కాపులకు రూ.10 వేల కోట్లు | Ys jagan praja sanklapa yatra in east godavari district | Sakshi
Sakshi News home page

కాపులకు రూ.10 వేల కోట్లు

Published Wed, Aug 1 2018 3:23 AM | Last Updated on Wed, Aug 1 2018 9:17 AM

Ys jagan praja sanklapa yatra in east godavari district - Sakshi

మంగళవారం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జరిగిన బహిరంగ సభకు భారీగా వెల్లువెత్తిన జనసందోహంలో ఓ భాగం. (ఇన్‌సెట్‌లో) ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

చంద్రబాబులా గాలి మాటలు నేను చెప్పలేనని చెప్పడం మోసమా.. అని ఎల్లో మీడియాను, చంద్రబాబుని, చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలని ఆరాట పడుతున్న పెద్ద నేతలను అడుగుతున్నాను. ఇదే బాబు కాపులకు అయిదేళ్లలో రూ.5 వేల కోట్లు ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పి ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం రూ.1,340 కోట్లే. ఇది మోసం కాదా? ఈ పెద్దమనిషి ఇలా మోసం చేస్తే, నేను.. జగన్‌ అనే నేను.. అధికారంలోకి రాగానే రూ.5 వేల కోట్లను రూ.10 వేల కోట్లకు పెంచుతానని చెప్పడం మోసమా? 

మధ్యాహ్న భోజన పథకానికి 5 నెలలుగా సరుకుల బిల్లులు, సిబ్బంది జీతాలు ఇవ్వడం లేదు. ఇలాగైతే వారు భోజనం ఎలా పెడతారు? విద్యార్థులు ఏమి తింటారు? ఈ పథకంలో పని చేస్తున్న 85 వేల మంది అక్కచెల్లెమ్మలకు ఇచ్చేది నెలకు ముష్టి వేసినట్లు రూ.5 వేలు. అదీ 5 నెలలుగా పెండింగ్‌. ఇప్పడు వీరిని తీసేసి మ««ధ్యాహ్న భోజన పథకాన్ని ప్రయివేటు సంస్థలకు ఇవ్వబోతున్నాడు. ఎన్నికలకు ముందు బాబు వస్తే జాబు వస్తుందనుకున్నారు. ఈరోజు ఈ చిన్నపాటి ఉపాధిని ఎప్పుడు ఊడగొడతాడో అన్న ఆందోళనతో ఈ 85 వేల మంది ఉన్నారు. విశాఖలో వారు తమ బాధను చెప్పుకుందామని వెళ్తే దుర్భాషలాడుతూ దౌర్జన్యం చేశారు.  

మీరంతా ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు మీకు హీరో నచ్చుతాడా.. విలన్‌ నచ్చుతాడా? హీరో నచ్చుతాడు అన్నప్పుడు ఆ హీరో మీకు ఎందుకు నచ్చుతారు? కారణం.. హీరో అబద్ధాలు ఆడడు. మోసం చేయడు. హీరో హీరోగా ఉండి తొలుత కష్టాలు పడ్డా.. తుదకు అతనిదే పైచేయి అవుతుంది కాబట్టి నచ్చుతాడు. హీరోకు విలన్‌కు తేడా అది. అలాగే జగన్‌ అనే వ్యక్తి మోసం చేయడు, అబద్ధాలు చెప్పడు. చేయలేనివి చేస్తానని జగన్‌ నోట్లో నుంచి రాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను.        – వైఎస్‌ జగన్‌

 ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  చంద్రబాబు కాపులకు ఏటా రూ.వెయ్యి కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారని, తాము అధికారంలోకి రాగానే ఏటా రూ.2 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఇస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. మాట తప్పడం, మడమ తిప్పడం (యూటర్న్‌) తమ ఇంటా వంటా లేదని స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్లపై తన మాటల్ని దారుణంగా వక్రీకరించారని, కాపులకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. మోసం చేసే వాడే ఎదుటి వాడిపై నేరం మోపినట్టుగా చంద్రబాబు తీరు ఉందని మండిపడ్డారు.

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం 225వ రోజు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాపు రిజర్వేషన్లపై తన మాటల్ని వక్రీకరించిన చంద్రబాబును, ఆయనకు తాబేదార్లుగా వ్యవహరిస్తున్న ఎల్లో మీడియాను, టీడీపీకి మద్దతు పలకాలని ఉవ్విళ్లూరుతున్న కొందరు పెద్దల్ని ఏకిపారేశారు. పిఠాపురం ఎమ్మెల్యే అరాచకాలు మొదలు జన్మభూమి కమిటీల దురాగతాల వరకు ఆయన ప్రతి అంశాన్నీ తనదైన శైలిలో వివరిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

నా మాటల్ని వక్రీకరిస్తారా?
నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు అడుగడుగునా మోసాలు చేశాడు. అబద్ధాలాడాడు. ప్రతి రోజూ ఒక డ్రామా, సినిమా చూపిస్తాడు. ‘ఎన్నికలకు ఆరునెలల ముందు.. నాలుగు నెలల కోసం’ అంటూ రోజుకొక సినిమా చూపిస్తాడు. ఈనాడు పేపర్‌ చూస్తే చంద్రబాబు కొత్త డ్రామా కనిపిస్తుంది. ఈరోజు పొద్దున్నే ఈనాడు పేపర్‌ చూశా. ఈనాడంటే చంద్రబాబు పేపరే.. అది ఆయన పాంప్లెట్‌ పేపర్‌. ఈనాడులో కనిపించిందేమిటో తెలుసా? చంద్రబాబు కాపుల రిజర్వేషన్‌ కోసం కేంద్రంతో గొడవ పడండని తన ఎంపీలకు చెప్పాడంట. నిజంగా ఈ డ్రామాలు చూస్తే ఆశ్చర్యం అనిపించింది. రెండు మూడు రోజులుగా మీరంతా చూస్తూనే ఉన్నారు.

మొన్న జగ్గంపేటలో నేను మాట్లాడా.. ఆక్కడ నేను మాట్లాడిన మాటల్ని ఎంత దారుణంగా వక్రీకరించారో చూశాం. ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు.. ఇతని పార్టీకి మద్దతు పలకాలని ఆరాట పడుతున్న కొందరు పెద్దలు, వారికి బాకా ఊదుతున్న చంద్రబాబు ఎల్లో మీడియా పేపర్లు, టీవీలు చూసినప్పుడు, హేయమైన, స్వార్థపూరిత రాజకీయాలు చూసినప్పుడు   రాజకీయాలు ఈ స్థాయికి కూడా దిగజారిపోగలుగుతాయా? అనిపించింది. నిజంగా నాకే రాజకీయాలంటే ‘ఛ’ అని అనిపించే పరిస్థితిలోకి ఈ రాజకీయాలు దిగజారాయి. నిజంగా ఒక మోసగాడు తానే మోసం చేసి.. ఆ నేరాన్ని ఎదుటి వారి మీద మోపుతూ.. మోసం చేసిన వాడే మోసం మోసం అని నిందమోపేలా రాజకీయాలు ఉన్నాయి.  

పిల్లల చదువులు పెనుభారం
చంద్రబాబు హయాంలో పిల్లలను బడికి పంపిస్తే ఒక యావరేజ్‌ స్కూలుకు కూడా అక్షరాలా రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు ఫీజు అవుతోంది. ఆ ఫీజులు కూడా ప్రతి ఏటా రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు పెరుగుతూనే ఉన్నాయి. ఇంటర్మీడియెట్‌ చదివించాలంటే భయపడే పరిస్థితి. ఫీజు రూ.65 వేలకు పెరిగిపోయింది. చివరకు తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకొంటూ అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు.. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలను నిర్వీర్యం చేస్తున్నారు.

ప్రభుత్వ స్కూళ్లకు ఏప్రిల్‌లో పాఠ్య పుస్తకాలు ఇవ్వాలి. ఆగస్టు వస్తున్నా ఇంతవరకు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మొదటి క్వార్టర్‌ పరీక్షలు ప్రారంభం కావాలి. కానీ ఇప్పటి వరకు పుస్తకాలు ఇవ్వలేదు. పిల్లలు ప్రభుత్వ స్కూళ్లకు కాకుండా ప్రయివేటు స్కూళ్లు నారాయణ, చైతన్యలకు వెళ్లేలా చేస్తున్నారు.. ఆ స్కూళ్లు చంద్రబాబు బినామీ. అందుకే రేషనలైజేషన్‌ పేరిట దగ్గరుండి ప్రభుత్వ స్కూళ్లను మూసి వేయిస్తున్నారు. స్కూళ్లకు నాసిరకం యూనిఫాం కూడా ఇవ్వని పరిస్థితి. ప్రభుత్వ స్కూళ్లలో 20 వేల ఖాళీ టీచర్‌ పోస్టులు భర్తీ చేయడం లేదు.  

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక అవస్థలు  
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని చంద్రబాబు నీరుగార్చారు. ఇక్కడే ఉన్న సూరంపాలెంలోని ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థి వికాస్‌ ఉదయం నా వద్దకు వచ్చాడు. ఆ కాలేజీలో ఫీజు రూ.95 వేలట. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.30 వేలు, రూ.35 వేలు ఇస్తున్నారు. గత ఏడాది ఫీజులు ఇంతవరకు ఇవ్వలేదు. మిగిలిన రూ.65 వేలు తల్లిదండ్రులు కట్టలేరని విద్యార్థి రుణం తీసుకున్నాడు. రూ.1.80 లక్షలు రుణం తీసుకున్నానని చెప్పాడు. వడ్డీ కింద విద్యార్థి తండ్రి నెల నెలా రూ.2500 కడుతున్నాడు.

ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈ రుణం తీçర్చుకోవడానికి మిగిలిన ఆస్తులు అమ్ముకోవలసి వస్తుందని ఆ విద్యార్థి నాతో వాపోయాడు. ఆరోగ్యశ్రీ నాలుగేళ్లలో పడకేసింది. చిన్న చిన్న రోగాల నుంచి పెద్ద రోగాల వరకు వైద్యం అందే పరిస్థితి లేక పేదలు అప్పులు పాలయ్యే పరిస్థితి తీసుకువచ్చాడు.  108కు ఫోన్‌ చేస్తే వస్తుందన్న నమ్మకం లేదు. డీజిల్‌ లేదని, మూడు నెలలుగా డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేదని చెబుతున్నారు. ఇళ్లు లేవు. ఇళ్ల స్థలాలు లేవు. రేషన్‌షాపుల్లో బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదు. మినరల్‌ వాటర్‌ కనిపించకపోయినా మందు షాపులు లేని గ్రామాలు లేవు. పెన్షన్, రేషన్, మరుగుదొడ్లు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఏది ఇవ్వాలన్నా జన్మభూమి కమిటీల మాఫియాకు లంచం లేనిదే పని జరగడం లేదు. 
 
ఎమ్మెల్యే కన్నీళ్లు పెట్టిస్తున్నారని చెబుతున్నారు..
ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో తిరుగుతుంటే ఇక్కడి ప్రజలు నాతో అన్న మాటలు.. అన్నా.. నాలుగున్నరేళ్ల టీడీపీ ప్రభుత్వం మాకు మంచి చేయక పోయినా ఫర్వాలేదు. హాని చేయకపోతే అదే చాలు అంటున్నారు. అన్నా.. ఇక్కడి ఎమ్మెల్యే మా వద్దకు వచ్చి కన్నీళ్లు పెట్టుకొని, ఆ ఫొటోలను.. ఫ్లెక్సీలుగా చేసి ఊరూరా పెట్టి ఓట్లు వేయించుకున్నారన్నా.. ఇçప్పుడు నాలుగేళ్లుగా ఆ ఎమ్మెల్యే మాతో కన్నీళ్లు పెట్టిస్తున్నారన్నా.. అని చెబుతున్నారు. అన్నా.. నీరు–చెట్టు పథకం కింద కుమారపురం, తమ్మాయి చెరువు, రాయవరం, రాపర్తి, కడవలడిదొడ్డి తదితర గ్రామాల్లో దాదాపు 25 చెరువులను తవ్వేశారు.

ఏ చెరువు చూసినా తాటిచెట్టంత లోతు తవ్వారని చెబుతున్నారు. చెరువులు తవ్వినందుకు బిల్లులు తీసుకోవడమే కాక, మట్టిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని చెప్పారు. ఈ నియోజకవర్గంలోనే రూ.100 కోట్లు దోచేశారని చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఎవరైనా అధికారి బదిలీ కావాలంటే అంతో ఇంతో లంచాలు ఇవ్వాల్సిందేనట. చివరికి ఇక్కడి ఎమ్మెల్యే వేధింపులు భరించలేక ఎంపీడీవో గుండెపోటుతో చనిపోయారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో దౌర్జన్యాలు ఏస్థాయిలో ఉన్నాయంటే.. పిఠాపురం పట్టణంలో శ్రీపాద వల్లభస్వామికి చెందిన రూ.100 కోట్ల విలువైన ఆస్తులను స్థానిక ఎమ్మెల్యే కొట్టేసేందుకు చేయని ప్రయత్నం లేదని చెబుతున్నారు.

ఏరియా ఆసుపత్రిలో చిన్న పిల్లలకు భవనం కట్టాలని ట్రస్ట్‌ ప్రయత్నం చేస్తే.. ఆ పనులు దక్కలేదని ఇక్కడి ఎమ్మెల్యే ఆ భవనం పనులను అడ్డుకుంటున్నారని చెబుతున్నారు. ఈ ప్రాంతంలోని వివిధ నియోజకవర్గాలకు ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణ చాలా అవసరం. అటువంటి పనులను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూ.138 కోట్లతో మొదలుపెట్టారు. ఆ మహానేత చనిపోవడంతో ఆ పనులు 40 శాతం కూడా పూర్తి కాలేదు. నిజంగా రైతులపై ఈ పాలకులకు ఎంత చిన్నచూపు ఉందో చెప్పడానికి ఇదే సాక్ష్యం. ధవళేశ్వరం నుంచి తొండంగి వరకు ఉన్న పిఠాపురం బ్రాంచ్‌ కెనాల్‌ కింద 47 వేల ఎకరాలకు నీరు అందించేలా కెనాల్‌ అభివృద్ధికి వైఎస్సార్‌ రూ.25 కోట్లు కేటాయించినా పనులు సాగడం లేదు.

సెజ్‌ భూములు ఎందుకు ఇవ్వలేదు బాబూ?
కాకినాడ సెజ్‌ (ఎస్‌ఈజెడ్‌) భూ నిర్వాసితులు నా వద్దకు వచ్చారు. అన్నా.. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఒక మాట మాట్లాడతారు. పనయ్యాక మరో మాట మాట్లాడుతున్నారన్నా అని చెప్పారు.  ఆ రోజు కాకినాడ ఎస్‌ఈజెడ్‌ భూములు తిరిగి ఇప్పిస్తానని చంద్రబాబు ఏరువాక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు చెప్పారన్నా.. కానీ ఇంతవరకు ఇవ్వలేదన్నా.. కాకినాడ ఎస్‌ఈజెడ్‌ భూములు జగన్‌కు సంబంధించినవని ఆ రోజు ఏరువాక కార్యక్రమంలో చంద్రబాబు ఆరోపించారు. రైతుల అవస్థలు చూసి నేనే సవాల్‌ చేశాను. అయ్యా చంద్రబాబూ.. ఆ భూములను రైతులకు తిరిగి ఇవ్వండని చెబితే ఇంతవరకు ఎందుకు ఇవ్వడం లేదు? చంద్రబాబు సీఎం అయ్యాక రైతులు తమ భూముల కోసం ఆందోళన చేస్తుంటే తిరిగి వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించే పరిస్థితి ఏర్పడింది.

ఏ విషయంపైన అయినా ఇతరులపై బురద వేయడం, భ్రష్టు పట్టించడం చంద్రబాబు నైజం. యూ.కొత్తపల్లి మండలంలోని అమీనాబాద్‌ సమీపంలో ఉప్పుటేరు వద్ద షిప్పింగ్‌ హార్బర్‌ నిర్మిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అది వచ్చిందా? ఎన్నికలు అయిపోయాక మోసం చేశారు. చంద్రబాబు ఊరికి పది ఇళ్లు కూడా కట్టించలేదు. ఎక్కడా పేదవారికి సెంట్‌ స్థలం ఇవ్వడం లేదని, మహానేత ఇచ్చిన ఇళ్ల స్థలాలను లాక్కుంటున్నారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. నాన్నగారి హయాంలో ఇదే నియోజకవర్గంలో 15 వేల ఇళ్లు కట్టించారని చెబుతుంటే నిజంగా సంతోషమనిపించింది.

ఇళ్ల స్థలాల కోసం పిఠాపురం నియోజకవర్గంలో పేదలకు దాదాపుగా 93 ఎకరాల స్థలాలు పంపిణీ చేస్తే నాన్నగారు చనిపోయాక ఆ స్థలాలను ఈ ప్రభుత్వం అన్యాయంగా లాక్కుంటుంటే వైఎస్సార్‌సీపీ తోడుగా నిలబడిందని చెబుతున్నారు. ఈ నియోజకవర్గం ఉప్పాడ చీరలకు, చేనేత చీరలకు ప్రఖ్యాతి గాంచింది. ఒక్క చీర నేయడానికి మూడు రోజులు పడుతుంది. గతంలో ఒక్క చీరకు రూ.1500 వచ్చేదని, ఇప్పుడు రూ.1000 కూడా రావడం లేదని చెబుతున్నారు. సంఘాల ద్వారా ఆర్డర్లు రావడం లేదని చేనేతలు వాపోతున్నారు. ఉన్న సబ్సిడీలు కూడా ఊడబెరకారని చెబుతున్నారు. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో చేనేత రంగం ఉంది’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.  

మోసం చేసింది ఎవరు బాబూ?
ఎవరు మోసం చేశారని చంద్రబాబును నిలదీసి అడుగుతున్నా.. ఎవరయ్యా మోసం చేసింది? ఎవరు మోసం చేశారో కాపు సామాజిక వర్గంలోని ప్రతి సోదరుడికి తెలుసు. ఎన్నికలకు ముందు మోసం చేసింది నీవు కాదా? ఎన్నికలకు ముందు ఫలానాది చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక చేయకపోవడాన్ని మోసం అంటారా? కాదా? చంద్రబాబు మోసం ఏ స్థాయిలో ఉందనడానికి నిదర్శనమే నిన్న జరిగిన ఘటన. జాట్లు, పటేళ్లు, గుజ్జర్లు.. ఇలాంటి వారంతా ఆయా రాష్ట్రాల్లో కులాల రిజర్వేషన్లు కావాలని అడుతున్నారు. మన రాష్ట్రంలో కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నా సోదరులు అదే డిమాండ్‌ చేస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్నది సుప్రీంకోర్టు జడ్జిమెంటు. ఇది మన అందరికీ కనిపిస్తున్న చిక్కుముడి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ డిమాండ్లపై దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చూపని పరిస్థితి కళ్ల ముందు ఉంది. దశాబ్దాలుగా పరిష్కారం రాని ఇలాంటి జఠిలమైన సమస్య మీద చంద్రబాబు తాను చేసేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం మోసం కాదా? మీ అందరి సమక్షంలో ఇదే పెద్దమనిషి చంద్రబాబును అడుగుతున్నా.

అయ్యా.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక రాష్ట్రంలో రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని తెలిసీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి  అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోగా రిజర్వేషన్లు కల్పిసానని చెప్పడం మోసం కాదా? ఆ మాటను నిలబెట్టుకోవాలన్న కాపులను అణచివేసేందుకు వారిని వేధిస్తున్నప్పుడు వారికి తోడుగా నేనున్నానని అన్న జగన్‌ మోసగాడా? కాపుల ఉద్యమాన్ని తీవ్రతరం చేసేంత వరకు చంద్రబాబునాయుడుకు కమిషన్‌ వేయాలి అన్న ఆలోచన కూడా రాలేదు.

కాపుల ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తున్నప్పుడు హడావుడిగా  కమిషన్‌ వేశాడు. ఆ కమిషన్‌ పరిస్థితి ఏమిటో తెలుసా? కమిషన్‌ చైర్మన్‌ సంతకం లేకుండానే నివేదికను అసెంబ్లీలో పెట్టి తూతూమంత్రంగా తీర్మానించి కేంద్రానికి పంపడం మోసం కాదా? ఇదే చంద్రబాబు  కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీతో నాలుగున్నరేళ్లు అధికారం పంచుకుని సంసారం చేశారు. ఇద్దరూ చిలకా గోరింకల్లా కాపురం చేశారు. సంసారం చేసినప్పుడు ఇదే చంద్రబాబునాయుడు చెప్పిన మాట.. మేనిఫెస్టోలో పెట్టిన మాట.. నిలబెట్టుకోకపోవడం మోసం కాదా? మేము అధికారంలోకి రాగానే కాపులకు రూ.10 వేల కోట్లు ఇస్తామని చెబుతున్నా.

ఈ పెద్దమనిషిని క్షమించొద్దు..
చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు. చేసేవన్నీ మోసాలు. పొరపాటున ఇలాంటి వ్యక్తులను క్షమిస్తే రేప్పొద్దున ఏం జరుగుతుందో తెలుసా? ఈ పెద్దమనిషి చంద్రబాబు మీ అందరి దగ్గరకు వచ్చి మీచెవుల్లో పువ్వు ఉందా.. లేదా? అని చూస్తాడు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల్లో 98 శాతం పూర్తి చేసేశానని మీ చెవుల్లో కాలిఫ్లవర్‌ పెడతాడు. అది మీరు నమ్మరని ప్రతి ఇంటికి కేజీ బంగారం, బోనస్‌గా బెంజి కారు ఇస్తానంటాడు. అదీ నమ్మరని ప్రతి ఇంటికి మహిళా సాధికార మిత్రలను పంపిస్తాడు. ప్రతి చేతిలోనూ రూ.3 వేలు పెడతాడు. రూ.5 వేలు ఇవ్వాలని అడగండి. ఆ సొమ్మంతా మనదే. మన జేబుల్లో నుంచి దోచేసిన సొమ్మే. కానీ మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి.

మనందరి ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కరిలో ఆనందం చూడాలని నవరత్నాలు ప్రకటించాం. అందులో భాగంగా పేద పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వానిదే. నెల్లూరులో గోపాల్‌ అనే వ్యక్తి వచ్చి తన పరిస్థితి వినిపించినప్పుడు కడుపు తరుక్కుపోయింది. తన తండ్రి ఫీజు కట్టలేడేమోనని ఇంజినీరింగ్‌ చదివే ఆయన కుమారుడు ఉరి వేసుకున్నాడు. అందుకే మన ప్రభుత్వం రాగానే ఇంజనీరింగ్, డాక్టర్‌.. ఇంకా ఏం చదివిస్తారో మీ ఇష్టం. నేను చదివిస్తా. అంతేకాకుండా విద్యార్థుల హాస్టల్‌ ఖర్చు కోసం ఏటా రూ.20 వేలు ఇస్తాను. పెద్ద చదువులకు పునాది చిన్నప్పుడే పడాలి. అందుకే పిల్లలను బడికి పంపే తల్లులకు ఏటా రూ.15 వేలు ఇస్తాం.   


మా వైఖరి ఎప్పుడూ ఒక్కటే
నా మాటల్ని వక్రీకరిస్తున్న ఈ పెద్దలందరికీ చెబుతున్నా.. యూటర్న్‌ తీసుకునే అలవాటు మా ఇంటా వంటా లేదు. కాపుల రిజర్వేషన్ల విషయంలో మా వైఖరి ఎప్పుడూ ఒక్కటే. బీసీలకు అన్యాయం జరగకుండా, బీసీల హక్కులను కాపాడుతూ కాపుల రిజర్వేషన్లకు మద్దతు అని చెబుతూనే ఉన్నాం. ఈ విషయంలో చిత్తశుద్ధితో మీరు సలహాలు ఇస్తే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీసుకుంటుందని మరోసారి ఉద్ఘాటిస్తున్నా. ఇలాంటి దారుణ మోసాలు, అబద్ధాలు చూస్తున్నాం. దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని తెలిసీ కూడా ఎన్నికలప్పడు చేస్తామని చెప్పడం మోసం కాదా అని ప్రశ్నిస్తే.. ఆ మోసం బాబు చేసింది కాక, ఎల్లో మీడియా ఉందని.. తనకు మద్దతు పలికేవారు ఉన్నారని.. జగన్‌ మోసం చేస్తున్నాడని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం రాజకీయం అంటారా? ఛ.. ఇవి రాజకీయాలంటారా? అని అడుగుతున్నా. ఇవాళ మీ అందరికీ చెబుతున్నా.

ఇంతకు ముందు చెప్పిన అన్ని విషయాలతో పాటు చంద్రబాబు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఒక్కో కులానికి ఒక్కో పేజీ  కేటాయించాడు. మత్స్యకారులను ఎస్టీలుగా చేస్తానన్నాడు. మత్స్యకారులు వెళ్లి గట్టిగా నిలదీస్తే మీ తాట తీస్తానని బెదిరించిన పరిస్థితులు చూశాం. రజకులు, కురుమలను ఎస్సీల్లో, బోయలను ఎస్టీల్లో  చేరుస్తానన్నాడు. ప్రతి కులాన్ని, మతాన్ని వదిలి పెట్టకుండా ప్రతి ఒక్కరినీ మోసం చేసిన చరిత్ర ఈ పెద్ద మనిషి చంద్రబాబుది. ఈరోజు కులాల రిజర్వేషన్లకు సంబంధించి.. కొన్ని నా చేతుల్లో ఉంటాయి. కొన్ని నా చేతుల్లో లేని అంశాలు ఉంటాయి.

కులాలకు సంబంధించి ప్రతి విషయంలోనూ నేను చెప్పగలిగింది ఏమిటంటే.. వాటి విషయంలో ప్రయత్నం చేయగలుగుతామని చెబుతాం కానీ అంతకన్నా సాధిస్తాం, తీసుకువస్తామని ఎవరైనా చెబితే దయచేసి నమ్మవద్దని పిలుపునిస్తున్నా. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ రావాలి. నిజం చెప్పేవాడు, న్యాయంగా ఉన్నవాడే ఎప్పుడైనా రాజకీయాల్లో పైకి వస్తాడు.. వారినే ప్రజలు, దేవుడు దీవిస్తాడనే సంకేతం కచ్చితంగా ప్రజల్లోకి పోవాలని కోరుతున్నాను. పొరపాటున ఇలాంటి రాజకీయ వ్యవస్థలో మార్పు రాకపోతే మన పిల్లలు ఈ రాజకీయాలు చూస్తే ఛ... వీరా మన రాజకీయనాయకులు.. అని అనుకొనే çపరిస్థితి వస్తుందని మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఈ వ్యవస్థ మారాలి అంటే జగన్‌ ఒక్కరి వల్లే సాధ్యమయ్యేది కాదు. మీ అందరి తోడు కావాలి. మీ దీవెనలు కావాలి. అబ»ద్ధాలు చెప్పేవారిని, మోసం చేసే వారిని పొరపాటున కూడా క్షమించొద్దని కోరుతున్నాను. 

సరుకులు ఎక్కడి నుంచి తేవాలయ్యా?
మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు వండిపెట్టడం భారంగా మారిందయ్యా.. ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. బతిమాలుకుని అప్పులు చేసి సరుకులు తెచ్చి వండి పెట్టాల్సి వస్తోంది. విరవాడ జెడ్పీ పాఠశాలలో 550 మంది పిల్లలుంటే సుమారు 400 మంది మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. పదేళ్లుగా నిర్వాహకులుగా పని చేస్తున్నా మాకు మిగిలిందేమీ లేదు.  

రైతులకు సాయం అందడం లేదన్నా..
అన్నా.. సన్న, చిన్నకారు రైతులను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చెరకు, వరి, అరటి రైతులకు కనీస మద్దతు ధర కల్పించడంలో విఫలమైంది. ధాన్యం ధర ఈ ఏడాది బస్తాకు రూ.200 తగ్గింది. అరటి పంట చేతికి వచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్నా ఈ సర్కారు ఆదుకోవడం లేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే రైతులందరినీ ఆదుకోవాలి.       
– వైఎస్‌ జగన్‌తో జి.మహేశ్‌  

వ్యవసాయ పనిముట్లు కొందరికే
వ్యవసాయ పనిముట్లు, ప్రభుత్వ రాయితీలు సామాన్య రైతులకు అందడం లేదయ్యా.. పవర్‌ టిల్లర్, పురుగు మందుల స్ప్రేలు, ఛార్జింగ్‌ స్ప్రేలు కావాలని మండల వ్యవసాయాధికారులను కోరితే ఎమ్మెల్యే వద్దకు వెళ్లాలని చెబుతున్నారు. ఎమ్మెల్యే వద్దకు వెళితే జన్మభూమి కమిటీ వద్దకు పంపుతున్నారు. వారు టీడీపీకి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే సిఫార్సు చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఆదర్శ రైతుల ద్వారా అందరికీ న్యాయం జరిగేలా చూశారు. మీరు ముఖ్యమంత్రి అయితేనే న్యాయం జరుగుతుంది.  
– వైఎస్‌ జగన్‌తో పి.పద్మావతి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement