
సాక్షి, పెద్ద వడుగూరు : చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాలనను చూశారు. మరో సంవత్సరంలో ఎన్నికలు జరగబోతున్నాయనే నేపథ్యంలో మనకు ఎలాంటి నాయకుడు కావాలో మన మనస్సాక్షిని అడగాలి?. మనకు మోసం చేసేవాడు నాయకుడిగా కావాలా, అబద్ధాలు చెప్పేవారు కావాలా అనేది మనకు మనమే గుండెల మీద చేయి వేసుకుని ప్రశ్నించుకోవాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 27వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన పెద్ద వడుగూరు బహిరంగ సభలో మాట్లాడుతూ... గ్రామ గ్రామంలోనూ అవినీతే. జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాను తయారు చేశారు. రాష్ట్రంలో న్యాయంలేదు, ధర్మం లేదు, చివరకి గుడి భూములను కూడా చంద్రబాబు వదల్లేదు. కరెంట్ బిల్లులు షాక్ కొడుతున్నాయి.
ఇవాళ రేషన్ దుకాణాల్లో బియ్యం తప్పితే, ఏమీ ఇవ్వడం లేదు. రేషన్ షాపుల స్థానంలో చంద్రబాబు మాల్స్ పెడతారట. గతంలో రేషన్ షాపుల్లో 20 శాతం కాదు... 60 శాతం సబ్సిడీకి సరుకులు దొరికేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.ఇటీవల పేపర్లో చూశాను. గ్రామాల్లో మాల్స్ పెడతారట. రిలయన్స్ సంస్థలకు రేషన్ షాపులు అప్పగించి మాల్స్ పెట్టిస్తారట. అక్కడ 20 శాతం సబ్సిడీ ఇస్తారట. పూర్వం రేషన్ షాపుల్లో 60 శాతం సబ్సిడీకి ఇచ్చేవారని చంద్రబాబుకు తెలియదా. హెరిటేజ్ సంస్థకు భాగం ఉన్న ప్యూచర్ గ్రూపులకు ఈ మాల్స్ ఇవ్వనున్నారు.
ఇక జాబు రావాలంటే బాబు రావాలన్నారు. రాష్ట్రంలో కోటి 70 లక్షల ఇళ్లు ఉన్నాయి. ప్రతి ఇంటికి చంద్రబాబు 90 వేలు బాకీ ఉన్నారు. నాలుగేళ్ల తర్వాత బ్యాంకుల్లో పెట్టిన బంగారం వచ్చిందా?. రైతుల రుణాలు మాఫీ అయ్యాయా?’ అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఇన్ని అబద్ధాలు, మోసాలు చూశాం. మళ్లీ ఇలాంటి నాయకుడు మనకు కావాలా?. చంద్రబాబు తన అవసరం కోసం ఇంటికో కేజీ బంగారం, విమానం కూడా కొనిస్తానని చెబుతాడు. అలాగే ఆరోగ్యశ్రీ పరిస్థితి రాష్ట్రంలో దారుణంగా మారింది. పాదయాత్రలో చాలా మంది పిల్లలు, తల్లులు నా వద్దకు తీసుకొని వచ్చారు. హైదరాబాద్‌కు వెళ్తే ఆరోగ్యశ్రీ వర్తించడం లేదు. నరాలకు సంబంధించి పెద్ద ఆపరేషన్ చేయాలంటే హైదరాబాద్‌కు వెళ్తాం. ఆరోగ్యశ్రీ పేషేంటు హైదరాబాద్‌కు వెళ్తే డబ్బులు ఇవ్వడం లేదట.
దాదాపు 8 నెలల నుంచి ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బిల్లులు ఇవ్వడం లేదు. కిడ్నీలు బాగలేకపోతే డయాలసిస్ చేసుకోవాలంటే వారానికి రూ.2 వేలు ఖర్చు అవుతుంది. వారంలో రెండు మూడు సార్లు చేయించుకోవాల్సి వస్తుంది. అలాంటి కిడ్నీ షేషేంట్లకు డయాలసిస్ చేయడం లేదు. మూగ, చెవుడు ఉన్న పిల్లలకు కాంక్లీయర్ ఇన్‌ప్లాంటేషన్ ఆపరేషన్ చేయడం లేదు. క్యాన్సర్ పేషేంట్లకు కీమో థెరఫీ చేయాలంటే ఏడాదికి ఆరు లక్షలు ఖర్చు అవుతుంది. ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం రెండు, మూడుసార్లు మాత్రమే కీమో థెరఫీ చేస్తున్నారు. ఇవాళ 108 సకాలంలో రావడం లేదు. 108 వాహనానికి డీజిల్ లేదు. వేతనాలు ఇవ్వడం లేదు కాబట్టి ధర్నాలో ఉన్నామన్న సమాధానాలు వస్తున్నాయి.
104 వాహనం ద్వారా దీర్ఘకాలిక రోగులకు మందులు ఇవ్వడం లేదు. ఇంత దారుణమైన ఆరోగ్యశ్రీని నవరత్నాల్లో చేర్చాము. నాన్నగారు ఓ అడుగు ముందుకేస్తే... రెండు అడుగులు ముందుకు వేస్తున్నాను. వెయ్యి రూపాయలు బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ కింద చేర్చి ఉచితంగా వైద్యం చేయిస్తాం. ఆపరేషన్ అనంతరం ఇంట్లో విశ్రాంతి తీసుకునే రోగులకు కూడా డబ్బులు ఇస్తామని చెబుతున్నాను. కిడ్నీ పేషేంట్లకు నెలకు రూ.10 వేల పింఛన్ ఇస్తాం. ఆపరేషన్ చేయించుకునేందుకు మీరు ఎక్కడికి వెళ్లినా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని హామీ ఇస్తున్నాను. డెంగ్యూ జ్వరం వస్తే రూ.30 వేలు ఖర్చు అవుతోంది. ఇలాంటి జ్వరాలతో ప్రజలు మృత్యువాత పడుతున్నారు.
ఇలాంటి పరిస్థితులు మార్చేందుకు ఆరోగ్యశ్రీని మెరుగు పరుస్తాం. అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చి... ఆ తర్వాత వాటి అమలును పట్టించుకోని నాయకులకు బుద్ధి చెప్పాలంటే ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. రాజకీయ వ్యవస్థ బాగుపడాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడాలి. అలా చేయాలంటే అందరూ సహకరించాలి.నవరత్నాల్లో మార్పులు, చేర్పులకు సంబంధించి ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే మీరంతా నావద్దకు రావచ్చు. దారి పొడువునా నన్ను కలువవచ్చు. మీరు చూపించిన ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ..సెలవు తీసుకుంటున్నాను.’ అని అన్నారు.
చంద్రబాబు మాల్స్ పెడతారట...
Comments
Please login to add a commentAdd a comment