సాక్షి, నెల్లూరు : ‘2004లో నాన్నగారికి ఒక్క అవకాశం ఇచ్చారు. ఆ తరువాత ఆ మహానేత చెరగని ముద్ర ప్రతి గుండెలో వేసుకొని చనిపోయిన తరువాత కూడా ఇంకా బతికే ఉన్నారు. ఒక్కసారి వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీకి, మీ బిడ్డగా జగన్‌కు అవకాశం ఇవ్వండి.. ఆ తరువాత రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమనే విధంగా మంచి పరిపాలనను అందిస్తాను. నేను చనిపోయిన తరువాత నాన్న ఫొటో పక్కనే నా ఫోటో ఉండేలా గొప్ప పరిపాలనను ఇస్తాను. 3648 కిలోమీటర్లు నా పాదయాత్ర చూశారు. ఈ పదేళ్లలో నేను చేసిన వందలకొద్ది ధర్నాలు, దీక్షలు, ఆందోళనలు చూశారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఈ రాష్ట్రాన్ని ఎలా మారుస్తానో చేసి చూపిస్తాను.’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. (చదవండి : ఆయన జన మోహనుడు )
ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నెల్లూరు పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనిల్‌కుమార్ యాదవ్, నెల్లూరు ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డిలను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే..
జగన్ అనే నేను...
‘నెల్లూరు బ్యారెజ్ పనులు.. దివంగత మహానేత వైఎస్సార్ హయాంలోనే సగం పూర్తయ్యాయి. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఇంతటి దారుణమైన పాలన ఎక్కడైనా ఉందా? ఫ్లాట్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో అని అడిగితే ప్రతి బిల్డర్ చెప్తాడు. స్థలాలు ఉచితమే.. లిఫ్ట్‌లు ఉండవు.. అలాంటి ఫ్లాట్‌లను అడుగుకు రూ.2వేలకు అమ్ముతున్నారు. మూడు లక్షలతో అయ్యే ఫ్లాట్‌ను రూ.6 లక్షలకు అమ్ముతున్నారు. ఇందులో లక్షన్నర కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంటా.. మరో లక్షన్నర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందంటా. బాగానే ఉంది. మిగిలిన రూ. 3 లక్షలను ప్రజలు కడుతూనే ఉండాలంట. పేదవాడి పేరిట అప్పురాస్తే.. నెలనెల కడుతుపోవాలంట. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. ఆ అప్పు మొత్తాన్ని మాఫీ చేస్తానని జగన్ అనే నేను హామీ ఇస్తున్నాను. ఈ విషయాన్ని పాదయాత్ర జరుగుతున్నప్పుడు కూడా చెబుతూ భరోసా ఇచ్చాను. మళ్లీ ఈ మాటనే పునరుద్ఘటిస్తున్నాను. వాళ్లు ఇచ్చే ఫ్లాట్‌లు వద్దనకండి. ఏదైతే అప్పుగా రాసుకున్నారో.. 20 ఏళ్ల పాటు నెలనెల రూ.3వేల కడుతుపోవాలో దాన్ని పూర్తిగా మాఫీ చేస్తాను.
నారాయణ కోసం..
ప్రతి జిల్లాలో యూనివర్సీటీ ఉండాలని వైఎస్సార్ సింహపురి యూనివర్సిటీని తీసుకొచ్చారు. ఏ ముఖ్యమంత్రి అయినా చదవులు బాగా చెప్పించాలని ఆలోచన చేయాలి.. కానీ అక్షరాల 200 టీచర్ పోస్టులు ఖాళీగా పెట్టారు. అదే యూనివర్సీటీలో అవినీతి అక్రమాలకు అడ్డు అదుపులేకుండా పోయింది. ఒక్కసారి రాష్ట్రంలోని చదువులపై ఆలోచన చేయమని కోరుతున్నా. పిల్లలను చదివించే కార్యక్రమాన్ని ప్రభుత్వం నుంచి మళ్లించి ప్రయివేట్ పరం చేయాలని ఆరాట పడుతున్నారు. కారణం బినామీగా ఉన్న నారాయణ స్కూళ్ల కోసం. ఎల్‌కేజీ చదవాలంటే వేలల్లో ఫీజుల వసూలు చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఆస్థులు అమ్ముకోకుండా మీ పిల్లలను చదివించే పరిస్థితి ఉందా? ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా.. దయలేని పరిపాలన..మనసులేని పరిపాలన.. మోసం చేసే పరిపాలన.. అబద్దాలు చెప్పే పరిపాలన.. ఆధర్మం చేసే పరిపాలన.. అవినీతి చేసే పరిపాలన.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఇదే కదా అని మీ అందరి సమక్షంలో అడుగుతున్నాను.
రాక్షసుడిలా చిత్రకరిస్తున్నాయి..
ఇక రాష్ట్రంలోని వ్యవస్థల పరిస్థితిని ఒక్కసారి చూడమని కోరుతున్నా. ఇక్కడే పక్కన మీ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ ఉన్నాడు. యువకుడు..సౌమ్యుడు. మంచి వాడు. పేదల కోసం సొంత డబ్బును ఖర్చుపెట్టేవాడు. కానీ ఇలాంటి వ్యక్తిని ఇదే ఈనాడు. ఆంధ్రోజ్యోతి, టీవీ9, టీవీ5 అమ్ముడుపోయిన మీడియా వ్యవస్థ ఏం చూపిస్తున్నాయి? అనిల్ ఏదో రాక్షసుడన్నట్టుగా పథకం, పద్దతి ప్రకారం చిత్రికరిస్తున్నాయి. కానీ ఇదే నారాయణ సంస్థలో పిల్లలు చనిపోతున్నారు.. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. సాక్షాత్తు 10 వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్లు పూర్తిగా లీకవుతున్నాయి. ఆ నారాయణ కాలేజీలో చేయని అన్యాయం ఉండదు. అటువంటి కాలేజీలకు సబంధించిన నారాయణ మాత్రం అహా ఓహో.. అని ఎంతటి గొప్ప వాడో అని రాస్తున్నాయి. ఈ అమ్ముడుపోయిన మీడియా వ్యవస్థను ఒక్కసారి గమనించమని కోరుతున్నా. వచ్చే గురువారం నాడే.. 11వ తేదిన ఎన్నికలు జరగబోతున్నాయి. మార్పు కోసం ఓటేయమని మీ అందరిని కోరుతున్నా.
ఎన్నికలు వచ్చే సరికి ఈ కుట్రలు మరింత పెరుగుతాయి. చంద్రబాబు చేయని మోసం ఉండదు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరిని కలిసి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి.’ అని వైఎస్ జగన్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment