సాక్షి, గుడివాడ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఇచ్చిన ఇంటి స్థలాలను సైతం టీడీపీ సర్కార్ వెనక్కి తీసుకుంటుందని, ఏపీ సీఎం చంద్రబాబు పాలనలో అంతా అవినీతేనంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు. కేవలం రూ.3 లక్షలు అయ్యే ప్లాట్‌ను చంద్రబాబు రూ.6 లక్షలకు అమ్ముతున్నారని.. ఇందులో రూ.3 లక్షలు పేదవాడి అప్పుగా రాసుకుంటారని తెలిపారు. మనం అధికారంలోకి వచ్చాక ఆ పేదవాడి అప్పు రూ.3 లక్షలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి పేదవాడికి ఉచితంగా ఇళ్ల కట్టించి ఇస్తామని, హౌజ్ ఫర్ ఆల్ పథకం కింద ఇల్లు ఉచితంగా కేటాయిస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 155వ రోజు పాదయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా గుడివాడ నెహ్రౌచౌక్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై నిప్పులు చెరిగారు.
దివంగత నేత వైఎస్సార్ హయాంలో పంటలకు నీరు అందేదని, కానీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో రెండో పంటకు నీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. పక్కనే కనిపిస్తున్న పులిచింతల ప్రాజెక్ట్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలోనే దాదాపు పూర్తయింది కానీ చంద్రబాబు తెలంగాణకు రూ.145 కోట్లు చెల్లించకపోవడంతో 45 టీఎంసీల నీళ్లు కోల్పోతున్నామని రైతన్నలు బాధపడుతున్నారు. రాయలసీమకెళ్తే కృష్ణాలో బంగారం పండిస్తారని చెబుతారు. ఎక్కడికి వెళ్తే అక్కడ వేరే ప్రాంతంలో తాను పలానా అభివృద్ధి చేశానంటూ గొప్పలు చెప్పుకుంటారు. వరికి మద్దతు ధర లేదు 1130 రూపాయలకు అడిగితే ఏ విధంగా అమ్ముకోవాలని, మినుములు 4200 రూపాయలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం, మినుములు రోడ్లపై పోసి తగలబెడుతున్నారన్నది నిజం కాదా చంద్రబాబును వైఎస్ జగన్ ప్రశ్నించారు.
రొయ్యలు, చేపలు వేశామని రైతులు చెబుతున్నారు. కానీ నీళ్లులేని పరిస్థితుల్లో నష్టపోతున్నాం. పంటలు, చేపలు, రొయ్యలు బతకడం లేదని, వైరస్‌ల ప్రభావం మమ్మల్ని పూర్తిగా దెబ్బతీస్తుందని అన్నారు. చేపలు రూ.110 ఉండాల్సిన ధర 80రూ. ఉందని, 450 ధర ఉండాల్సిన రొయ్యలు కేవలం 200 రూపాయల ధర ఉంటే ఎలా బతకాలని రైతులు అడుగుతున్నారు.
ఇదే గుడివాడలో వైఎస్సార్ పేదల కోసం ఇళ్లు నిర్మించి వారికోసం కాలనీ ఏర్పాటు చేశారు. వైఎస్సార్ పాలనలో ఇళ్లు చూశాం కానీ చంద్రబాబు పాలనలో ఒక్క ఇళ్లూ కట్టించి ఇవ్వలేదని పేదలు వాపోతున్నారు. టీడీపీ ప్రభుత్వంలో గిట్టుబాటు, మద్దతు ధరలు లేవు. ప్రజలు చెవుల్లో పువ్వులు పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. ప్లాట్లను తీసుకుని పేదవాడిని మోసం చేస్తున్నారు. పేదవాడి మీద అప్పులు మోసే స్కామ్ గుడివాడలో టీడీపీ చేస్తోంది. చంద్రబాబు స్కాం ఏంటంటే.. ఆయన పాలనలో అవినీతి జరగని స్థలం ఉండదు. మట్టి నుంచి ఇసుక, ఇసుక నుంచి బొగ్గు, బొగ్గు నుంచి మద్యం ఇలా అన్నింటా అక్రమాలే. గుడి భూములను వదిలిపెట్టని ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమని ఆరోపించారు.
రూ.3 లక్షలయ్యే ప్లాట్‌ను రూ.6 లక్షలకు అమ్మి రూ.3 లక్షల మోసం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1.5 లక్షలు, కేంద్రం రూ.1.5 లక్షలు ఇస్తాయట. మిగతా రూ.3 లక్షలు పేదవాడి ఖాతాలో రాసుకుంటే.. పేదవాడి జీవితాంతం ఆ బాకీలను తీరుస్తూపోవాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దగ్గర్లో ఎన్నికలున్నాయి కనుక ఇవాళ టీడీపీ వాళ్లు ప్లాట్లు ఇస్తే తీసుకోండి. మీ పేరిట ఉన్న రూ.3 లక్షల అప్పును తీరుస్తానని హామీ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన ఆ కాంట్రాక్టర్లను జైల్లో పెట్టిస్తానన్నారు.
వైఎస్ ప్రసంగంలోని మరిన్ని ముఖ్యాంశాలివే..
- బెల్టు షాపులు తీసేస్తానన్న చంద్రబాబు హామీ ఏమైంది..? చంద్రబాబు హయాంలో మినరల్ వాటర్ దొరకడం లేదు. కానీ.. ఫోన్ కొడితే ఇంటికే మద్యం వస్తుంది.
- అగ్రిగోల్డ్ బాధితులకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు. ఢిల్లీలో చంద్రబాబు చేయరాని పనులు చేశారు.
- అమర్‌సింగ్‌తో చంద్రబాబు భేటీ తర్వాత అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ తగ్గింది. ఈ విషయం మీడియాలో రాకుండా చంద్రబాబు జాగ్రత్త పడ్డారు. అగ్రగోల్డ్ ఆస్తులు కాజేయడానికి చంద్రబాబు కుట్ర పన్నారు.
- పక్క రాష్ట్రాల కంటే ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌పై రూ.7 అధికంగా వసూలు చేస్తున్నారు
- రుణమాఫీ పథకం వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. అక్కాచెల్లెమ్మల రుణాలు ఒక్క రుపాయి కూడా మాఫీ కాలేదు
- నిరుద్యోగులను సైతం చంద్రబాబు మోసం చేశారు. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2వేలు నిరుద్యోగ భృతి అన్నారు. ఇప్పటివరకూ నిరుద్యోగ భృతి కింద రావాల్సిన రూ.96 వేలు ఇవ్వాలని బాబును అడగండి
- చంద్రబాబు మోసాలకు ఉత్తమ విలన్ అవార్డు ఇవ్వొచ్చు
- ఈ నాలుగేళ్లలో 3 వేలకు పైగా అత్యాచార కేసులు నమోదయ్యాయి
- దేశ వ్యాప్తంగా ఐదుగురు మంత్రులు మహిళలపై దాడులు చేశారు. అందులో ఇద్దరు చంద్రబాబు కేబినెట్‌లోనే ఉన్నారు. అలాంటి వ్యక్తులను మంత్రులుగా కొనసాగిస్తూ కొవ్వొత్తులు పట్టుకుని నడుస్తున్నారు.
- చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ ప్రజలు క్షమించరు
- మనందరి ప్రభుత్వం రాగానే నవరత్నాలను తీసుకొస్తాం. నవరత్నాలతో అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపుతాం
- పేదవాడి కోసం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ తీసుకొస్తే దాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేవారు
- హైదరాబాద్లో ఆపరేషన్ చేయించుకుంటే ఆరోగ్యశ్రీ వర్తించదట. క్యాన్సర్ పోవాలంటే కనీసం ఆరుసార్లు కీమోథెరపీ చేయాలి.కానీ కీమోథెరపీ రెండుసార్లు మాత్రమే చేస్తారట. మరోసారి కీమోథెరపీకి వెళ్తే ఆరోగ్యశ్రీ వర్తించదని చంద్రబాబు చెబుతున్నారు.
- మనం అధికారంలోకొచ్చాక రూ.వెయ్యి బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తాం
- హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సహా ఎక్కడైనా సరే ఆపరేషన్ చేయించుకుంటే ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొస్తాం. కుటుంబ పెద్ద ఆపరేషన్ చేయించుకున్నాక విశ్రాంతి అవసరమైతే.. ఆ సమయంలో పేషెంట్‌కు ఆర్థికసాయం చేస్తాం
- డయాలసిస్, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు నెలకు రూ.10 వేల పింఛన్ ఇస్తాం
Comments
Please login to add a commentAdd a comment