ప్రభుత్వం వల్లే మృగాళ్లు తయారవుతున్నారు: వైఎస్ జగన్ | YS Jagan Mohan Reddy Slams Chandrababu Four Years Ruling | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం వల్లే మృగాళ్లు తయారవుతున్నారు: వైఎస్ జగన్

Published Sat, May 5 2018 7:26 PM | Last Updated on Thu, Jul 26 2018 7:14 PM

YS Jagan Mohan Reddy Slams Chandrababu Four Years Ruling - Sakshi

సాక్షి, పెడన: అవినీతి, అబద్ధాలు, మోసాలు.. వీటితో పాటు రోజుకో డ్రామాకు తెరతీస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాలన కొనసాగిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రే దళారిగా మారి అక్రమాలు చేస్తున్నారన్న వైఎస్ జగన్.. సినిమాలో చంద్రబాబు నటించి ఉంటే మాత్రం ప్రతి సంవత్సరం కచ్చితంగా ఉత్తమ విలన్ అనే అవార్డు ఆయన సొంతం చేసుకునేవారని ఎద్దేవా చేశారు. ప్రజాసంకల్పయాత్ర 153వ రోజు పాదయాత్రలో భాగంగా పెడనలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లడుతూ.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు, తప్పు చేసేవారిని ప్రోత్సహించినప్పుడు మనిషి మృగంగా మారతాడని.. అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలే మహిళల పట్ల వికృతంగా ప్రవర్తిస్తున్నారని ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. నాలుగేళ్లుగా మహిళలపై 281 లైంగిక దాడులు జరిగాయని, గత 4 రోజుల్లో 11 ఇలాంటి కేసులు నమోదైనా పట్టించుకోని కారణంగా మృగాళ్లుగా మారుతున్నారు. ఆయన వస్తే బాగుంటుందని టీవీల్లో ఎన్నో ప్రకటనల్లో చంద్రబాబును చూశాం. కానీ నేడు ఏమైంది. చంద్రబాబు పాలనలో అక్కాచెల్లెమ్మలను బయటకు పంపాలంటే భయమేస్తున్న పరిస్థితి ఉంది. గత నాలుగేళ్లుగా ఆత్యాచార కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయో ఆలోచించండి. 

మనిషి మృగంలా ఎప్పుడు మారతాడంటే.. ‘తాను తప్పుచేసినా తనను ఎ‍వరూ అడగరని, లేక తాను అధికారంలో ఉన్నానని భావించినప్పుడు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడతాడు. మనం అధికారంలో ఉన్నాం, ఏ తప్పు చేసినా ఏం కాదు.. మేం కాపాడతామని ప్రభుత్వాలు హామీ ఇచ్చినప్పుడు. ప్రజలచేత ఎన్నుకోబడిన పంచాయతీలను పక్కనపెట్టి జన్మభూమి కమిటీల పేరుతో ప్రభుత్వాలు అన్యాయం చేస్తునప్పుడు. మన ఇళ్లు, గుడి ఇలా ఎక్కడపడితే అక్కడ మద్యం షాపులు పెట్టి దోచుకోవడం మొదలుపెట్టినప్పుడు. వనజాక్షి లాంటి మహిళా అధికారి తన డ్యూటీని నిజాయితీగా చేస్తుంటే.. ఎమ్మెల్యే ఆ మహిళ జట్టుపట్టుకుని ఈడ్చుకువెళ్లినా.. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఆ అరాచకాన్ని అడ్డుకోనప్పుడు. రిషితేశ్వరీ లాంటి విద్యార్థిని సీనియర్ల వేధింపులు గురించి చెబితే.. ప్రిన్సిపల్ హస్తం ఉన్నా చర్యలు తీసుకోని సందర్భంలో. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని చంద్రబాబు బహిరంగంగా మాట్లాడి మహిళలను కించపరిచినప్పుడు మనుషులు మృగాళ్లుగా మారతారని’ వైఎస్ జగన్ పేర్కొన్నారు. 

నెల్లూరులో ఓ తండ్రి ఆవేదన..
ఫ్లెక్సీ పెట్టి ఓ పిల్లాడికి దండేశారు. విద్యార్థి తల్లీతండ్రి నా వద్దకొచ్చారు. బాధపడుతూ ఏడ్చారు. బాబూ.. ఈ పిల్లాడు నా కొడుకు. చనిపోయాడని దండేశాను. ఎందుకో తెలుసా. నిరుటి సంవత్సరం ఇంజినీరింగ్ చేర్పించేరోజు నా కొడుకు నన్ను అడిగాడు. నాన్న నీకు స్థోమత ఉందా అని అడిగాడు. ఎంతగానో నమ్మిన ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు రాకపోవడంతో మేం ఫీజులు కట్టలేకపోయాం. చదువుకోలేక పోతున్నానన్న బాధ, ఆవేదనతో నా కొడుకు తనువు చాలించాడంటూ ఆ పెద్దాయన చెప్పిన విషయాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

బాలగంగాధర్ తిలక్ మాటలు గుర్తుచేస్తూ.. గజానికొక్క గాంధారీ పుత్రుడు ఈ దేశంలో అన్నట్లుగా.. ఏపీలో అలాంటి పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందన్నారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, మోసాలు జరుగుతున్నాయి. రుణమాఫీ పేరుతో రైతులు, అక్కాచెల్లెమ్మలను మోసం చేయడం తప్ప చంద్రబాబు సాధించిందేమీ లేదు. నిరుద్యోగ భృతి పేరుతో విద్యార్థులను సైతం మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. ఎన్నికల మేనిఫెస్టో పేరుతో ప్రతి వర్గాన్ని, ప్రతి కులాన్ని మోసం చేశారు. 

4 కత్తెర్లు.. 4 ఇస్త్రీ పెట్టెలు
చంద్రబాబు పాలనలో బీసీలకు ఎప్పుడూ అన్యాయమే జరుగుతుంది. 4 కత్తెర్లు.. 4 ఇస్త్రీపెట్టెలు ఇవ్వడమే ఆయన దృష్టిలో బీసీలకు చేసిన సాయం. ఫీజు రీయింబర్స్ చేయకపోవడంతో విద్యార్థులు ఫీజులు కట్టలేక మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నాశనం చేశారు. పైన ఆయన చంద్రబాబు... కింద జన్మభూమి కమిటీలు ఉంటాయి. మట్టి నుంచి ఇసుక, ఇసుక నుంచి బొగ్గు, బొగ్గు నుంచి మద్యందాకా, మద్యం నుంచి రాష్ట్రం మొత్తాన్ని చంద్రబాబు దోచేస్తున్నారు. మరోవైపు కిందిస్థాయిలో జన్మభూమి కమిటీలు అన్యాయం, అక్రమాలకు పాల్పడుతున్నది నిజం కాదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.

వైఎస్ జగన్ ప్రసంగంలోని మరిన్ని అంశాలివే..

  • స్థానికులు చెప్పిన విషయాన్ని గమనిస్తే ఓ సామెత గుర్తొస్తుంది. అమ్మకు అన్నం పెట్టనివాడు చిన్నమ్మకు మాత్రం బంగారు గాజులు కొనిస్తాడన్నాడట.. అలా ఉంది చంద్రబాబు పాలన. 
  • కృష్ణా పరివాహక ప్రాంతం వారికే నీళ్లివ్వని చంద్రబాబు.. రాయలసీమను కూడా తాను సస్యశ్యామలం చేశానని గొప్పలు చెప్పుకుంటాడు. 
  • దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో రెండు పంటలకు నీళ్లిచ్చేవారు. కానీ చంద్రబాబు తీరు అర్థం కావడం లేదని ప్రజలు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. పట్టిసీమ, పోలవరం అంటారు. కానీ ప్రాజెక్టు పనులు పూర్తిచేయరు. 
  • పులిచింతల ప్రాజెక్టు వైఎస్సార్‌ హయాంలో దాదాపు పూర్తయింది. కానీ తెలంగాణకు రూ.145 కోట్లు ఇవ్వని కారణంగా నీళ్లు వాడుకోకపోవడంతో వృథా అవుతున్నాయి.
  • మత్స్యకారులు రోదనను పట్టించుకోలేదు. కేజీ చేపలు రూ.110 నుంచి రూ.80కి, రొయ్యలు రూ.400 నుంచి రూ.200కు పడిపోతే ఎలా బతకాలని రైతన్నలు అడిగితే చంద్రబాబు నోట్లోంచి మాట రాదు. కానీ చంద్రబాబు మాత్రం.. వ్యవసాయ రంగం 14 శాతం వృద్ధి చెందిందని ప్రకటనలు చేస్తున్నారు.
  • పెడనలో 3, 4 రోజులకు ఓసారి నీళ్లిస్తున్నారు. సమ్మర్ స్టోరేజ్‌ కట్టాలని ప్రజలు అడిగినా చంద్రబాబు పట్టించుకోలేదు
  • పెడనలో తాగునీటి కోసం వాటర్ క్యాన్లు 40, 50 రూపాయలకు కొనాల్సి వస్తోంది.
  • వైఎస్సార్ హయాంలో 8 కాలనీలు కట్టించి, 2500 ఇళ్లు నిర్మించి ఇచ్చారు. కానీ నాలుగేళ్ల చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క ఇళ్లు కూడా రాలేదు.
  • చేనేతలు, మత్స్యకారులు ఇక్కడ ఎక్కువ. వీరికి ఎన్నికల్లో 25 హామీలిచ్చారు. తక్కువ వడ్డీకే రుణాలు రాలేదు, చేనేత కార్మికుల రుణాలు మాఫీ కాలేదు. చంద్రబాబు సీఎం అయ్యాక మాకు సబ్సిడీ కూడా రావడం లేదు.
  • జ్వరమొస్తే పస్తులుండాల్సిన పరిస్థితి మాది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
  • ఫిషింగ్ హాలిడే పేరుతో ఏప్రిల్ 15- జూన్ 15 మధ్య కాలంలో రెండు నెలలు సముద్రంలోకి పోనివ్వరట. కేవలం 4 వేల రూపాయలు ఇస్తే ఎలా బతకాలన్నా అని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. ఆ నగదు కూడా చంద్రన్న భీమా పేరుతో ఎన్నో కష్టాల తర్వాత మాకు అందుతుంది. మేం అధికారంలోకొస్తే రూ.10 వేలు అందిస్తాం. సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు దురదృష్టవశాత్తూ మరణిస్తే రూ.10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేసి ఆదుకుంటాం
  • చిన్న చిన్న అబద్ధాలు ప్రజలు నమ్మరని ఈ సారి ఎన్నికల్లో ఏకంగా కేజీ బంగారం, బీఎండబ్ల్యూ ఇస్తానని చంద్రబాబు చెబుతారు. మీరు మళ్లీ మోసాపోవద్దు
  • ఇవాళ ఇంజినీరింగ్ చదవాలంటే ఫీజు రూ.లక్ష దాటుతోంది. కానీ ప్రభుత్వం తరఫున వచ్చేది కేవలం రూ.30 వేలు మాత్రమే. మేం అధికారంలోకొస్తే ఎంత ఖర్చయినా ఉచితంగా చదువు అందిస్తాం.
  • తమ పిల్లల్ని బడికి పంపించే తల్లికి రూ.15 వేలు ఇస్తాం. చదువుకునేటప్పుడు పిల్లలు హాస్టల్‌లో ఉంటే.. మెస్ ఛార్జీల కోసం ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం ఎందుకంటే చదువుకుంటే మంచి ఉద్యోగాలు వచ్చి, పేదరికం పోతోంది. 2011 లెక్కల ప్రకారం 33 శాతం మందికి చదువు రాదు.
  • ఎన్నికల్లో ఓటు కోసం అధికార పార్టీ వాళ్లు రూ.3 వేలు డబ్బిస్తే రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బు మన జేబుల్లోంచి దోచిన డబ్బు. కానీ ఓటేసేటప్పుడు మనస్సాక్షిని నమ్మి ఓటేయండి. విశ్వసనీయత, విలువలు లేని నేతలను బంగాళాఖాతంలో కలపాలి. మీ అందరి దీవెనలు నాకు తోడుంటే.. దేవుడు ఆశీర్వదిస్తే ప్రజల ప్రభుత్వం వస్తుంది. ఇప్పటికే ప్రకటించిన నవరత్నాల ప్రకారం పాలన అందిస్తాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement