పొరపాటున బాబుకు ఓటేస్తే.. అంతే సంగతి : వైఎస్‌ జగన్‌ | YS Jagan Speech In PayakaraoPeta Public Meeting | Sakshi
Sakshi News home page

పొరపాటున బాబుకు ఓటేస్తే..

Published Wed, Mar 27 2019 2:27 PM | Last Updated on Wed, Mar 27 2019 2:49 PM

YS Jagan Speech In PayakaraoPeta Public Meeting - Sakshi

సాక్షి, పాయకరావుపేట (విశాఖపట్నం) : ‘చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా ఉండదు. ఆర్టీసీ, కరెంట్‌ కూడా ఏమి మిగల్చడు.. అన్నీ ప్రైవేట్‌ పరం చేస్తారు.. చార్జీలు పెంచేస్తారు. ఇసుక, మట్టి, గుట్టలు, కొండలు, పొలాలు, నదులు సహా ఇక ఏమి మిగలవు.’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలను హెచ్చరించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చే హామీలు, ప్రకటనలు నమ్మితే నరమాంసం తినే రాక్షసిని నమ్మినట్టేనన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం విశాఖ జిల్లా పాయకరావుపేటలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. చంద్రబాబు గత చరిత్రను మరిచిపోవద్దని.. ఆయన అబద్దపు వాగ్ధానాలకు మరోసారి మోసపోవద్దని కోరారు. 

అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. పాయకరావు పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గొల్ల బాబూరావు , అనకాపల్లి ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ కాండ్రేగుల సత్యవతిలను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే..

చక్కెర ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి..
‘పాదయాత్రలో ఈ ప్రాంత రైతన్నలు చెప్పిన సమస్యలను మర్చిపోలేదు.  సహకార సంఘంలోని చక్కెర ఫ్యాక్టరీలు రూ.32 కోట్ల నష్టాలతో.. 9 నెలల జీతాలు అందకుండా నడుస్తున్నాయి. ఈ సీజన్‌లో రైతులకు ఒక్క రూపాయి చెల్లించలేదు. సహకార ఫ్యాక్టరీలు మూతపడుతున్నా చంద్రబాబుకు కనిపించడం లేదు. దివంగత మహానేత వైఎస్సార్‌ హయాంలో టన్నుకు రూ.4 వేల బోనస్‌ వచ్చేది. ఇవ్వాళ రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడం లేదు. వరాహ, తాండవ నదుల్లో ఇసుక ఏ మాత్రం లేకుండా దోచేస్తున్నారు. ఇసుక ఫ్రీ అంటూ చెవుల్లో పువ్వులు పెడ్తున్నారు. లారీ ఇసుకు రూ. 40 వేలు ఉంది. నీరు చెట్టు కింద గ్రామాలను గ్రామాలను దోచెస్తున్న పరిస్థితి. ఎలాంటి ప్రమాణాలు లేకుండా చెరువులను తాటిచెట్టంతా తవ్వేసారు. పాయకరావుపేటలో డిగ్రీ కాలేజీ లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతోంది. తాగు నీటి కోసం సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ లేదు.

పొరపాటున అధికారంలోకి వస్తే..
చంద్రబాబు ఐదేళ్ల పాలనపై ప్రజలు ఆలోచించాలి. చంద్రబాబు చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు గుర్తు తెచ్చుకోవాలి. రాష్ట్రంలో 6 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసేశారు. చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా ఉండదు. నారాయణ స్కూల్‌లో ఎల్‌కేజీ చదవాలన్నా రూ.25 వేలు ఉంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ ఫీజు రూ. లక్ష చేస్తారు. ఆర్టీసీ, కరెంట్‌ కూడా మిగల్చడు.. అన్నీ ప్రయివేట్‌ పరం చేస్తాడు. కరెంట్‌, ఆర్టీసీ, పెట్రోల్‌ సహా అన్నీ చార్జీలు పెంచేస్తాడు. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే.. రేషన్‌ కార్డులు, పెన్షన్‌లు కుదించేశాడు. ఇప్పుడిస్తున్న పెన్షన్లను కూడా మళ్లీ అధికారంలోకి రాగానే తగ్గించేస్తాడు. భూములు లాగేస్తాడు. ఇప్పటికే వెబ్‌ ల్యాండ్‌ పేరుతో తన అత్తగారి సొత్తంటూ పేదల భూమలు లాగేస్తున్నాడు. పొరపాటున బాబు అధికారంలోకి వస్తే.. ఇసుక, మట్టి, గుట్టలు, కొండలు, పొలాలు, నదులు, సహా ఇక ఏమీ మిగలవు.

జన్మభూమి కమిటీలదే రాజ్యం..
పొరపాటున చంద్రబాబుకు ఒటేస్తే.. మీరు ఏ సినిమా, టీవీ చానెల్‌ చూడాలన్నా.. ఏ పేపర్‌ చదవాలన్నా జన్మభూమి కమిటీలే నిర్ణయిస్తాయి. ఆఖరికి ఏ ఆసుపత్రికి వెళ్లాలో ఎంత డబ్బులు ఇవ్వాలో కూడా వారే చెబుతారు. ఎన్నికలకు మూడు నెలల ముందు చేసిన వాగ్ధానాలు.. పెట్టిన పథకాలను అధికారంలోకి రాగానే ఎత్తేస్తాడు.  చంద్రబాబు గత చరిత్రను మరిచిపోవద్దని కోరుతున్నా. 1994 ఎన్నికల ముందు మద్యపాన నిషేదం.. కిలో రెండు రూపాయల బియ్యమని చెప్పి.. ఎన్నికల్లో గెలిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 1995లో మద్యపాన నిషేధం ఎత్తేశారు. కిలో రెండు రూపాయల బియ్యాన్ని ఐదు రూపాయలు చేశారు. ఇదే పెద్దమనిషి మళ్లీ అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాలకు వడ్డీలు పెంచేస్తాడు. సున్నా వడ్డీ రుణాలుండవ్‌. రైతులకు రుణాలే ఇవ్వరు. ఆరోగ్యశ్రీ ఇప్పటికే పడకేసింది.. ఇంకా పూర్తిగా లేకుండా పోతుంది. 108,104లు కనుమరుగవుతాయి.  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అటకెక్కుతుంది. ఫీజులు ఆకాశానికి పడుగెత్తుతాయి. చంద్రబాబును వ్యతిరేకించే వారిని ఎవ్వరిని బతుకనివ్వరు. గ్రామం నుంచి రాజధాని వరకు తన పోలీసులే కాబట్టి కేసులు ఉండవు. సీబీఐ, సీఐడీని రానివ్వరు. పత్రికలు, టీవీలు ఇప్పటికే అమ్ముడుపొయ్యాయి. చనిపోయినా ఒక్క వార్త రాదు. వారే చంపించి పైగా బాధిత కుటుంబంపై నెట్టేస్తారు.

చివరి మూడు నెలలు చూపిస్తున్న సినిమాలు, డ్రామాలు నమ్మవద్దని కోరుతున్నా. వీటన్నిటిని నమ్మితే.. నరమాంసం తినే రాక్షసిని నమ్మినట్టే. ఒకసారి మోసపోయాం.. మళ్లీ అవే మోసాలు, అబద్దాలు చంద్రబాబు చెబుతున్నారు. ఈ సారి కూడా మోసపోతే మనమెవ్వరం ఉండం. చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి. రాజకీయాల్లో రాజకీయ నాయకుడు పలానా చేస్తానని చెప్పి... అధికారంలోకి వచ్చాక చేయకపోతే రాజీనామా చేసి వెళ్లిపోయే పరిస్థితి రావాలి.

అన్న ఉన్నాడని చెప్పండి..
ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు చేయని మోసం ఉండదు. కుట్రలతో ఈ ఎన్నికలు గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరికి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే 3వేలకు మోసపోవద్దని చెప్పండి. 15 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15వేలు ఇస్తామని, డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా.. ఎన్నికల నాటికి నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తామని తెలపండి. లక్షాధికారులను చేస్తామని ప్రతి అక్కా చెల్లెమ్మలకు చెప్పండి. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలకు రూ. 75 వేలు ఇస్తామని చెప్పండి. అవ్వా,తాతలకు మూడు వేల ఫించన్‌ మీ మనవడు ఇస్తాడని, రాజన్న రాజ్యాన్ని జగన్‌ పాలనలో చూస్తామని చెప్పండి.’ అని వైఎస్‌ జగన్‌ కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement