సాక్షి, సీతంపేట(శ్రీకాకుళం) : అన్నంటే అన్నింటికీ అండగా ఉండాలి.. కానీ కేవలం తన అవసరానికి మాత్రమే అన్న అని చెప్పుకుంటూ చంద్రబాబు ప్రజల ముందుకు వస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఎన్నికల ముందు పసుపు- కుంకుమ అంటూ మహిళలను మరోసారి వంచించేందుకు సిద్ధమవుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ విజయమ్మ ప్రసంగించారు. ఈ సందర్భంగా నవరత్నాల పేరిట ప్రకటించిన పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందజేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్ సంక్షేమ పాలన మరోసారి రావాలన్నా, ప్రత్యేక హోదా కావాలన్నా వైఎస్సార్ సీపీకి ఓటేయాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. వైఎస్సార్ కంటే కూడా మెరుగైన పాలన అందించాలని కోరుకుంటున్న వైఎస్ జగన్ గెలవాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. అదే విధంగా ఏ ప్రలోభాలకు లొంగకుండా, మీకోసం నిజాయితీగా పోరాడుతున్న వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి కళావతమ్మను, ఎంపీ అభ్యర్థి గొడ్డేటి మాధవిని అత్యధిక మెజర్టీతో గెలిపించాలని ప్రజలకు విన్నవించారు.
ప్రజలంటే బాబుకు ఓటుబ్యాంకు మాత్రమే..
వైఎస్ విజయమ్మ ప్రసంగిస్తూ.. ‘ సంక్షేమం, అభివృద్ధి అంటే ఏంటో చూపిన నాయకుడు వైఎస్సార్ మాత్రమే. ఆయన అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మొత్తం మ్మీద 32 లక్షల ఎకరాలు ఇస్తే.. గిరిజనులకు 14 లక్షల ఎకరాలు ఇచ్చారు. ఆ భూములకు మీ పేరిటే పట్టాలు కూడా ఇచ్చారు. కానీ చంద్రబాబు ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తారు. గిరజనులకు మంత్రి పదవి కేటాయించాలని నాలుగేళ్లు చంద్రబాబుకు గుర్తుకు రాలేదు. ఎన్నికలకు మూడు నెలల ముందు ఓట్ల కోసం మంత్రిని చేశారు. కోర్టు మొట్టికాయలు వేస్తే గిరిజన సలహా మండలి ఏర్పాటు చేశారు. చంద్రబాబు పాలనలో గిరిజన హాస్టళ్లు మూతపడుతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రే దళారీ పనులు చేస్తుండటంతో రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. వైఎస్సార్ హయాంలో ప్రారంభమైన తోటపల్లి ఆధునీకరణ, వంశధార ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి కాలేదు. శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ ఏం చేశారు. సీఎం ఇచ్చిన మాటకే దిక్కు లేకుండా పోతే ఇక ఎవరికి చెప్పాలి. అసలు ప్రజలకు తానేం చేశాడని చంద్రబాబు ఓట్లు అడుగుతారు’ అని చంద్రబాబు పాలనా తీరును ఎండగట్టారు.
వైఎస్సార్ భార్యగా చెబుతున్నా
ఈరోజు న్యాయానికి, అన్యాయానికి యుద్ధం జరుగుతోందన్న వైఎస్ విజయమ్మ... విశ్వసనీయత, విలువలకు మారుపేరైన వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ‘ చంద్రబాబు పాలనలో ధరలన్నీ పెరిగిపోయాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒక్క పైసా నిధులు ఇవ్వలేదు. హైద్రాబాద్‌లో వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ చెల్లదంటున్నారు. జిల్లాల్లోనూ ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తారు. గిరుజనులు భూములకు పట్టాలు ఇస్తారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తారు. పెట్టుబడి సాయంగా రూ. 12, 500 అందిస్తారు. విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తారు. అక్కాచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడంతో పాటుగా ఎన్నికల నాటికి ఉన్న బకాయిలను నాలుగు దఫాలుగా మాఫీ చేస్తారు. వైఎస్ జగన్ తల్లిగా కాకుండా.. మీ గుండెల్లో ఉన్న వైఎస్సార్ భార్యగా చెబుతున్నా.. ఇచ్చిన ప్రతీ హామీని జగన్ తప్పక నెరవేరుస్తాడు’ అని పేర్కొన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment