కడప గడ్డపై పుట్టినందుకు గర్వపడుతున్నా: జగన్‌ | YS Jagan Speech In Pulivendula Public Meeting | Sakshi
Sakshi News home page

కడప గడ్డపై పుట్టినందుకు గర్వపడుతున్నా: జగన్‌

Published Fri, Mar 22 2019 11:49 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

YS Jagan Speech In Pulivendula Public Meeting - Sakshi

సాక్షి, పులివెందుల : ‘నాన్నకు, నాకు పులివెందుల అంటే అమితమైన ప్రేమ. కడప గడ్డపై పుట్టినందుకు గర్వపడుతున్నా.. పులివెందుల గడ్డపై పుట్టినందుకు ఇంకా గర్వపడుతున్నా. ఇక్కడి ప్రజల మంచితనాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. కష్టాల్లో కూడా ఎలా ధైర్యంగా ఉండాలో నేర్పించింది ఈ గడ్డ. నాకు సహనాన్ని కూడా నేర్పించింది ఈ గడ్డే. కుట్రలు, కుతంత్రాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పించింది ఈ పులివెందుల గడ్డనే. ఒక చీకటి వచ్చిన తర్వాత వెలుగు వస్తుందని, నిజం కూడా ఏదో రోజు బయటకు వస్తుందని అప్పటి వరకు ఓర్పుగా ఉండాలని నేర్పించింది ఈ గడ్డ. రాతి గడ్డలో ఎలా సేద్యం చేయాలో నేర్పించింది ఈ గడ్డ. మాట కోసం ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకోవడం ఈ గడ్డ బిడ్డలుగా మనందరికీ తెలుసు’ అని ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఉద్వేగానికి లోనయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక సీఎస్‌ఐ చర్చి మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇటీవల హత్యకు గురైన తన చిన్నాన్నను గుర్తు చేసుకుంటూ.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రను పులివెందుల ప్రజలకు వివరిస్తూ ఆవేదనకు గురయ్యారు. వివేకానందరెడ్డి మృతికి నివాళులుగా రెండు నిమిషాలు మౌనం పాటించి తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

ఐదేళ్ల బాబు పాలన మోసం.. అబద్దం, దుర్మార్గం..
ఐదేళ్ల చంద్రబాబు పరిపాలన మొత్తం మోసం, అబద్దం, దుర్మార్గంతో సాగింది. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. రుణ మాఫీ కాక రైతులు అల్లాడుతున్నారు. సున్నా వడ్డీ లేదు, 90 శాతం పూర్తైన ప్రాజెక్టులు కూడా పూర్తి కాలేదు. రైతులు పడుతున్న బాధలన్నీ చూశాం.. అక్కా చెల్లమ్మలు పడుతున్న ఆగచాట్లను చూశాం. వారి బాధలను చెప్తుంటే విన్నాం. పసుపు కుంకుమతో చంద్రబాబు చేస్తున్న మోసాలను మనమంతా చూశాం. కడప స్టీల్‌ ఫ్యాక్టరీ పూర్తవుతుంది.. ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూసిన యువకులను చూశాం. ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్తున్న యువకులను గమనించాం. మీ మధ్య నిల్చొని చెబుతున్నా.. మీ బాధలను నేను విన్నాను. మీ అందరికి అండగా నేనున్నాను.

అంతా వైఎస్సార్‌ చలవే..
చంద్రబాబు పాలనలో అన్యాయాలు, మోసాలు, కుట్రలు,అబద్ధాలు చూశాం. పదవి కోసం సొంతమామను కుట్ర చేసి చంద్రబాబు చంపేశారు. అలాంటి పెద్ద మనిషి తన సొంత నియోజవకర్గం కుప్పంకు ఏం చేయలేదు. కానీ పులివెందులకు వచ్చి అన్నీ చేశానని వితండవాదం చేస్తున్నారు. పులివెందులలో ట్రిపుల్‌ ఐటీ,జేఎన్‌టీయూ, పశు పరిశోధనా కేంద్రం, కడప నుంచి పులివెందులకు నాలుగు లైన్ల రోడ్డు, గండి క్షేత్రంలో టీటీడీ దేవాలయం, పులివెందుల చుట్టూ రింగ్‌ రోడ్డు, ఎన్‌ఏసీ ఏర్పాటు, డ్రైనేజీ, పైడిపాలెం ప్రాజెక్ట్‌.. చిత్రావతి బ్యాలెన్సింగ్‌ ప్రాజెక్ట్‌ 90 శాతం పనులు.. ఇవన్నీ దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలోనే జరిగాయి. పులివెందుల మీద ప్రేమ అంటున్న చంద్రబాబు.. మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌, గండి కోట రిజర్వాయర్‌ పనులు ఎందుకు చేయలేదు. కడప స్టీల్‌ ప్రాజెక్ట్‌  ఎందుకు పూర్తి చేయలేదు?

మీ దీవేనలు.. ఆశీస్సులు మళ్లీ కావాలి
ఇదే పులివెందుల్లో మీరు వేసే ప్రతి ఓటు గుర్తురెగమంటున్నా.. జగన్‌ను ఎమ్మెల్యే చేయడానికే ఓటు కాదు. మీరేసే ఓటుతో రాష్ట్ర భవిష్యత్తుకే మార్పు వస్తుంది. నాలుగు దశాబ్దాలుగా నాన్నను, చిన్నానను, అమ్మను ఆదరించారు. నాన్న మరణం తర్వాత మీరంతా నాకు వెన్నుదన్నుగా నిలిచారు. మళ్లీ అవే దీవేనలు ఆశీస్సులు కావాలి. రాష్ట్రంలో విపరీతమైన కుట్రలు జరుగుతున్నాయి. ఇక్కడే చిన్నానను చూశారు. అంతటి సౌమ్యుడు ఎవరు ఉండరేమో.. ఆయనను అతి దారుణంగా చంపించింది వీరే. మళ్లీ బురద చల్లేది వీరే. వీళ్లే హత్య చేయిస్తారు. వాళ్ల పోలీసులతోనే విచారణ జరిపిస్తారు. ఆ రిపోర్టులను వక్రీకరిస్తూ.. వాటిని చూపించేది.. రాసేది వీళ్ల చానళ్లే. వీటన్నిటిని చూస్తుంటే.. రాజకీయలు ఇంత దారుణంగా దిగజారాయో అర్థం అవుతోంది. కడప జిల్లాలో గెలవలేమని తెలుసుకొని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఒక్క కడప జిల్లాలోనే కాదు రాష్ట్రం మొత్తం ఆయన అన్యాయ పాలనతో డిపాజిట్లు కొల్పేయే పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కుట్రలకు తెరలేపారు. చిన్నానను హత్యచేస్తే జమ్మలమడుగులో తిరిగేవాడుండరు.. మళ్లీ ఆ హత్యను ఆ కుటుంబంపై నెట్టేస్తేనే పులివెందుల్లో కూడా తిరిగేవారు ఉండరని కుట్రపన్నారు.

హత్యారాజకీయాలకు సిద్ధం కావాలని నిన్ననే.. చంద్రబాబు తన పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చారట. ఆ నేరాలను వైఎస్సార్‌సీపీపై మోపెందుకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట.. ఆనాడు చంద్రబాబు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో కుమ్మక్కై నాపై కేసులు వేశారు. ఇటువంటి పరిస్థితుల్లో నాకు అండగా నిలిచింది మీరే. భవిష్యత్తులో కూడా ఇదే మద్దతు కావాలి. టీడీపీ ఎంత రెచ్చగొట్టినా.. ఎటువంటి అన్యాయమైన కేసులు, అరెస్ట్‌లు చేసినా.. సంయమనంగా ఉండాలని కోరుతున్నా. మన నాయకులను అరెస్ట్‌ చేసే అవకాశాలున్నాయి. ఎన్నికలు మీరే చూసుకోవాలి. రావణుడి పాలన అంతం వానరులతోనే జరిగిందని గుర్తుపెట్టుకోవాలి.

చంద్రబాబు పార్టనర్‌ తెలుసు కదా?
చంద్రబాబు తన పార్టనర్‌తో స్క్రిప్ట్‌ చదివిస్తారు. ఆ పార్టనర్‌ ఎవరో తెలుసు కదా.. అదే ఓ​ యాక్టర్‌. డబ్బులు, డైలాగులు, అభ్యర్థులు అన్నీ చంద్రబాబువే. కేవలం బీఫారంలు మాత్రం ఆ యాక్టర్‌ ఇస్తాడు. చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై జగన్‌ ఇబ్బంది పెట్టడానికి ఉపయోగించిన సీబీఐ అధికారి తెలుసు కదా. ఆ అధికారిని తెలుగుదేశం భీమిలీ తరపున పోటీ చేయించాలనుకున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో పార్టనర్‌ పార్టీలోకి పంపించారు. ఆ యాక్టర్‌ నామినేషన్‌ వేస్తే టీడీపీ జెండాలు కనిపించాయి. ప్రతిపక్ష ఓట్లు చీల్చడానికి చంద్రబాబు ఆడాల్సిన డ్రామాలు ఆడుతున్నారు. మనకు ఇలాంటి డ్రామాలు.. సినిమాలు అవసరం లేదు. దేవుడిని నమ్ముతున్నాను. ప్రజలపై ఆధారపడ్డా. ఎన్ని కుట్రలు పన్నినా వచ్చేది మాత్రం మనందరి ప్రభుత్వమేనని చెబుతున్నా. రాబోయే రోజుల్లో విపరీతమైన డబ్బుతో చంద్రబాబు ఓట్లను కొనాలని చూస్తారు. ఆయన పంచే డబ్బులకు మన నవరత్నాలే పోటీ కావాలి. నవరత్నాలతో ఎంత మంచి జరుగుతుందో ప్రతి ఇంటికి చెప్పాలి’ అని వైఎస్‌ జగన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement