కావాలని, విశ్వబ్రాహ్మణుల్లో ఒకరైన స్వర్ణకారులు చేస్తున్న డిమాండ్‌ పూర్తిగా ఆమోదయోగ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని, మేలు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. రేపు మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. 11 వస్తువులను చేనేత వృత్తుల వారు మాత్రమే తయారు చేయాలని ఏ విధంగా చెప్పారో, అదే మాదిరిగా మంగళసూత్రాలను తయారు చేసే హక్కును కార్పొరేట్‌ జ్యుయలరీలతో పోటీ పడలేని చిన్న చిన్న షాపులు నడుపుతున్న స్వర్ణ్ణకారులకే కల్పిస్తూ మొట్ట మొదటి చట్టసభలో తీర్మానం చేస్తాం. దీనివల్ల మంగళసూత్రాలను కార్పొరేట్‌ షాపుల్లో అమ్మలేరు. ఇవి మీ దగ్గరే దొరుకుతాయి కాబట్టి కొద్దో గొప్పో బతకడానికి ఇది ఆశ కల్పిస్తుంది. 

వేధింపుల చట్టాన్ని మారుస్తాం 
జీవో నంబర్‌ 272లో అభ్యంతరకరమైన క్లాజులున్నాయని, దొంగ బంగారం తెచ్చారని పోలీసులు విచక్షణా రహితంగా హింసిస్తున్నారని స్వర్ణకారులు నాకు చెప్పారు. మనం అధికారంలోకి రాగానే ఈ చట్టంలో మార్పులు తెస్తాం. వ్యవస్థ బాగుపడేలా, వ్యవస్థ వల్ల మీరు నష్టపోకుండా, మీ అందరి సూచనలను పరిగణనలోకి తీసుకుని పోలీసుల నుంచి వేధింపులు లేకుండా చట్టంలో మార్పులు తీసుకొస్తాం. చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదని ప్రతి నియోజకవర్గంలో స్వర్ణకార సోదరులు చెబుతున్నారు. మీకూ ప్రాతినిధ్యం ఉండాలని కోరుతున్నారు. దీనికి పరిష్కారంగా మీ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే స్థానం ఇచ్చి చట్టసభల్లో కూర్చోబెడతాను. బీసీ–బిలో ఉన్న వారిని బీసీ–ఏగా చేయాలని అడిగారు.

ఈ విషయంలో మాత్రం నేను స్పష్టంగా చెబుతున్నాను. రాజకీయ నాయకులు కులాల వ్యవస్థలో వేలు పెట్టకూడదు. అలా చేసి, బీసీ–బిలను బీసీ–ఏగా చేస్తామని, ‘సి’ని ‘ఏ’గా మారుస్తామని వేలు పెట్టి మాట్లాడతారో.. అప్పుడు బీసీలకు మేలు జరగడం కన్నా అన్యాయమే ఎక్కువ జరుగుతుంది. దీన్ని రాజకీయ నాయకులు పారదర్శకంగా వదిలేయాలి. బీసీ కమిషన్‌ను కచ్చితంగా ఏర్పాటు చేస్తాం. మీ దగ్గర్నుంచి వచ్చిన డిమాండ్‌ను కమిషన్‌కు అప్పజెపుతాం. కమిషన్‌ ఏం చేస్తుందనే దానిపై మాత్రం మేము వేలు పెట్టం. న్యాయంగా, ధర్మంగా ఏ కులం ఎక్కడుండాలనేది వాళ్ల విచక్షణకే వదిలిపెడతాం. ఎందుకంటే రాజకీయ నాయకుడు వేలు పెడితే ఆ కులం ఓట్లను ప్రభావితం చేసేందుకు ‘ఏ’లను బీలుగా, ‘బీ’లను ‘సీ’గా మారుస్తాడు. ఇలా చేయడం వల్ల చాలా కులాలు నష్టపోతాయి. కొన్ని కులాల ఓట్‌ బ్యాంక్‌ కోసం మిగిలిన కులాలు నష్టపోయే పరిస్థితిలోకి వ్యవస్థ దిగజారి పోతుంది. కాబట్టి ఈ ఒక్క విషయం కాకుండా మిగిలిన మీరు అడిగిన ప్రతి ఒక్కటీ సంపూర్ణంగా నెరవేరుస్తానని హామీ ఇస్తున్నాను. 

ప్రతి అక్కకు భరోసా.. వైఎస్సార్‌ చేయూత 
వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా ప్రతి అక్కను చెయ్యి పట్టుకుని నడిపిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కార్పొరేషన్ల వ్యవస్థలో పూర్తిగా మార్పు తెస్తాం. 45 ఏళ్లు పైబడిన ప్రతి అక్కకు రూ.75 వేలు నాలుగు దఫాల్లో వచ్చేలా చేస్తాం. ఈ పథకాన్ని పూర్తి పారదర్శకంగా అమలు చేస్తాం. దీనివల్ల ప్రతి ఏడాది రూ.19 వేల వరకు.. నాలుగేళ్లలో రూ.75 వేలు ప్రతి అక్కకు ఉచితంగా అందుతుంది’’ అని వైఎస్‌ జగన్‌ చెప్పారు.  

జనం గుండె చప్పుళ్లలో జననేత
అడుగడుగునా జన స్పందన.. అన్ని చోట్లా ప్రజా వెల్లువ.. కన్పిస్తే చాలనుకున్న అవ్వా తాతలు.. కలిసి నడవాలని తపించిన యువత, అక్కచెల్లెమ్మలు.. ఈ సన్నివేశాలు ఆదివారం జననేత పాదయాత్రలో ప్రతి పల్లె గడపలోనూ కనిపించాయి. విజయనగరం జిల్లా పాత భీమసింగి నుంచి మొదలైన పాదయాత్ర బలరాంపురం, కుమరాన్, కోరుకొండ, చిన్నపురం జంక్షన్, కోరాడపేట, చాకలిపేట మీదుగా జొన్నవలస క్రాస్‌ వరకు సాగింది. అదివారం సెలవు కావడంతో అన్ని వర్గాల ప్రజలు జననేత కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు. తప్పెట్లు, తాళాలు.. డప్పు వాయిద్యాలు.. ఆనందంతో డాన్సులు.. విచిత్ర వేషధారణలు.. పూల వర్షాలు.. అశ్వాలతో ఊరేగింపులతో జననేతకు స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టి స్వాగతించారు. ఎర్రటి ఎండలో, ఊపిరాడని ఉక్కపోత వాతావరణంలో.. వందలు... వేల మంది చుట్టుముట్టినా.. సమస్యలు చెప్పేందుకు పోటీపడ్డా జగన్‌ మాత్రం ఓపికగా ప్రతి ఒక్కరినీ నవ్వుతూ పలకరించారు.

దారిపొడవునా ఎన్నో కన్నీటి గాధలు.. ప్రతి అడుగులోనూ ప్రజల ఆవేదనలే. ‘వంద శాతం అంగ వైకల్యమున్నా చంద్రన్న బీమా వర్తింపజేయలేదన్నా..’ అంటూ కన్నీళ్లు పెట్టాడు కోటరాజు. భీమసింగి సహకార చక్కెర ఫ్యాక్టరీ కార్మికులు వారి మనోవేదనను జననేత ముందుంచారు. నష్టాల్లోకెళ్లిన తమ ఫ్యాక్టరీని దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి రూ.18 కోట్లు ఇచ్చి నిండు మనసుతో ఆదుకున్నాడని చెప్పారు. చంద్రబాబు వచ్చాక ఈ ఫ్యాక్టరీ రూ. 47 కోట్ల అప్పుల్లోకెళ్ళిందని, పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బలరామపురం వద్ద జననేతను రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కలిశారు. సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని, తమకూ హెచ్‌ఆర్‌ విధానం అమలు చేయాలని కోరారు. కోరుకొండ వద్ద పలువురు ఉద్యోగులు కలిసి సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఇదే గ్రామంలో విశ్వబ్రాహ్మణులు వారి కష్టాలు చెప్పుకున్నారు. అందరి కష్టాలను ఓపికగా విన్న జననేత మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. 

దటీజ్‌ జగన్‌.. 
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం చిన్నాపురం క్రాస్‌ మీదుగా జగన్‌ పాదయాత్ర సాగింది. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని క్రితం రోజు అర్ధరాత్రి ప్రభుత్వాధికారులు, పోలీసులు బలవంతంగా తొలగించారు. అడ్డుపడ్డ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. రెచ్చగొట్టే చర్యల్లో భాగంగానే మంత్రి గంటా ఆదేశాల మేరకు ఇది జరిగిందనే ఆవేశం వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్లో బలంగా కనిపించింది. అదే మార్గంలో జగన్‌ వెళ్తున్నారని.. ఆ సమయంలో కార్యకర్తల మనోభావాలు, ఆవేశం ఎలా ఉంటుందోననే టెన్షన్‌ అందరిలోనూ కన్పించింది. ముందు జాగ్రత్త చర్యగా భారీ సంఖ్యలో అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. విగ్రహాన్ని తొలగించిన టీడీపీ నేతలూ భయం భయంగా ఉన్నట్టు స్థానికులు చెప్పుకున్నారు. ఇలాంటి వాతావరణంలో జగన్‌ సంయమనం పాటించడం.. ఎక్కడా కార్యకర్తలు ఆవేశపూరితంగా వ్యవహరించకుండా జాగ్రత్త పడటంతో బందోబస్తులో ఉన్న పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఉద్రిక్తతకు ఆస్కారం ఇవ్వకుండా ఆ మార్గంలో జగన్‌ వెళ్లడాన్ని చూసి పోలీసు వర్గాలు అభినందించడం కనిపించింది. ‘నాయకుడంటే జగనే.. నాయకత్వ లక్షణమంటే ఇదీ’ అంటూ ఓ సీనియర్‌ పోలీసు అధికారి జగన్‌ ఆ ప్రాంతం నుంచి వెళ్లాక తన సిబ్బంది ఎదుట వ్యాఖ్యానించారు.   

బాక్సైట్‌ తవ్వకాల జీవో రద్దు చేయకుండా బాబు నాటకం 
వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చిన గిరిజన నేతలు 
టీడీపీ అధికారంలోకి రాగానే విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాల కోసం జారీ చేసిన జీవో 97ను రద్దు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాటకం ఆడుతున్నారని గిరిజన నేతలు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. వైఎస్సార్‌సీపీ అరకు కో ఆర్డినేటర్‌ చెట్టి పాల్గుణ, అరకు పార్లమెంటు విద్యార్థి విభాగం నాయకుడు టి.సురేష్‌కుమార్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి వినయ్, ఇతర నేతలు రామారావు, జాన్‌ రవి తదితరులు ఆదివారం పాదయాత్రలో జననేతను కలిసి బాక్సైట్‌ తవ్వకాల కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల గురించి వివరించారు. ఇందులో భాగంగా విడుదల చేసిన జీవో 97ను శాశ్వతంగా రద్దు చేయాలని, గిరిజనుల భూములు, హక్కుల పరిరక్షణ కోసం 1/70 చట్టాన్ని మరింత పటిష్టం చేయాలని, ఐటీడీఏ పరిధిలో ఉన్న బ్యాక్‌లాగ్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. గిరిజన నేతలు తీసుకొచ్చిన ప్లకార్డులను వైఎస్‌ జగన్‌ కూడా చేత పట్టుకుని కొద్దిదూరం నడిచారు. మైదాన ప్రాంతంలో ఉంటున్న ఎస్టీలకు ఐటీడీఏ రుణాలు అందడం లేదని విజయానందపురం ఎస్టీ కాలనీ వాసులు జగన్‌ను కలిసి మొరపెట్టుకున్నారు. మన ప్రభుత్వం రాగానే తప్పకుండా గిరిజనుల హక్కుల పరిరక్షణకు పెద్దపీట వేద్దామని భరోసానిచ్చారు. 

పుట్టుకతో దివ్యాంగుడినైనా పింఛన్‌ ఇవ్వడం లేదు 
‘అన్నా.. మాది ముఖాస కొత్తవలస. నేను పుట్టుకతోనే దివ్యాంగుడిని. కాళ్లు, చేతులు పనిచేయవు. కళ్లు కూడా సరిగ్గా కనిపించవు. మాటలు కూడా సరిగా రావు. 35 ఏళ్లుగా తల్లిదండ్రుల మీదే ఆధారపడి జీవిస్తున్నాను. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్‌ కోసం ఎన్నిసార్లు జన్మభూమి సమావేశాల్లో దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదు. ఐరిస్‌ నమోదు కావడం లేదనే కారణంతో అధికారులు పింఛన్‌ మంజూరు చేయడం లేదు. మా నాన్న సూర్యనారాయణ ఐదేళ్ల క్రితం మృతి చెందారు. అమ్మమీద ఆధారపడి జీవించాల్సి వస్తోంది. మన ప్రభుత్వం వచ్చాకైనా నాకు పింఛన్‌ ఇచ్చి ఆదుకోండన్నా..’ అని సైగలు చేస్తూ తల్లి సాయంతో జననేతకు వివరించారు.   
– పట్లాడ సేరిబాబు

‘షుగర్స్‌ ఫ్యాక్టరీ’ ప్రమాదంలో గాయాల పాలైనా ఎలాంటి సహాయం అందలేదు 
అన్నా.. మేము భీమసింగిలోని బలరాంపురం కాలనీలో ఉంటున్నాము. నా భర్త శ్రీనివాసరావు భీమసింగి చక్కెర కర్మాగారంలో దినసరి కూలీగా పని చేస్తున్నాడు. 8 నెలల క్రితం ఫ్యాక్టరీలో పని చేస్తూ 50 అడుగుల ఎత్తు నుండి జారి పడిపోయారు. బలమైన గాయాలయ్యాయి. యాజమాన్యం తాత్కాలికంగా వైద్య సేవలు అందించి చేతులు దులుపుకుంది. ఇటీవల మళ్లీ ఆపరేషన్‌ చేయించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన కదల్లేని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం తరఫున కానీ, కంపెనీ తరఫున కానీ ఒక్క రూపాయి సాయం అందలేదు. కుటుంబాన్ని నెట్టుకు రావడంతో పాటు ఇద్దరు పిల్లలను చదివించుకోలేక ఇబ్బంది పడుతున్నాను. న్యాయం జరిగేలా చేయండన్నా..     
– కె.బంగారు తల్లి  

అగ్రిగోల్డ్‌ బాధితులను బాబు మోసం చేశారు 
అగ్రిగోల్డ్‌ ఏజెంట్లను, డిపాజిటర్లను చంద్రబాబు మోసం చేశారు. అగ్రిగోల్డ్‌ సంస్థ మూసివేయడంతో ఎనిమిది రాష్ట్రాల్లో 40 లక్షల మంది డిపాజిటర్లు, 220 బ్రాంచ్‌ల్లో 4 లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం 32 లక్షల మంది డిపాజిటర్లు ఉన్నట్లు తేల్చింది. దాచుకున్న డబ్బు తిరిగి రాదనే బెంగతో దాదాపు 200 మంది డిపాజిటర్లు, ఏజెంట్లు గుండెపోటుతో, అనారోగ్యంతో చనిపోయారు. అగ్రిగోల్డ్‌ అన్ని ఆస్తులను అమ్మి న్యాయం చేస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు ఆ దిశగా నిజాయితీగా వ్యవహరించడం లేదు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని జగనన్నను కోరాము. 
    – అగ్రిగోల్డ్‌ ఏజంట్లు, డిపాజిటర్లు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement