ఎంవీఎస్ నాగిరెడ్డి
సాక్షి, విజయవాడ: ఎన్నికలకు నాలుగు నెలల ముందు ప్రవేశ పెట్టిన పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలను ఓటర్లను ప్రలోభపరిచేవిధంగా టీడీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది. ఇలా చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో ఎంవీఎస్ నాగిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ధనం ద్వారా అమలు చేస్తున్న ఈ పథకాలతోపాటు నిరుద్యోగ భృతి కింద యువతకు డబ్బులు చెల్లించేందుకు చంద్రబాబు సర్కారు జీఓలు కూడా జారీచేసిందని తెలిపారు. ప్రస్తుతం అమలవుతోన్న ప్రభుత్వ పథకాలను ప్రకటనలు, వీడియోల ద్వారా ప్రచారం చేసుకోవడం ఎన్నికల నియమాలు ఉల్లంఘించడమేనని.. ఇది ఓటర్లను తప్పుదోవ పట్టించడమేనని వివరించారు.
ఇదేవిధంగా తెలుగుదేశం పార్టీ హోర్డింగ్‌ల ద్వారా చేస్తున్న ప్రచారంలో కూడా ఎన్నికల సంఘం నియమ నిబంధనలను ఉల్లంఘించిందని మరో ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు లక్షల రూపాయలు హోర్డింగ్‌ల కోసం ఖర్చు పెట్టవచ్చని అయితే ప్రతి జిల్లాలో టీడీపీ 600 హోర్డింగ్ లను ఏర్పాటుచేసి తద్వారా 66,60,000 వ్యయం చేసిందని వెల్లడించారు. ఆంధ్రజ్యోతి,ఈనాడు దినపత్రికలలో తెలుగుదేశం పార్టీకి మేలు చేసి ఓటర్లను తప్పుదారి పట్టించేవిధంగా పెయిడ్ ఆర్టికల్స్ వస్తున్నాయని ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిభందనలకు విరుద్దంగా ఉన్న పెయిడ్ ఆర్టికల్స్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీకి నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment