సాక్షి, మైలవరం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నాలుగో నెల 20వ తేదీ అని, దీనిని ఇంగ్లిష్‌లో ఫోర్ ట్వంటీ అంటారని, అదే రోజున ఆయన ‘420’ దీక్ష చేయబోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన పుట్టినరోజున ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కృష్ణాజిల్లా మైలవరం బహిరంగ సభలో ప్రసంగించిన వైఎస్ జగన్ చంద్రబాబు దీక్ష గురించి ప్రస్తావించారు.
ప్రత్యేక హోదా కోసం ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేసి.. నిరాహార దీక్ష చేశారని, ఆ రోజునే టీడీపీ ఎంపీలతో కూడా రాజీనామా చేయించి ఉంటే.. మొత్తం ఏపీకి చెందిన 25మంది ఎంపీలు రాజీనామా చేసి.. పార్లమెంటు నుంచి నేరుగా వెళ్లి ఏపీ భవన్‌లో నిరాహార దీక్ష చేసి ఉండి ఉంటే.. దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ జరిగేదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని వైఎస్ జగన్ అన్నారు. ఆ రోజు తన ఎంపీలతో రాజీనామాలు, నిరాహార దీక్ష చేయించని చంద్రబాబు ఈ రోజు 420 రోజున కొంగజపం చేస్తారట అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసే దీక్ష ఫోర్ ట్వంటీ దీక్ష కాదా? అని నిలదీశారు. ప్రత్యేక హోదాను చంద్రబాబే నీరుగార్చారని, వేరొకరు సీఎంగా ఉండి ఉంటే హోదా నడుచుకుంటూ వచ్చేదని అన్నారు. చంద్రబాబులాంటి వ్యక్తిని రాష్ట్రం నుంచి తరిమికొట్టి.. రాజకీయాల్లోకి నిజాయితీ, విశ్వసనీయతను తీసుకురావాలని, ఇందుకోసం మీ అందరి మద్దతు, ఆశీస్సులు కావాలని వైఎస్ జగన్ ప్రజలను కోరారు.
అందరి జీవితాల్లోనూ సంతోషం నింపుతాం
మనందరి ప్రభుత్వం రాగానే నవరత్నాలను అమల్లోకి తీసుకొస్తామని, ఈ పథకంతో అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపుతామని వైఎస్ జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. వైఎస్‌ఆర్ హయాంలో మండలానికో అంబులెన్స్ ఉండేది కానీ, ఇప్పుడు నియోజకవర్గానికి రెండు అంబులెన్స్‌లు మాత్రమే ఉన్నాయని, అంబులెన్సుల సిబ్బందికి కూడా గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని తెలిపారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఆరోగ్య శ్రీ పథకం పరిస్థితి దారుణంగా తయరైందని అన్నారు. హైదరాబాద్‌లో ఆపరేషన్ చేయించుకుంటే ఆరోగ్యశ్రీ వర్తించదంటూ చంద్రబాబు ప్రభుత్వం అమానుషమైన నిబంధనలు తెచ్చిందని వైఎస్ జగన్ మండిపడ్డారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. వెయ్యి బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సహా ఎక్కడైనా ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయించుకొనేవిధంగా వెసులుబాటు కల్పిస్తామని తెలిపారు. కుటుంబపెద్ద ఆపరేషన్ చేయించుకున్నాక విశ్రాంతి అవసరమైతే.. ఆ సమయంలో రోగులకు ఆర్థికసాయం చేస్తామని చెప్పారు. డయాలసిస్, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెల రూ. 10వేల పింఛన్ ఇస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment