కేసీఆర్‌వి ఎన్నికల వ్యాఖ్యలే | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌వి ఎన్నికల వ్యాఖ్యలే

Published Fri, Nov 3 2023 5:19 AM

Sajjala Ramakrishna Reddy Comments On CM KCR - Sakshi

సాక్షి, అమరావతి: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నందునే ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ ఏపీ గురించి మాట్లాడుతున్నారేమో అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన గురువారం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా మీడియా ప్రతినిధులు కేసీఆర్‌ వ్యాఖ్యల గురించి ప్రశ్నించారు. దీనికి సజ్జల స్పందిస్తూ.. ఎన్నికల్లో గొప్పగా చెప్పుకోవడానికి కేసీఆర్‌ చిన్నచిన్న రోడ్ల గురించి మాట్లాడి ఉండవచ్చని అన్నారు.

మన రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో సుపరిపాలన అందిస్తోందని, ప్రజల ప్రశంసలు అందుకుంటోందని చెప్పారు. రాష్ట్రంలో తెచ్చిన పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పింఛన్‌ పథకాన్ని కేసీఆరే మెచ్చుకొన్నారని, వైఎస్‌ జగన్‌లాగా పెన్షన్‌ అందిస్తామని ఈమధ్యనే చెప్పారని అన్నారు. పోలవరం విలీన మండలాల ప్రజలను మళ్లీ తెలంగాణలో కలుస్తారా.. అని అడిగితే వెళ్లబోమని అంటున్నారని అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ అందిస్తున్న సంక్షేమ పథకాలు నచ్చాయని వారు చెబుతున్నారని చెప్పారు. తాము పక్క వారి గురించి ఎప్పుడూ మాట్లాడబోమని తెలిపారు. 

బాబు ర్యాలీలో అంతా అదే వర్గం
బుధవారం హైదరాబాద్‌లో చంద్రబాబు ర్యాలీకి వచ్చిన వారంతా పచ్చ కార్యకర్తలు మాత్రమేనని సజ్జల చెప్పారు. వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు అంతకంటే ఎక్కువ మంది ప్రజలు వస్తున్నారని తెలిపారు. లోకేశ్‌ పాదయాత్రలో ఏనాడైనా జనం కనిపించారా అని ప్రశ్నించారు. రోగం వచ్చిందని కోర్టుకు చెప్పి జైలు నుంచి బయటకు వచ్చిన వ్యక్తి 14 గంటలపాటు కారులో ఎలా కూర్చున్నారని మాత్రమే తాము అడిగామన్నారు. జబ్బులు ఉన్నాయని, ఆరోగ్యం బాగోలేదని కోర్టుకు అబద్ధాలు చెప్పారన్నారు.  కోర్టు నిబంధనలను చంద్రబాబు పాటించలేదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement