ప్రతి పథకం నేరుగా మీ ఇంటికే.. | YS Jagan Promises That Every village has a village secretariat | Sakshi
Sakshi News home page

ప్రతి పథకం నేరుగా మీ ఇంటికే..

Published Sun, Mar 24 2019 4:44 AM | Last Updated on Sun, Mar 24 2019 8:59 AM

YS Jagan Promises That Every village has a village secretariat - Sakshi

విశాఖ జిల్లా పాడేరులో జరిగిన బహిరంగ సభకు అశేష సంఖ్యలో హాజరైన జనసందోహంలో ఓ భాగం. ప్రసంగిస్తున్న వైఎస్‌ జగన్‌

శ్రీకాకుళం జిల్లా నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి/సాక్షి, విశాఖపట్నం/సాక్షి ప్రతినిధి, కాకినాడ/గొల్లప్రోలు:  ‘‘ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ ఇళ్ల మంజూరు, రేషన్‌ కార్డులు, పెన్షన్, నవరత్నాలు.. ఇలా ప్రతి ప్రభుత్వ పథకాన్ని వాలంటీర్‌ ద్వారా నేరుగా ప్రజల ఇంటికే చేరుస్తాం. ఇళ్లు, రేషన్‌కార్డులు, పెన్షన్‌ పొందాలంటే ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు. ప్రతి పథకాన్ని నేరుగా మీ ఇంటికే వచ్చి, మీ చేతుల్లోనే పెడతామని హామీ ఇస్తున్నా. ఏదైనా పథకం కోసం గ్రామ సచివాలయంలో దరఖాస్తు అందజేస్తే చాలు. కేవలం 72 గంటల్లోనే దాన్ని పరిష్కరిస్తాం. ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేస్తాం. అదే గ్రామానికి చెందిన చదువుకున్న 10 మందికి ఆ సచివాలయంలో ఉద్యోగాలు ఇస్తాం. గ్రామంలో ఉన్న ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తాం. ఈ వాలంటీర్‌ గ్రామ సచివాలయంతో అనుసంధానమై పని చేయాలి. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాల్సి ఉంటుంది’’ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం శ్రీకాకుళం జిల్లా పలాస, విశాఖ జిల్లా పాడేరు, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో బహిరంగ సభల్లో కిక్కిరిసిన జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. అభివృద్ధిలో కాదు.. అవినీతి, అక్రమాలు, మోసాలు చేయడంలోనే సీఎం చంద్రబాబు నంబర్‌ వన్‌ అని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజల జీవితాలను బాగు చేస్తామని పునరుద్ఘాటించారు. గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మూడు బహిరంగ సభల్లో జగన్‌మోహన్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..  

భూ పంపిణీ దిశగా పరుగులు పెడతాం..
పాడేరు సభలో... 
మొత్తం 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. దారి పొడవునా ప్రజల కష్టాలు విన్నాను, బాధలు చూశాను. ఎస్టీ నియోజకవర్గాల్లో ఉన్న గిరిజనుల కష్టాలను మరింత దగ్గరగా చూశా. మీ అందరికీ మాట ఇస్తున్నా.. మీకు నేనున్నాను. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పరిపాలనను మనం చూశాం. ప్రజలకు మంచి చేయాలి, చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా పనిచేయాలని ఆరాటపడే నాయకులు ఇప్పుడు కరువయ్యారు. మీరంతా నాన్నను ఆదరించారు. నాపై కూడా ఆప్యాయత చూపించారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికంటే ఎక్కువగా పేదవాడు బాగుపడుతాడని కచ్చితంగా చెబుతున్నా. ఎస్సీ, ఎస్టీలు ఎంత పేదరికంలో ఉన్నారో చెప్పాల్సిన అవసరం లేదు.  గిరిజనులకు 7 లక్షల ఎకరాల భూములను పంపిణీ చేసిన ఘనత వైఎస్‌ రాజశేఖరరెడ్డిదే. ఆయన తర్వాత వచ్చిన పాలకులు భూపంపిణీని పట్టించుకోలేదు. మన ప్రభుత్వం వచ్చాక ఆ దిశగా అడుగులు వేయడం కాదు, పరుగులు పెడతామని హామీ ఇస్తున్నా.   
మన ప్రభుత్వం వచ్చాక...  
బ్యాక్‌లాగ్‌ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయలేదు. 500 జనాభా ఉన్న గ్రామాలను పంచాయతీగా మార్చాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పరిష్కరించలేదు. ప్రతి విషయంలోనూ మనం వెనుకబడే ఉన్నాం. మన ప్రభుత్వం వచ్చాక ఈ పరిస్థితులన్నీ మారుతాయి. ‘ఇది మన అందరి ప్రభుత్వం’ అని మీరంతా అనుకునేలా గొప్ప పరిపాలన అందిస్తాం. ప్రతి ఐటీడీఏ పరిధిలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తాం. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో శంకుస్థాపన చేస్తాం. గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తాం. గిరిజన ప్రాంతాన్ని కలిపి ప్రత్యేక జిల్లా చేస్తాం. ఆ జిల్లాలో గిరిజన మెడికల్‌ కాలేజీ, గిరిజన ఇంజనీరింగ్‌ కాలేజీ, గిరిజన యూనివర్సిటీని నెలకొల్పుతామని హామీ ఇస్తున్నా. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేసిన పోరాటాల వల్లే విశాఖ మన్యంలో బాక్సైట్‌ మైనింగ్‌ ఆగిపోయింది. ఇక్కడ బాక్సైట్‌ మైనింగ్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ జరగదని గట్టిగా చెబుతున్నా.   

అవును నిజమే.. రాష్ట్రం నంబర్‌ వన్‌  
రాష్ట్రానికి ఐదేళ్లలో 650 అవార్డులు వచ్చాయని సీఎం చంద్రబాబు చెబుతున్నాడు. రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌ చేశానని అంటున్నాడు. అవును, ఆయన నిజంగానే రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌ చేశాడు. రైతుల రుణాలను మాఫీ చేయకుండా ఎగ్గొట్టడంలో రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌ చేశాడు. రుణాలు మాఫీ చేయకుండా పొదుపు సంఘాల మహిళలను మోసం చేయడంలో రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌ చేశాడు. నిరుద్యోగ యువతకు హామీలిచ్చి, చివరకు మోసం చేయడంలో రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌ చేశాడు. పిల్లలను కేజీ నుంచి పీజీ దాకా చదివిస్తానని హామీ ఇచ్చి, మోసం చేయడంలో రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌ చేశాడు. రాష్ట్రాన్ని తాగుడు ఆంధ్రప్రదేశ్‌గా చేసిన ఘనత చంద్రబాబుదే. ఆ విషయంలో చంద్రబాబుకు నంబర్‌ వన్‌ స్థానం ఇవ్వాలి. సీపీఎస్‌ను రద్దు చేయండి, పాత పెన్షన్‌ విధానం అమలు చేయండి అని ఐదేళ్లుగా పోరాడుతున్న ఉద్యోగులను గాలికి వదిలేయడంలో రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌ చేశాడు. మద్యం అమ్మకాల్లో, పెట్రోల్, డీజిల్‌ ధరలు అత్యధికంగా ఉండడంలో, రైతుల ఆత్మహత్యల్లో, కార్పొరేట్‌ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల్లో, ఫీజులు పెంచడంలో మన రాష్ట్రం ఇప్పుడు నంబర్‌ వన్‌.  మీడియాను, వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబే నంబర్‌ వన్‌.  

ఆయన పేరు దొంగల్లుడు  
మరో 20 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలాంటి పాలన కోసం ఓటు వేయాలో అందరూ గుండెలపై చేయి వేసుకుని ఆలోచించాలి. ఇటీవల మహానాయకుడు అనే సినిమా వచ్చింది. అందులో ఒక పాత్ర ఉంది. ఆయన పేరు దొంగల్లుడు. చేయనిది చేసినట్లుగా, చేసింది చేయనట్లుగా ఇప్పుడు టీవీల్లో ప్రకటనలు ఇస్తున్నాడు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన ఆ వ్యక్తి పేరు మీకు తెలుసు. ఐదేళ్ల పాలనలో మోసాలు, దుర్మార్గాలు చేశాడు. పైగా ధర్మరాజుకు ధర్మం అంటే ఏమిటో తానే నేర్పానన్నట్లుగా మాటలు చెబుతాడు. నిజాలు ఎలా చెప్పాలో హరిశ్చంద్రుడికి తానే నేర్పినట్లు బిల్డప్‌ ఇస్తాడు. ఐదేళ్లు ప్రజలను మోసం చేసి, ఇప్పుడు మీ భవిష్యత్తు నా బాధ్యత అంటున్నాడు. మీరు నమ్ముతారా? 

ఉద్దానం కిడ్నీ బాధితులకు నేనున్నా... 
పలాస సభలో... 
పలాస నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇక్కడి ప్రజల కష్టాలను, బాధలను నేను విన్నాను. మీకు నేనున్నాను అని భరోసా ఇస్తూ చెబుతున్నా. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) గురించి మనకు తెలుసు. కానీ, పలాసలో తెలుగుదేశం పన్ను(టీఎస్టీ) వసూలు చేస్తున్నారని ఇక్కడి ప్రజలు చెప్పారు. ప్రతి జీడిపప్పు ప్యాకెట్‌పై రూ.10 చొప్పున ఇక్కడి ఎమ్మెల్యే అల్లుడికి ట్యాక్స్‌ కట్టాల్సి వస్తోందని నా దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలపై వేధింపులు, దాడులను చూశా. ఉద్దానం కిడ్నీ రోగుల ఆవేదన నాకు గుర్తుంది. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు నెలల్లోగానే ఇక్కడే 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, పరిశోధనా కేంద్రం నిర్మాణానికి పునాదిరాయి వేస్తాం. రెండేళ్లలోనే ఆ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తిచేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇస్తున్నా. అత్యుత్తమమైన వైద్యులను నియమిస్తాం. కిడ్నీ వ్యాధి ప్రారంభ దశలో ఉన్నప్పుడే పరీక్షలు చేయిస్తాం, గ్రామాల్లో  ఉచితంగా మందులు సరఫరా చేస్తాం. కిడ్నీ బాధితులకు అన్ని రకాలుగా తోడుగా ఉంటాం. బాధితులకు ప్రతినెలా పెన్షన్‌ రూ.10 వేలు ఇస్తాం. కలుషిత నీటి కారణంగానే ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు సోకుతున్నాయి. అందుకే రిజర్వాయర్ల నుంచి కాలువలు తవ్వి ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేస్తాం. పంటలకు సాగునీరు అందిస్తాం.  

జాబు రావాలంటే బాబు పోవాలి  
రాష్ట్రాన్ని తాను అభివృద్ధి చేశానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిరోజూ చెప్పుకుంటున్నారు. నిన్నటికంటే ఈ రోజు మనం బాగుండడమే అభివృద్ధి. మరి నిన్నటికంటే ఈ రోజు మనం బాగున్నామో లేదో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి.  బాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలైందా? అని అడుగుతున్నా. జాబు రావాలంటే బాబు రావాలన్నాడు. ఒక్కరికైనా వచ్చిందా? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే.. జాబు రావాలి అంటే అని జగన్‌ అనగానే.. బాబు పోవాలి అంటూ జనం కేకలు వేశారు.  

ఖాళీలు 2 లక్షలకు పైగానే.. భర్తీ సున్నా  
రాష్ట్ర విభజన నాటికి ఏపీలో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమల్‌నాథన్‌ కమిటీ లెక్కలు తేల్చింది. ఈ ఐదేళ్లలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు పదవీ విరమణ చేశారు. దాంతో కలుపుకుంటే మొత్తం ఖాళీలు 2 లక్షలకు పైగానే ఉన్నాయి.  మన ప్రభుత్వం వచ్చాక ఈ ఖాళీలను భర్తీ చేసే కార్యక్రమాన్ని చేపడతాం.  
 
విప్లవాత్మక మార్పు తీసుకొస్తాం  
రాష్ట్రంలో 1.70 కోట్ల ఇళ్లు ఉన్నాయి. నిరుద్యోగ భృతి కింద ప్రతి ఇంటికీ రూ.2 వేల చొప్పున ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చాడు. చివరకు మాట తప్పాడు.  మీ అందరికీ భరోసా ఇస్తున్నా. మీకు నేనున్నాను. రేపు మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల విప్లవాన్ని సృష్టిస్తాం. మరో విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తాం. ఇక్కడ ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ పరిస్థితి పూర్తిగా మార్చేస్తాం. పరిశ్రమల్లో 75 శాతం పోస్టులను స్థానికులకే ఇవ్వాలని మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టాన్ని తీసుకొస్తాం.  

‘నామినేషన్‌’ కాంట్రాక్టుల్లో 50% బడుగులకే... 
ఇవాళ చంద్రబాబు పార్టీకి చెందిన ఎంపీలు జేసీ బ్రదర్స్, కేశినేని లాంటి వాళ్ల బస్సులను ఆర్టీసీ అద్దెకు తీసుకుని నడిపిస్తోంది. ఈ పరిస్థితిని మారుస్తాం. ప్రభుత్వం అద్దెకు తీసుకునే బస్సులు, కార్ల కాంట్రాక్టును నిరుద్యోగులకే ఇస్తాం. అంతేకాదు నిరుద్యోగులకు పెట్టుబడి కోసం సబ్సిడీలు కూడా ఇస్తాం. మరో అడుగు ముందుకేస్తున్నాం. నామినేషన్‌ కింద ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్టుల్లో 50 శాతం కాంట్రాక్టులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకే కట్టబెడతాం. ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేస్తాం. అదే గ్రామానికి చెందిన చదువుకున్న 10 మందికి ఆ సచివాలయంలో ఉద్యోగాలు ఇస్తాం. దీనివల్ల ఆ 10 మందికి సొంత గ్రామంలోనే ఉద్యోగం లభిస్తుంది. గ్రామంలో ఉన్న ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తాం. ఆ వాలంటీర్‌కు రూ.5 వేల గౌరవ వేతనం చెల్లిస్తాం. మరో ఉద్యోగం వచ్చేదాకా వాలంటీర్‌గా పనిచేయొచ్చు. ఈ వాలంటీర్‌ గ్రామ సచివాలయంతో అనుసంధానమై పని చేయాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, ఇళ్ల మంజూరు, రేషన్‌ కార్డులు, పెన్షన్, నవరత్నాలు.. ఇలా ప్రతి ప్రభుత్వ పథకాన్ని వాలంటీర్‌ ద్వారా నేరుగా ప్రజల ఇంటికే చేరుస్తాం. ఇళ్లు, రేషన్‌కార్డులు, పెన్షన్‌ పొందాలంటే ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు. ప్రతి పథకాన్ని నేరుగా మీ ఇంటికే వచ్చి, మీ చేతుల్లోనే పెడతామని హామీ ఇస్తున్నా. ఏదైనా పథకం కోసం గ్రామ సచివాలయంలో దరఖాస్తు అందజేస్తే కేవలం 72 గంటల్లోనే పరిష్కరిస్తాం.
 
హోదా సాధించడానికి గట్టిగా కృషి చేస్తాం..  
రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదాను మన పాలకులు తాకట్టు పెట్టారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే హోదాను సాధించడానికి గట్టిగా కృషి చేస్తామని మాట ఇస్తున్నా.  పరిశ్రమల్లో ఉద్యోగాల సాధనకు అవసరమైన నైపుణ్యాలను మన పిల్లల్లో పెంపొందించడానికి ప్రతి జిల్లాలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. 

మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని చెప్పండి  
రాబోయే రోజుల్లో చంద్రబాబు ప్రతి ఓటర్‌ చేతిలో రూ.3 వేలు పెట్టి, ప్రలోభాలకు గురిచేస్తాడు. చంద్రబాబు ఇచ్చే డబ్బులకు మోసపోవద్దని ప్రతి ఒక్కరికీ చెప్పండి. మన అందరి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం, అన్నను ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను బడికి పంపిస్తే చాలు ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఇస్తాడని అక్కచెల్లెమ్మలకు చెప్పండి. ఎన్ని రూ.లక్షలు ఖర్చయినా సరేమన పిల్లలను అన్న పెద్ద చదువులు చదివిస్తాడని చెప్పండి. ఎన్నికల నాటికి పొదుపు సంఘాల్లోని మహిళలకు రుణం ఎంతైతే ఉంటే అంతే సొమ్మును నాలుగు దఫాల్లో నేరుగా మీ చేతుల్లోనే పెడతాడని చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాడని, ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారులను చేస్తాడని తెలియజేయండి. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం కింద నాలుగు దఫాల్లో రూ.75 వేలు ఇస్తాడని చెప్పండి. రాజన్న రాజ్యాన్ని జగనన్న మళ్లీ తీసుకొస్తాడని చెప్పండి. పెట్టుబడి కోసం ‘రైతు భరోసా’ కింద ప్రతి ఏడాది మే నెలలో ప్రతి రైతన్న చేతిలో రూ.12,500 పెడతాడని చెప్పండి. నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తాడని చెప్పండి. అన్నను ముఖ్యమంత్రి చేసుకుంటే గిట్టుబాటు ధరలకు గ్యారంటీ ఇస్తాడని చెప్పండి. పెన్షన్‌ను రూ.3 వేల దాకా పెంచుకుంటూ పోతాడని ప్రతి అవ్వాతాతకు చెప్పండి.  

ఇది మన అందరి ప్రభుత్వం అని ప్రజలంతా అనుకునేలా గొప్ప పరిపాలన అందిస్తాం. ప్రతి ఐటీడీఏ పరిధిలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తాం. గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తాం. ఆ జిల్లాలో గిరిజన మెడికల్‌ కాలేజీ, గిరిజన ఇంజనీరింగ్‌ కాలేజీ, గిరిజన యూనివర్సిటీ నెలకొల్పుతామని హామీ ఇస్తున్నా.
– పాడేరు సభలో..

చంద్రబాబు పాలన చూస్తే ఓ విషయం గుర్తుకొస్తోంది. ఒకడు ఉండేవాడట. అతడు తల్లికి అన్నం పెట్టడు గానీ చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తాను అన్నాడట. మీరొక సర్పంచ్‌ను గెలిపించుకున్నారు అనుకుందాం. ఐదేళ్లపాటు అతడు మిమ్మల్ని పట్టించుకోలేదు. మళ్లీ ఎన్నికలు వచ్చాయి. అతడు మళ్లీ పోటీకి దిగాడు. ఈసారి గెలిపిస్తే 2022 వచ్చేసరికి ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తా, 2029 నాటికి ప్రతి వీధికీ సిమెంట్‌ రోడ్లు వేయిస్తా, 2050 నాటికి మన గ్రామాన్ని మన జిల్లాలోనే నంబర్‌ వన్‌ గ్రామంగా మారుస్తా అని హామీ ఇచ్చాడట. అలాంటి వ్యక్తిని మీరు ఏమంటారు? 
మోసగాడు అనే అంటారు. చంద్రబాబు తీరు కూడా అలాగే ఉంది. 

సెజ్, పరిశ్రమ వచ్చినా రైతులకు నష్టం జరగొద్దు   
పిఠాపురం సభలో...
పాదయాత్ర రోజులు ఇంకా గుర్తున్నాయి. ఇదే నియోజకవర్గంలో నీరు–చెట్టు పథకం పేరిట అధికార పార్టీ నేతలు రూ.వందల కోట్లు దోచుకున్నారని ప్రజలు చెప్పారు. అవ్వాతాతలకు రావాల్సిన పెన్షన్‌ను టీడీపీ కార్యకర్తలకు ఇచ్చుకుంటారని తెలిపారు. ఏలేరు కాలువ ఆధునికీకరణ పనులు జరగలేదని, పిఠాపురం బ్రాంచ్‌ కెనాల్‌ పనులను పెండింగ్‌లో ఉంచారని నా దృష్టికి తీసుకొచ్చారు. కాకినాడ సెజ్‌ భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తానని చంద్రబాబు నాయుడు గతంలో హామీ ఇచ్చాడు. 2014 ఎన్నికల్లో నెగ్గి, సీఎం కుర్చీలో కూర్చున్నాక ఆ సెజ్‌ భూములు జగన్‌మోహన్‌రెడ్డివేనని అన్నాడు. ఈ భూముల్లో అడుగు పెట్టిన రైతులపై కేసులు పెట్టించాడు. ఏ సెజ్‌ వచ్చినా, ఏ పరిశ్రమ వచ్చినా రైతులకు నష్టం జరగకూడదు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లో రైతులతో కూడిన ఒక కమిటీని నియమిస్తాం. రైతుల ముఖాల్లో చిరునవ్వులు చిందేలా ఆ కమిటీ చేసే సిఫార్సులను అమలు చేస్తాం.  

మీకు అండగా నేనున్నా...  
పాదయాత్రలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నాను. ప్రజల కష్టాలు చూశా, వారి బాధలు విన్నాను. ప్రభుత్వం నుంచి వారు ఏం ఆశిస్తున్నారో తెలుసుకున్నా. రైతన్నలకు, పొదుపు సంఘాల్లోని అక్కచెల్లెమ్మలకు, చదువుకుంటున్న పిల్లలకు, చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు, అన్ని అర్హతలున్నా పింఛన్లు రాని అవ్వాతాతలకు, ప్రతి పేదవాడికీ భరోసా ఇస్తున్నా. మీకు అండగా నేనున్నాను అని గట్టిగా చెబుతున్నా.  

కాపు సోదరులకు హామీ ఇస్తున్నా... 
పిఠాపురంలో పాదయాత్ర చేస్తుండగా కాపు సోదరులు నా దగ్గరకొచ్చారు. చంద్రబాబు చేస్తున్న మోసాల గురించి చెప్పారు. కాపుల సంక్షేమానికి ఏడాదికి రూ.1,000 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.5,000 కోట్లు ఇస్తానన్న చంద్రబాబు చివరకు రూ.1,300 కోట్లు కూడా ఇవ్వలేదని చెప్పారు. ప్రతి కాపు సోదరుడికి చెబుతున్నా. మీ సమస్యలు నాకు తెలుసు. మీ అందరికీ చెబుతున్నా.. మీకు నేనున్నాను అని హామీ ఇస్తున్నా.  

బాబు డ్రామాలు, సినిమాలు  
ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి చంద్రబాబు చెప్పని అబద్ధం ఉండదు, చేయని మోసం ఉండదు. రోజుకొక సినిమా చూపిస్తాడు. రోజుకొక డ్రామా ఆడుతాడు. రాబోయే రోజుల్లో ఈ డ్రామాలు, మోసాలు, అబద్ధాలు మనకు ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. ఎన్నికల్లో గెలవడానికి ఏమైనా చేయడానికి చంద్రబాబు వెనుకాడడు. అధికారం కోసం సొంత మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి, పదవి నుంచి దింపేసి, చంపేసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తికి ఇంకొకరంటే లెక్కేలేదు. రాజకీయాలు దిగజారి పోయాయి. ఇవాళ రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు పెరిగిపోయాయి. విశ్వసనీయత అనే పదానికి అర్థం లేకుండా పోయింది. టార్చిలైట్‌ వేసి వెతికినా రాజకీయాల్లో విలువలు కనిపించడం లేదు. అందుకే ఈ వ్యవస్థలో మార్పు రావాలి. ప్రజలకు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయని రాజకీయ నాయకుడు ఇంటికి వెళ్లిపోయే పరిస్థితిని తీసుకురావాలి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement