ఇకపై ప్రజాక్షేత్రంలోకి.. | Ysrcp former mp's about their resignations | Sakshi
Sakshi News home page

ఇకపై ప్రజాక్షేత్రంలోకి..

Published Fri, Jun 22 2018 4:34 AM | Last Updated on Tue, Oct 16 2018 3:40 PM

Ysrcp former mp's about their resignations  - Sakshi

రాజీనామాల ఆమోదంతో ప్రత్యేకహోదా పోరాటంలో తమ చిత్తశుద్ధి మరోసారి రుజువైందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీలు చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను దేశవ్యాప్తంగా తెలిపామన్నారు. ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. హోదా, విభజన హామీల కోసం ఇకపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామన్నారు. ఇకనైనా టీడీపీ నేతలకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ల ఎంపీలు రాజీనామాలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్‌ చేశారు.  


రాజీలేని పోరాటం చేశాం: మేకపాటి
ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో నాలుగేళ్లుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తోందని నెల్లూరు పార్లమెంట్‌ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ చెందిన ఐదుగురు ఎంపీల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించారని చెప్పారు. రాష్ట్ర ప్రజల హక్కు అయిన హోదా ఉద్యమాన్ని దేశప్రజలందరికీ తెలిసేలా ఢిల్లీ వేదికగా పోరు సాగించామని చెప్పారు.

రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, హోదాతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. హోదా కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజీలేని పోరాటం చేశామన్నారు. హోదా ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాజీనామాలు చేశామని తెలిపారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని దేశ ప్రజలందరికీ వివరించామని, ఢిల్లీలో ఆమరణ దీక్షలు కూడా నిర్వహించామని చెప్పారు.

స్పీకర్‌ ధర్మాన్ని నెరవేర్చారని, రెండు మూడు సార్లు తమతో మాట్లాడి రాజీనామాలు ఉపసంహరించే ప్రయత్నం చేశారని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతోందని వివరించి తమ రాజీనామాలు ఆమోదించాల్సిందిగా కోరామన్నారు. మార్చి 15న అవిశ్వాసానికి నోటీసు ఇచ్చామని, దానిపై చర్చ జరగకపోవటంతో వరుసగా 13 సార్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చామని తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేసే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం మనందరి ఖర్మ అని మేకపాటి ధ్వజమెత్తారు.

ప్రత్యేక హోదా విషయంలో రోజుకో రకంగా మాట్లాడి, డ్రామాలాడిన చంద్రబాబుకు ప్రజలే గట్టిగా బుద్ధి చెబుతారన్నారు. టీడీపీ ఎంపీలు డ్రామాలు వేయకుండా చిత్తశుద్ధితో రాజీనామాలు చేసుంటే కచ్చితంగా కేంద్రం దిగి వచ్చేదన్నారు. తమకు ఉప ఎన్నికలను ఎదుర్కొంటామని సృష్టం చేశారు. నిత్యం ప్రగల్భాలు పలికే చంద్రబాబుకు అందరు కలిసి బుద్ధి చెప్పాలన్నారు. నీత్‌ ఆయోగ్‌ సమావేశానికి వెళ్లిన చంద్రబాబు.. మోదీ ఎడమచేతి కరచాలనం కోసం ఎంతగానో తపించిపోయి వంగివంగి మరీ కరచాలనం చేశారన్నారు.

ఉప ఎన్నికల్లో ప్రత్యేక హోదానే ప్రధానాంశం..: వైవీ
ఉప ఎన్నికల్లో ప్రత్యేక హోదానే ప్రధాన అంశమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఎంపీల రాజీనామా ఆమోదిస్తున్నట్టు లోక్‌సభ సచివాలయం నుంచి ప్రకటన వెలువడిన కొద్దిసేపటికి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ రోజైనా మా రాజీనామాలు ఆమోదించడాన్ని స్వాగతి స్తున్నాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించడం కోసం ఏప్రిల్‌ 6న రాజీనామాలు చేశాం. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశాం.

అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా స్పందించకుండా కేంద్రం, స్పీకర్‌ రాష్ట్రానికి అన్యాయం చేశారు. వీటన్నింటికీ నిరసనగా మేం మా పార్లమెంటు సభ్యత్వానికి ఏప్రిల్‌ 6న అంటే లోక్‌సభకు ఇంకా 14 నెలల సమయం ఉందనగా రాజీనామాలు చేశాం. త్వరలోనే ఈ ఐదు పార్లమెంటు స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయి. ప్రత్యేక హోదాయే మా ప్రధాన అంశం. ప్రజలు తమ ఆకాంక్షలను ఈ ఎన్నిక ద్వారా కేంద్రానికి తెలియపరుస్తారు. మేం ఇక ప్రజల్లోకి వెళతాం.

రాష్ట్రానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవిధంగా అన్యాయం చేశాయో వివరిస్తాం. వాళ్ల మద్దతు కూడగడతాం..’ అని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీల రాజీనామాలు డ్రామాలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా.. ‘‘మావి కాదు డ్రామాలు.. టీడీపీ వాళ్లవి డ్రామాలు’ అని ధ్వజమెత్తారు. బీజేపీతో కుమ్మక్కయ్యారని వస్తున్న విమర్శలను వైవీ ఖండించారు. ‘‘13సార్లు అవిశ్వాస తీర్మానం ఎవరు పెట్టారు? మీరు పెట్టారా? మేమా? కుమ్మక్కయ్యేవాళ్లమయితే అవిశ్వాస తీర్మానం పెడతామా? కలసి కాపురం చేసి ఇప్పుడొచ్చి మేం కుమ్మక్కయ్యామని అంటావు? అమరావతిలో ఉన్నప్పుడేమో మోదీ దాడి చేస్తున్నాడని అంటావు.

ఢిల్లీ వచ్చి కాళ్లూ గడ్డాలు పట్టుకుంటావు. నిజంగా రాష్ట్రప్రయోజనాలపై చిత్తశుద్ధి ఉంటే నీతిఆయోగ్‌ సమావేశంలో మన వాదన వినిపించి వాకౌట్‌ చేసి ఉండాల్సింది. నువ్వు ఆ పనిచేశావా? ’’ అంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఎన్నికలు కావాలని తాము ఆశిస్తున్నామని, ఎన్నికలు వద్దని చంద్రబాబు అనుకుంటున్నారని చెప్పారు. ఎన్నికలు వస్తేనే మా రాజీనామాలకు సార్థకత వస్తుందన్నారు.

మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం: వరప్రసాదరావు
ప్రత్యేకహోదా సాధన కోసం రాజీనామా చేసి చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని తిరుపతి మాజీ ఎంపీ వి.వరప్రసాదరావు అన్నారు. రాజీనామాలు ఆమోదించటం సంతోషంగా ఉందన్నారు. దమ్ము ధైర్యం ఉంటే టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. రాజీనామాలు ఆమోదం పొందిన సందర్భంగా ఎంపీ వరప్రసాద్‌ సాక్షితో మాట్లాడుతూ.. చంద్రబాబు  ప్రత్యేకహోదాను హేళన చేశారని, హోదా సంజీవిని కాదన్నారని చెప్పారు.

ధైర్యముంటే, మనస్సాక్షి ఉంటే టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ ముందుకు వెళ్తోందని, రాబోయే ఎన్నికల్లో పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఏదోరకంగా ప్రజల్ని మోసం చేసి తాము కూడా పోరాడుతున్నామని చెప్పుకునేందుకు టీడీపీ డ్రామాలాడుతోందని మండిపడ్డారు. టీడీపీ ఎంపీల డ్రామాలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.

లోక్‌సభ మూసివేశాక లోపలకు వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసి.. ప్రత్యేక హోదా కోసం ఏదో చేశామని చెప్పుకునేందుకు హడావుడి చేశారని, రాబోయే రోజుల్లో మరిన్ని డ్రామాలు ఆడబోతున్నారని చెప్పారు. తాము ఎన్నికలను సవాల్‌గా తీసుకుంటున్నామన్నారు. ప్రజా సంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పెద్దఎత్తున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే.. ఆయన ప్రత్యేకహోదా కోసం చూపిస్తున్న ప్రాధాన్యతను బట్టే అని చెప్పారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లి ఏమీ తీసుకురాలేని అసమర్థుడు చంద్రబాబు అని విమర్శించారు.

రాష్ట్రం కోసం పదవీత్యాగం సంతోషదాయకం
రాష్ట్రం కోసం పదవులు వదులుకోవడం సంతోషదా యకంగా ఉందని కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి పదేళ్లు కాదు, పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలంటూ బీజేపీ, టీడీపీ కలసి కోరాయని, అదే నినాదంతో 2014 ఎన్నికలకు వెళ్లారని, అధికారంలోకి వచ్చిన ఆ రెండు పార్టీలు హోదా మాటే మరిచాయని విమర్శించారు.

ప్రత్యేక హోదా సంజీవిని కాదు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అంటూ సీఎం ప్రకటనలు చేశారని, ఇలాంటి తరుణంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ప్రత్యక్ష పోరాటం చేశామని చెప్పారు. అన్నీ ప్రయత్నాలు చేసి తుదకు పదవులకు రాజీనామాలు చేశామని వివరించారు. రాజీనామాలు ఆమోదించడంలో కూడా ఆలస్యం చేశారని చెప్పారు. ఇకపై ప్రజల మధ్యనే ఉంటూ ప్రత్యక్ష పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలుపుకోవడంలో రెండు పార్టీలు విస్మరించిన వైనాన్ని దేశవ్యాప్తం చేశామన్నారు.  

బీజేపీ, టీడీపీలకు బుద్ధిచెప్పేలా అడుగులు
ఇక బీజేపీ, టీడీపీలకు బుద్ధిచెప్పేలా తమ అడుగులు ఉంటాయని మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తెలిపారు. రాజీనామా ఆమోదం పొందిన నేపథ్యంలో ‘సాక్షి’తో మిథున్‌రెడ్డి మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటాలను మరింత ఉధృతం చేస్తామన్నారు. హోదా కోసం తాము చేసిన రాజీనామాలను ఆమోదించేందుకు కూడా ఇంతో సమయం తీసుకున్నారంటే ప్రత్యేక హోదా ఆకాంక్ష ప్రజల్లో ఎంత బలీయంగా ఉందో అర్థమవుతుందన్నారు.

వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో ప్రత్యేక హోదాను సాధించి తీరుతామన్నారు. ఇక ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు రెండు నాల్కల ధోరణి వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. ఎన్నికలంటే బాబుకు ఫీవర్‌ వస్తుందన్నారు. ప్రత్యేక హోదాను సాధించేందుకు రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు.


– సాక్షి, నెట్‌వర్క్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement