
వైఎస్సార్‌సీపీ నేత ఎండీ ఇక్బాల్
హైదరాబాద్: నాలుగున్నరేళ్లుగా మైనార్టీలకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వైఎస్సార్‌సీపీ నేత ఎండీ ఇక్బాల్ సూటిగా ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇక్బాల్ విలేకరులతో మాట్లాడుతూ.. ముచ్చటగా మూడు నెలల కోసం మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వడం చూస్తే ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని అన్నారు. మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని చంద్రబాబు అంటున్నారే గానీ..బీజేపీకి వ్యతిరేకంగా అని మాత్రం చెప్పడం లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు, ముస్లింలను ద్వితీయ శ్రేణి వర్గాలుగా గుర్తిస్తున్నారని ఆరోపించారు.
‘చంద్రబాబు దృష్టిలో ముస్లింలంటే ద్వితీయశ్రేణి పౌరులు. వారిపై జులుం ప్రదర్శించడం, వారికి ఏమాత్రం గౌరవం ఇవ్వకపోవడం ఆయన వద్ద పనిచేసే వారు నిత్యం చూస్తూ ఉంటారు. హజ్‌యాత్రకు వెళ్లే వారి వద్దకు చంద్రబాబు వెళ్లకుండా వారినే తన వద్దకు పిలిపించుకుని సంప్రదాయాలను కాలరాసి అవమానించారు. ప్రస్తుతం మీరు మంత్రివర్గంలో తీసుకున్న సామాజికవర్గాలు సైతం అనుకుంటున్నాయి. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ సామాజిక వర్గాల వారి ఓట్లు చంద్రబాబుకు అవసరం కాబట్టి ముణ్నాళ్ల ముచ్చటైన మంత్రి పదవులను అప్పగించారంటున్నారు. ప‍్రధానంగా తెలంగాణ ఎన్నికలు జరగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానంటూ చంద‍్రబాబు ఇతర పార్టీల వద్దకు వెళుతున్నారు. వాస్తవానికి ప్రస్తుత మంత్రివర్గంలో స్థానం కల్పించిన ఫరూక్, మండలి చైర్మన్‌గా ఇచ్చిన షరీఫ్, చాంద్ బాషాలు గత నాలుగున్నరేళ్లుగా మీ టీడీపీలోనే ఉన్నారు. అప్పుడు వీరికి కేబినెట్‌లో స్థానం కల్పించడానికి ఏ పరిస్థితులు అడ్డువచ్చాయి. దీనికి చంద‍్రబాబు సమాధానం చెప్పాలి. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే చర్యలు ఇవి కావా’ అని ఇక్బాల్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment