
సాక్షి, తాడేపల్లి: దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలుస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా షేక్ అన్నారు. తన మంత్రివర్గంలో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తానంటూ వైఎస్సార్‌ఎల్పీలో సీఎం జగన్ చేసిన ప్రకటనపై ఆయన హర్షం ప్రకటించారు. వైఎస్సార్‌ఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత పలువురు ఎమ్మెల్యేలు ‘సాక్షి’ టీవీతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలకు చెందిన ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా ఇవ్వాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మరో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్ అన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో ప్రజలకు సేవ చేసే అవకాశం తమందరికీ లభిస్తుందని వ్యాఖ్యానించారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. దేశ చరిత్రలో ఎవరు చేయనివిధంగా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను ఆయన నియమించనున్నారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి ఆయన శ్రమిస్తున్నారని, రాజన్న రాజ్యం దిశగా జగనన్న అడుగులు పడుతున్నాయని అన్నారు. ‘మ్యాన్ విత్ కమిట్‌మెంట్’ పదానికి పర్యాయపదంగా వైఎస్ జగన్ నిలుస్తారని, దేశమంతా ఆయన గురించి మాట్లాడుకునే రోజు దగ్గరలోనే ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. అవినీతి రహిత పరిపాలన అందించేందుకు ఆయన కృషి చేస్తున్నారని.. పార్టీకి అండగా నిలిచిన బడుగు, బలహీన వర్గాలకు ఆయన పెద్దపీట వేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.